'ఆస్కార్ కోసం RRR రూ. 80 కోట్లు ఖర్చు.. ఆ డబ్బుతో 8 సినిమాలు తీయొచ్చు' - ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
🎬 Watch Now: Feature Video
ఆస్కార్ బరిలో నిలిచి.. అవార్డుకు అడుగు దూరంలో ఉన్న RRR సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆస్కార్ అవార్డు కోసం RRR చిత్ర బృందం.. రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేసిందని చెప్పారు. ఆ డబ్బుతో మరో 8 చిత్రాలు నిర్మించవచ్చని సూచించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో.. వ్యాపారం పెరిగి సామాజిక స్పృహా లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు రాజేశ్ టచ్ రివర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలోని నిర్వహించిన 'వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం' అనే అంశంపై.. మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజ ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య చిత్రాలు, సామాజిక చిత్రాలపై పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ.. "ఇప్పుడు ఎక్కువ మంది దర్శకులు తమ తృప్తి కోసమే సినిమాలు తీస్తున్నారు. సమాజంలో మార్పును ఆశిస్తూ సినిమాలు తీయడం లేదు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు తీయాలని చాలా మంది ఆశిస్తారు. కానీ చివరకు సాధారణ సినిమానే తీస్తారు." అని చెప్పారు.