World No Tobacco Day: సిగరెట్, చుట్ట, బీడీలను ముట్టించి గుండెల నిండా పీల్చుకొని ఉత్సాహం వచ్చినట్టు భావించేవారు ఎందరో. కానీ పొగతో పాటు క్యాన్సర్‌నూ పీల్చుకుంటున్నామనే సంగతి తెలుసా? పొగాకు సంపూర్ణ క్యాన్సర్ కారకం మరి! పొగాకు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నికోటిన్. దీని మూలంగానే క్యాన్సర్ వస్తుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికిది పొగాకు వాడకం అలవడేలా, వ్యసనంగా మారేలా చేస్తుందంతే. అసలు ముప్పుంతా క్యాన్సర్ కారకాలతోనే. ఇందులో ఆర్సెనిక్, బెంజీన్, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, ఇథిలీన్ ఆక్సైడ్ వంటి 72 క్యాన్సర్ కారకాలుంటాయి. పొగ పీల్చుకోగానే ఇవన్నీ జిగురు పొరలు, ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలిసి శరీరమంతటికీ విస్తరిస్తాయి.
క్యాన్సర్ మూడు దశల్లో సాగుతుంది. ఒకటి- కణస్థాయిలో మార్పులు తలెత్తటం (ఇనీషియేషన్). దీంతో కణం క్యాన్సర్ తలెత్తటానికి అనువుగా తయారవుతుంది. రెండోది- క్యాన్సర్ కణంగా మారటం (ప్రమోషన్). మూడోది- క్యాన్సర్ కణం అడ్డూ అదుపూ లేకుండా తామరతంపరగా వృద్ధి చెందటం (ప్రోగ్రెషన్). ఇదే చివరికి కణితిగా తయారవుతుంది. ఈ మూడు దశల్లోనూ పొగాకు ప్రభావం చూపుతుంది. మనలో నిరంతరం కొన్ని కణాలు చనిపోతుంటాయి. కొన్ని కణాలు పుట్టుకొస్తుంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. దీన్ని కణంలోని డీఎన్‌ఏ నియంత్రిస్తుంటుంది. పొగాకులోని క్యాన్సర్ కణాలు దీన్నే దెబ్బతీస్తాయి. ఇవి ముందుగా డీఎన్‌ఏ భాగాలకు (అడక్ట్స్) అంటుకుపోతాయి. దీంతో డీఎన్‌ఏ పనితీరు దెబ్బతింటుంది. చివరికి విభజన ప్రక్రియ అస్తవ్యస్తమై, కణాలు ఇష్టం వచ్చినట్టుగా వృద్ధి చెందుతుంటాయి.
నిజానికి క్యాన్సర్‌ను నిరోధించే స్వభావం మనలో సహజంగానే ఉంటుంది. ఆంకో జన్యువులు క్యాన్సర్ ఏర్పడేలా చేస్తుంటే.. క్యాన్సర్ సప్రెసార్ జన్యువులు దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తుంటాయి. దెబ్బతిన్న డీఎన్‌ఏ మరమ్మతు కావటానికి తోడ్పడుతుంటాయి. అయితే పొగాకు ఆంకో జన్యువులను ప్రేరేపితం చేస్తుంటుంది. అదే సమయంలో క్యాన్సర్‌ను అణచే కణాలను నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా విభజన ప్రక్రియ అస్తవ్యస్తమై కణాలు ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతాయి. క్యాన్సర్‌తో పోరాడే శక్తినీ పొగాకు అడ్డుకుంటుంది. పొగాకులోని విషతుల్యాలు రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలను నిర్మూలించే శక్తీ సన్నగిల్లుతుంది. దీంతో ఇవి అదుపు లేకుండా పెరుగుతూ వస్తాయి.
ఒకట్రెండు తాగితే ఏమీ కాదని అనుకోవద్దు
ఒకట్రెండు సిగరెట్లు కాలిస్తే ఏమీ కాదని కొందరు భావిస్తుంటారు. ఇది తప్పు. విషం ఒక చుక్క తాగినా, పది చుక్కలు తాగినా పోయేది ప్రాణాలే. పొగాకూ అంతే. దీని వాడకంలో సురక్షిత మోతాదు అంటూ ఏదీ లేదు. సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చటం వల్ల క్యాన్సర్ల ముప్పు గణనీయంగా పెరుగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత వరకు ముప్పు పొంచి ఉంటుందనేది ఆయా వ్యక్తులను బట్టి మారిపోతుండొచ్చు. రోజుకు ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారనే విషయాలన్నీ ఇందులో ప్రభావం చూపుతాయి. కొందరు మా తాత 90 ఏళ్ల వరకు పొగ తాగేవారు. ఆయనకేమీ కాలేదు. జీవితాంతం నిక్షేపంగా ఉన్నారు అని వాదిస్తుంటారు.
