బద్రీనాథుడి ఆలయం మూసివేత- ఆరు నెలలు తర్వాతే దర్శనం - చార్ధామ్ యాత్ర 2023 తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 18, 2023, 7:34 PM IST
Badrinath Temple Close Date 2023 : ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ బద్రీనాథుడి ఆలయాన్ని మూసేశారు. శీతాకాలం నేపథ్యంలో గుడిని శనివారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో మూసివేశారు. దీంతో గత కొద్ది నెలలుగా సాగుతున్న చారధామ్ యాత్ర నేటి(శనివారం)తో ముగిసినట్లైంది. ఆరునెలల పాటు గుడి మూసే ఉంటుంది. ఈ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు. కాగా, చివరిరోజు కావడం వల్ల ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఆలయాన్ని మూసివేస్తున్న నేపథ్యంలో చార్ధామ్లలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని 10 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శుక్రవారం ఒక్కరోజే బద్రీనాథ్‌లో కొలువుదీరిన శ్రీ మహావిష్ణువును 10 వేల మంది దర్శించుకున్నారు. ఈ ఏడాది మొత్తం 18 లక్షల 25 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తలుపులు మూసే ముందు ఆలయ ప్రధాన పూజారి రావల్ ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి స్త్రీ వేషధారణలో స్వామివారి గర్భగుడిలో శ్రీ మహాలక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. లక్ష్మీ దేవి విగ్రహాన్ని పురుషులు ముట్టుకోకూడదనే సంప్రదాయం కారణంగా పూజారి ఇలా స్త్రీ వేషంలో అమ్మవారిని ఆలయంలో నెలకొల్పారు. ఇక నవంబర్ 14 నుంచి బద్రీనాథ్ ధామ్‌లో పంచపూజలు జరిగాయి. మొదటి రోజు ధామ్‌లోని గణేష్ ఆలయంలో, రెండవ రోజు కేదారేశ్వర, ఆదిశంకరాచార్య ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మూడవ రోజు ఖరక్ పూజను నిర్వహించారు.