గంజాయి దొంగలు చెప్పిన సమాధానంతో హతాశులైన పోలీసులు
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 1:13 PM IST
Ganja Theft in Police Station: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో వింత చోరి చోటు చేసుకుంది. గత రెండు రోజుల క్రితం గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిని గంజాయి ఎక్కడి నుంచి లభించిందని విచారించిన పోలీసులకు మతిపోయినంత పనైంది. పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన గంజాయినే దొంగతనం చేశామని చెప్పిన నిందితుల సమాధానంతో పోలీసులు అవాక్కైయ్యారు. దొంగలు చెప్పిన మాటలు ధృవీకరించుకోవడానికి తమ స్టేషన్ను పరిశీలించిన వారికి .. జరిగింది వాస్తమని తేలడంతో పోలీసులు హతాశులయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం పలు కేసుల్లో పట్టుబడిన గంజాయిని అనకాపల్లి జిల్లా యలమంచిలి రూరల్ పోలీస్‌స్టేషన్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. అయితే రెండు రోజుల క్రితం సోమన్నపాలెం సమీపంలో గంజాయి రవాణా చేస్తూ 6గురు యువకులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి తరలిస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లోని స్ట్రాంగ్ రూంలో గంజాయిని దొంగిలించినట్లు వారు వివరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్టేషన్లోని గంజాయిని తూకం వేయగా, పట్టుబడిన గంజాయి, తూకంలో తక్కువ వచ్చిన దానికి సరిపోలింది. పలు దఫాల్లో చోరి చేయగా, ఇప్పుడు తరలిస్తూ పట్టుబడినట్లు దొంగలు వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సారి దర్యాప్తును పకడ్బందీగా జరుపుతున్నట్లు సమాచారం.