దీనికి కారణం క్యాన్సర్‌కు అనుకూలంగా మారిన కణం తర్వాతి దశలోకి వెళ్లకపోవటమే. వారి రోగనిరోధకశక్తి, తినే తిండి, పీల్చే గాలి, వాతావరణం వంటివి దాన్ని అక్కడితో ఆపేసి ఉండొచ్చు. కానీ అందరిలోనూ ఇలాగే జరగాలని లేదు. సాధారణంగా చాలామంది తొలిసారి పొగ రుచిని యుక్తవయసులోనే చూస్తుంటారు. ఏదో ఆసక్తి, ఉత్సుకతతో మొదలై క్రమంగా వ్యసనంగా మారుతుంది. ఇలా చిన్నప్పుడు పొగ తాగటం అలవాటైనవారికి 35-70 ఏళ్ల వయసులో ఎప్పుడైనా క్యాన్సర్ రావొచ్చు. ఆయా వ్యక్తుల శరీర స్వభావాలను బట్టి కొందరికిది త్వరగా రావొచ్చు, కొందరికి ఆలస్యంగా రావొచ్చు. ఎంత చిన్న వయసులో పొగాకు వాడకం అలవడితే అంత తక్కువ వయసులో క్యాన్సర్ వచ్చే అవకాశముంది. క్యాన్సర్ రకాన్ని బట్టీ ముప్పు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు- సిగరెట్ల జోలికి వెళ్లనివారితో పోలిస్తే ప్రసుతం పొగ అలవాటు గలవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 25 రెట్లు అధికంగా ఉంటుంది. అదే మూత్రాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువ.
ఇవీ హెచ్చరిక సంకేతాలు
క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. చికిత్స తేలికవుతుంది. కొన్నిసార్లు పూర్తిగానూ నయమవుతుంది. నోట్లో, నాలుక మీద, అంగిట్లో ఎక్కడైనా ఎర్ర మచ్చ ఏర్పడినా, పుండు మానకుండా వేధిస్తున్నా, ఎక్కువ ఉమ్మి వస్తున్నా, మూడు వారాలు దాటినా దగ్గు తగ్గకున్నా, గొంతు మారినా, ఆకలి తగ్గినా తాత్సారం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. నోటి క్యాన్సర్‌ను అద్దంలో చూసి కూడా గుర్తించొచ్చు. నోట్లో జిగురుపొరల మీద ఎరుపు-తెలుపు కలగలిసిన మచ్చల (ఎరిత్రో ల్యూకోప్లేకియా) స్థాయిలో గుర్తిస్తే పూర్తిస్థాయి క్యాన్సర్‌గా మారకుండా చూసుకోవచ్చు. మచ్చ ఉన్న భాగాన్ని తొలగించి, పొగాకు అలవాటు మానేస్తే అక్కడితోనే ఆగిపోతుంది.
ఎన్నెన్నో క్యాన్సర్లు
పొగ పీల్చుకున్నప్పుడు అది నేరుగా ఊపిరితిత్తులకు, అన్నవాహికలోకి, ముక్కు చుట్టుపక్కల గాలిగదుల్లోకి చేరుకుంటుంది. కొందరు జర్దా, గుట్కా, ఖైనీలను నోట్లో పెట్టుకుంటారు. ఇలా పొగ, లాలాజలం ద్వారా క్యాన్సర్ కారకాలు రక్తంలోకి, అక్కడ్నుంచి వివిధ అవయవాలకు చేరుకొని ప్రమాదకరంగా పరిణమిస్తుంటాయి. పొగాకు మూలంగా నోరు దగ్గర్నుంచి మలద్వారం వరకూ ఎక్కడైనా క్యాన్సర్ రావొచ్చు. పెదవి, నోరు, నాలుక, అంగిలి, అన్నవాహిక, జీర్ణాశయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, కాలేయం, మూత్రాశయం, కిడ్నీ క్యాన్సర్ల వంటివెన్నో తలెత్తుతాయి. చివరికి ఎముక మజ్జలోనూ క్యాన్సర్లు రావొచ్చు. పొగాకుతో సంభవించే క్యాన్సర్లలో ఎక్కువగా కనిపించేది ఊపిరితిత్తుల క్యాన్సర్. జీర్ణాశయ, గొంతు, అన్నవాహిక, నోటి క్యాన్సర్లూ ఎక్కువే.ఒకసారి క్యాన్సర్ బారినపడి చికిత్స తీసుకున్నవారు తిరిగి పొగాకు వాడకం మొదలెడితే నూటికి నూరు శాతం క్యాన్సర్ తిరగబెడుతుంది. ఈసారి మరింత తీవ్రంగానూ వస్తుంది. అంతకుముందు వచ్చిన భాగాల్లో కాకుండా వేరే భాగాల్లోనూ క్యాన్సర్ రావచ్చు.
