ఎట్టకేలకు తల్లి చెంతకు చిరుత పిల్లలు- అటవీశాఖ 10 రోజుల ఆపరేషన్ సాగిందిలా! - Forest Department Re Unites Leopard Cubs
🎬 Watch Now: Feature Video
Published : Dec 17, 2023, 10:52 AM IST
Forest Department Re Unites Leopard Cubs : చెరకు తోటలో ఉన్న చిరుత పిల్లలను తిరిగి తల్లి వద్దకు చేర్చారు అటవీ అధికారులు. అందుకోసం 10 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
ఇదీ జరిగింది
మైసూరులోని ఐరాహళ్లి గ్రామ సమీపంలో చెరకు తోటలో మూడు చిరుత పిల్లలను గ్రామస్థులు గుర్తించారు. ఈ విషయాన్ని వారు మైసూరు ప్రాంతీయ అటవీ అధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ మూడు చిరుత పిల్లలను స్వాధీనం చేసుకుని అట్టపెట్టెలో పెట్టారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాను అమర్చారు.
అయితే పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లి చిరుత వస్తుందని తొలిరోజు వేచిచూశారు అధికారులు. ఎంతకీ రాకపోవడం వల్ల రెండో రోజు బోనును ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం తల్లి చిరుత బోనులో చిక్కింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తల్లి చిరుతతో పిల్లలను చాముండి రిహాబిలిటేషన్ కేంద్రానికి అధికారులు తరలించారు. మూడు, నాలుగు రోజుల్లో పిల్లలతో చిరుత ఆనందంగా మెలిగేటట్టు చేశారు.
ఐదో రోజు తల్లి చిరుతోతపాటు పిల్లలను అడవిలోకి తీసుకువెళ్లారు అధికారులు. ఆరో రోజు బోను నుంచి బయటకొచ్చిన తల్లి చిరుత సురక్షితమైన ప్రదేశం కోసం వెతికింది. ఏడో రోజు తల్లి చిరుత పిల్లలు ఉన్న ప్రదేశానికి వచ్చి బయట నుంచి తనిఖీలు చేసి తిరిగి బోనులోకి వెళ్లింది. ఎనిమిదో రోజు కూడా తల్లి చిరుత రాకపోవడం వల్ల చిరుత పిల్లలకు అటవీ సిబ్బంది పాలు పెట్టారు. ఎట్టకేలకు తొమ్మిదోరోజు నల్ల చిరుత పిల్ల సహా రెండు పిల్లలను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది తల్లి. పదో రోజు మరో పిల్లను కూడా తీసుకెళ్లింది. అలా అటవీశాఖ చేపట్టిన 10 రోజుల ఆపరేషన్ విజయవంతమైంది.