Boy Kidnap at Secunderabad Railway Station Video Viral : 5 ఏళ్ల బాలుడిని కిడ్నాప్.. 8 గంటల్లోనే ఆచూకీ కనిపెట్టిన రైల్వే పోలీసులు - చైల్డ్ కిడ్నాప్ వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video


Published : Sep 30, 2023, 10:37 AM IST
|Updated : Sep 30, 2023, 1:45 PM IST
Boy Kidnap at Secunderabad Railway Station Video Viral : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం గుర్తు తెలియని దంపతులు అపహరణ చేసిన బాలుడి ఆచూకీ లభించింది. సీసీ కెమెరా ఆధారంగా రైల్వే పోలీసులు బాలుడిని కనిపెట్టారు. మాదాపూర్ సైబర్ టవర్స్ దగ్గర బాలుడ్ని దంపతులు వదిలి వెళ్లారని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. కేవలం 8 గంటల్లోనే పోలీసులు ఈ కిడ్నాప్ కేసును ఛేదించారు.
అసలేం జరిగిందంటే : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపురం గ్రామానికి చెందిన మంగళి దుర్గేశ్ తన ఐదేళ్ల కుమారుడి (మతిస్తిమితం లేని వికలాంగుడు)ని వెంటపెట్టుకుని తిరుపతికి వెళ్లాడు. ఈ నెల 28వ తేదీన తిరిగి పయనమయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. రైలు దిగిన తర్వాత ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై బ్యాగుతో పాటు తన కుమారుడిని వదిలిపెట్టి.. వాష్‌రూంకు వెళ్లాడు. తిరిగొచ్చి చూసేసరికి తన కొడుకు కనిపించలేదు. స్టేషన్ మొత్తం వెతికినా.. ఆచూకీ లభించకపోవడంతో రైల్వే పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తక్షణమే సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో బాలుడ్ని ఎవరో గుర్తు తెలియని దంపతులు తీసుకువెళ్లినట్టు కనిపించింది. ప్రస్తుతం బాలుడ్ని అపహరించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.