ఏటేటా పెరుగుతున్నాయి
దశాబ్దకాలంగా ఏటా 1-2% క్యాన్సర్లు ఎక్కువవుతూ వస్తున్నాయి. మరణాలూ 0.1-1% పెరుగుతూ ఉన్నాయి. అత్యాధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి రావటంతో క్యాన్సర్ బాధితుల్లో జీవనకాలం గణనీయంగా మెరుగైంది. దీని మూలంగానే క్యాన్సర్ల సంఖ్య పెరిగినంతగా మరణాలు పెరగటం లేదు. అయితే మొత్తమ్మీద క్యాన్సర్ కేసులు, మరణాలు ఏటా పెరుగుతూ వస్తున్నమాట నిజం. దీనికి ప్రధాన కారణం పొగాకే. మనదేశంలో పావు వంతు క్యాన్సర్లు పొగాకు మూలంగానే వస్తున్నాయి. మగవారిలో 32-35% క్యాన్సర్లకు, ఆడవారిలో 17% క్యాన్సర్లకు పొగాకే కారణమవుతోంది. ప్రస్తుతం మనదేశంలో మహిళల్లో పొగ అలవాటు పెరగటం దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. ఒకప్పుడిది కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేది. కొన్నిచోట్ల చుట్టలు, బీడీలు మండే భాగాన్ని నోట్లో పెట్టుకొని మరీ పొగను పీలుస్తుండటం తెలిసిందే. వయసు మళ్లిన మహిళలకు మల విసర్జన సాఫీగా అవుతుందనే అపోహతో పొగాకు అలవాటు చేస్తుండటమూ కనిపించేది. ఇప్పుడు పట్టణీకరణ, పాశ్చాత్య ప్రభావం మూలంగా మహిళల్లో పొగ తాగే అలవాటు పెరుగుతుండటం గమనార్హం.
ఏ రూపంలోనైనా ప్రమాదమే
సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చినవారికే ప్రమాదమనుకోవటానికి లేదు. వీళ్లు వదిలిన పొగను ఇతరులు పీల్చినా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. పొగ తాగటమే కాదు.. జర్దా, గుట్కా, ఖైనీ రూపంలో నమిలినా, ముక్కుపొడి పీల్చినా, పొగాకుతో పళ్లు తోమినా.. ఇలా ఏ రకంగా పొగాకు వాడినా క్యాన్సర్‌కు దారితీస్తుంది.
పూర్తిగా నివారించుకోవచ్చు
క్యాన్సర్లు వచ్చాక బాధపడేకన్నా రాకుండా చూసుకోవటమే ఉత్తమం. ఇందుకు ఉత్తమ మార్గం పొగాకు జోలికి వెళ్లకపోవటం. అలవాటుంటే మానెయ్యటం. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలో వైద్య సదుపాయాలు, ఆర్థిక వనరులు తక్కువ. అందువల్ల దీని విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.
- పొగ అలవాటు మానేసిన తర్వాత- 5-10 ఏళ్లలో నోరు, గొంతు క్యాన్సర్ల ముప్పు సగానికి తగ్గుతుంది. పదేళ్లలో మూత్రాశయ, అన్నవాహిక, కిడ్నీ క్యాన్సర్ల ముప్పూ సగానికి పడిపోతుంది. 10-15 ఏళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు సైతం సగానికి తగ్గుతుంది. ఇక 20 ఏళ్లలో నోరు, గొంతు, స్వరపేటిక, క్లోమ క్యాన్సర్ల ముప్పు పొగాకు అలవాటు లేనివారితో సమాన స్థాయికి దిగివస్తుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పూ సగానికి తగ్గుతుంది. అంటే పొగాకు అలవాటు ఎప్పుడు మానేసినా మంచి ఫలితమే చూపిస్తుందన్నమాట.
- చాలామంది పది, పన్నెండు వయసులోనే పొగ తాగటం ఆరంభిస్తుంటారు. అందువల్ల చిన్నప్పట్నుంచే పొగాకు దుష్ప్రభావాలపై అవగాహన కలిగించాలి. క్యాన్సర్ ఆసుపత్రులకు తీసుకెళ్లి పొగ తాగితే ఏమవుతుందో ప్రత్యక్షంగా చూపించాలి. పొగాకు దుష్ప్రభావాల గురించి నాలుగో తరగతి నుంచే పాఠ్యాంశంగా బోధించాలి. ఎందుకంటే ఏడో తరగతికి వచ్చేసరికే ఎంతోకొంత ప్రభావితమైపోతారు. ఆ తర్వాత మనసు మార్చటం కష్టం. పెద్దగా అవుతున్నకొద్దీ స్నేహితుల మాట తప్ప ఎవరి మాటా వినరు.
- సిగరెట్లు తాగేవారి పక్కన కూర్చోవద్దు. ఇంట్లో ఎవరినీ సిగరెట్లు కాల్చనీయొద్దు.
ఇవీ చదవండి: లంచ్ తర్వాత హుషారు తగ్గినట్టు అనిపిస్తుందా? అయితే ఈ టిప్స్ మీకోసమే..