Dog And Snake Fight: పిల్లల కోసం పాముతో ఆ తల్లి పోరాటం చివరకు...? - తెలంగాణ తాజా
🎬 Watch Now: Feature Video
Dog And Snake Fight: సృష్టిలో తల్లి ప్రేమ గొప్పది. అది వర్ణించలేనిది. తన పిల్లల జోలికి వస్తే ఏ జీవి అయిన తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. తన పిల్లలను రక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది. అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తన పిల్లలను కాటేసిన పాముతో పోరాటమే చేసింది ఒక కుక్క. మిగతా ఇద్దరి పిల్లల్నైనా కాపాడుకోవాలన్న ఆ తల్లి పామును.. చంపి తాను చనిపోయింది.
తాను చనిపోయి ఇద్దరి పిల్లల్ని కాపాడింది: ఖమ్మం నగర శివారు కొత్తగూడెంలో పల్లపు చంద్రయ్య, వరలక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. వారు ఒక ఆడ కుక్కను పెంచుకుంటున్నారు. అది ఇటీవల నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అర్ధరాత్రి ఇంటి ముందు కుక్కలు పెద్దగా అరవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి, తమ ఇంటి ఆవరణలోని బైక్‌పై పడగవిప్పి ఆడుతున్న నాగుపాము కనిపించింది. వారి పెంపుడు కుక్క తన రెండు పిల్లల్ని కాటేసిన పామును అడ్డుకుంటుంది. పాము కుక్కను కాటేసేందుకు యత్నిస్తోంది. చాలా సేపటి వరకు పాము, కుక్క మధ్య పోరాటం సాగింది. ఈ పోరులో కుక్క, పాము రెండూ చనిపోయాయి. రెండు కుక్క పిల్లలు సైతం చనిపోయాయి. ఈ గలాటాకు అక్కడకు చేరుకున్న యువకుడు తన చరవాణిలో ఈ పోరాటాన్ని చిత్రీకరించాడు. చివరికి ఆ కుక్క తాను చనిపోయినా మిగిలిన రెండు పిల్లల్ని బతికించుకుంది.