Gold Smuggling: ఇదేందయ్యా ఇది.. చాక్లెట్లలో బంగారం స్మగ్లింగ్ - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Gold chocklates seized: అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా శంషాబాద్ విమానాశ్రయానికి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. రకరకాల పద్ధతులలో స్మగ్లింగ్ సాగిస్తున్నారు. అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అక్రమార్కులు బంగారాన్ని దేశంలోకి తరలిస్తున్నారు. పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, మనిషి ప్రైవేట్ భాగాల్లో పెట్టుకుని తెస్తున్నారు. పాదరక్షలు, లగేజ్ బ్యాగుల ప్రత్యేక లేయర్లలో బంగారం తెస్తున్నట్లుగా ఇటీవల పలు కేసుల్లో బయటపడింది.
తాజాగా అక్రమంగా తరలిస్తున్న 13 బంగారు చాక్లెట్లను శంషాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో వారి సామాగ్రిని అధికారులు తనిఖీ చేశారు. చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించి తీసి చూడగా అవన్ని బంగారు చాక్లెట్లుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 269 గ్రాములు బరువైన 13 చాక్లెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు 16.5లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.