MLA Chennmaneni Ramesh Comments : 'నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. నాకు పదవిపై వ్యామోహం లేదు' - Vemulawada politics 2023
🎬 Watch Now: Feature Video
BRS MLA Chennmaneni Ramesh Comments : వేములవాడ ఎమ్మేల్యే చెన్నమనేనని రమేశ్‌బాబు రానున్న ఎన్నికల్లో టికెట్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా తానెప్పుడూ ప్రజల గుండెల్లో ఉన్నానని తెలిపారు. ఇప్పటికే నాలుగుసార్లు గెలిచానని, పదవిపై తనకు వ్యామోహం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత చల్మడ లక్ష్మీ నర్సింహారావు ఈ మధ్య ఎక్కువగా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రజలతో మమేకమవుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు చేసిన రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీలో కొంతమంది అక్కడో మాట, ఇక్కడో మాట చెబుతున్నారని.. తనకు అన్నీ తెలుసని పేర్కొన్నారు. అసమ్మతి నేతలు కొందరు పార్టీ టికెట్ ఆశిస్తున్నారని.. ఎవరికి టికెట్ ఇవ్వాలో కేసీఆరే నిర్ణయిస్తారని చెప్పారు. అది తన చేతుల్లో లేదని స్పష్టం చేశారు. టికెట్ కోసం బజార్లో పడే పరిస్థితి తన తండ్రికి రాలేదని, తనకూ రాదని అన్నారు. తాను వెళ్లిపోయాక నియోజకవర్గంలోని స్థలాలు కబ్జా చేయాలని చూస్తున్నారని, అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన ప్లాన్ తనకుందని పరోక్షంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.