నదిలో కుప్పకూలిన వంతెన.. సీఎం కలల ప్రాజెక్ట్ 'గంగా'ర్పణం!.. రూ.1700 కోట్లు లాస్!! - bihar bridge collapse
🎬 Watch Now: Feature Video
Bihar Bridge Collapse : బిహార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ఖగారియా జిల్లాలోని భాగల్‌పుర్‌లో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తాంగంజ్ వంతెన ఒక్కసారిగా నదలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. వంతెన కూలిన దృశ్యాన్ని స్థానికులు తమ మొబైల్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమారు వంద మీటర్ల మేర వంతెన కూలి నీటిలో పడిపోయింది.
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కలల ప్రాజెక్టుగా 'అగువానీ-సుల్తాంగంజ్' వంతెన నిర్మితమవుతోదంని పర్బత్తా ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ తెలిపారు. 'ఈ ఏడాది నవంబర్- డిసెంబర్ నాటికి వంతెన నిర్మాణం పూర్తి అవుతుందని భావించాము. ఆ తర్వాత ప్రారంభిద్దామని అనుకున్నాం. ఇంతలో వంతెన కూలిపోవడం బాధాకరం' అని సుల్తాంగంజ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ అన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులను త్వరగా గుర్తించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆదేశించారు.
రెండోసారి..
ఈ వంతెనకు ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఏప్రిల్ నెలలో తుపాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం దెబ్బతిన్నాయి. ఖగారియా - అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. 2015లో నీతీశ్ కుమార్ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు.
నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంపై ప్రతిపక్షాలు నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. "సీఎం కమిషన్లకు అలవాటుపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి ప్రతిపక్షాల ఐక్యత కోసం నీతీశ్ తిరుగుతున్నారు" అని బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు.