Viral Video : నీలకంఠుడికి పూజ చేస్తుండగా.. కోనేరులో ఈవో జలకాలాట
🎬 Watch Now: Feature Video
Neelakanteswara swamy temple EO swims in Pushkarini : నిజామాబాద్ నీలకంఠేశ్వర్ ఆలయం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది దక్షిణ కాశీ. ఈ ఆలయంలో ప్రతి సోమవారం నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. పూజలు నిర్వహించిన తర్వాత ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఎల్లప్పుడూ ఈ కోవెల భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. భక్తుల కొంగుబంగారమై ఈ నీలకంఠుడు కోరిందల్లా నెరవేర్చుతాడనే అందరూ విశ్వసిస్తుంటారు.
ఇలాంటి ప్రసిద్ధ ఆలయంలో ఏకంగా ఆలయ ఈవోనే కాస్త విచిత్రంగా ప్రవర్తించాడు. కంఠేశ్వర స్వామి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణిలో ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే ఆలయ ఈవో వేణు ఈత కొడుతూ జలకాలాడారు. ఓవైపు స్వామి పూజ జరుగుతుండగా.. అలా చేయొద్దని అర్చకులు ఈవోను వారించారు. అక్కడ భక్తిశ్రద్ధలతో స్వామి అభిషేకాన్ని తిలకిస్తున్న భక్తులు కూడా ఈవోకు నచ్చజెప్పారు. ఎవరెన్ని చెప్పినా వినకుండా ఈవో.. స్వామికి అభిషేకం జరుగుతుండగా దర్జాగా ఈత కొడుతూ స్నానం చేశాడు. ఇదంతా అక్కడున్న ఓ భక్తుడు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయాన్ని పరిరక్షించాల్సిన ఈవో ఈ విధంగా ప్రవర్తించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.