మూడు చీతా కూనలకు జన్మనిచ్చిన 'ఆశ'- ఆనందంగా ఉందన్న కేంద్రమంత్రి - ప్రాజెక్ట్ చీతా నమీబియా
🎬 Watch Now: Feature Video
By PTI
Published : Jan 3, 2024, 7:12 PM IST
Cheetah Cubs Born In Kuno National Park : ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆశ అనే చీతాకు మూడు కూనలు జన్మించాయి. కేంద్ర ఆటవీ, పర్యావరవరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్స్‌లో ఈ మేరకు పోస్టు చేశారు. కూనో జాతీయ పార్కు ముగ్గురు నూతన సభ్యులను స్వాగతించిన విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రాజెక్టు చీతాలో భాగమైన నిపుణులకు, కూనో వన్యప్రాణి సంరక్షణ కేంద్ర అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 2023 మార్చిలో షియాయా అనే మరో నమీబియా చీతాకు నాలుగు కూనలు జన్మించగా అనారోగ్య కారణాలతో మూడు కూనలు మృతి చెందాయి.
ప్రాజెక్ట్ చీతా
భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువైన చీతాలు భారత్‌లో 75 ఏళ్ల క్రితమే కనుమరుగైపోయాయి. 1947లో ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోని చివరి చీతా చనిపోయింది. దీంతో 1952లో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దేశంలో చీతాలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మొదటి విడత కింద 2022 సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు తీసుకొచ్చింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం.