గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతూ, అధిక శాతం మరణాలకు క్యాన్సర్ రెండవ అతి పెద్ద కారణంగా నిలుస్తోంది. 2018లో 96 లక్షల మంది క్యాన్సర్ కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి 6 మందిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వీటిలో
- ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల 20 లక్షలు
- రొమ్ము క్యాన్సర్ వల్ల 20 లక్షలు
- పెద్ద పేగు క్యాన్సర్ వల్ల 18 లక్షలు
- పురీష గ్రంథి (ప్రోస్టేట్) వల్ల12 లక్షలు
- చర్మ క్యాన్సర్ వల్ల 10 లక్షలు
- జీర్ణకోశ క్యాన్సర్ వల్ల 10 లక్షల మంది మరణించినట్లు వెల్లడించారు.
ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినం నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో క్యాన్సర్ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రచారం కల్పిస్తున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్వచనం ప్రకారం క్యాన్సర్ అంటే శరీరంలోని కొన్ని అసాధారణ జీవకణాలు హద్దులను దాటి పెరుగుతూ ఇతర కణజాలాల్లోకి చొచ్చుకుని పోవటం. తర్వాత రక్తం ద్వారా, శోష రసం(లింఫ్) ద్వారా క్యాన్సర్ కణాలు ఇతర శరీర అవయవాలలోకి ప్రవేశిస్తాయి.
1. క్యాన్సర్ ఒక సాంక్రమిక వ్యాధి!
అధిక శాతం క్యాన్సర్లు అంటురోగాలు కావు, అయితే వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగిన క్యాన్సర్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందవచ్చు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) ప్రకారం పాపిల్లోమా వైరస్ ద్వారా కలిగే సర్వైకల్ క్యాన్సర్, హెపటైటిస్ బీ,సీ వల్ల కలిగే కాలేయ క్యాన్సర్ తప్ప మిగితా క్యాన్సర్లు ఏవీ సాంక్రమిక వ్యాధులు కావు.
2. క్యాన్సర్ అత్యంత ప్రమాదకారి!
కాదు, అన్ని వేళలా క్యాన్సర్ ప్రమాదకారి కాదు. వైద్య శాస్త్రంలో కలిగిన సాంకేతిక పురోగతి వల్ల అనేక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. తద్వారా చికిత్స తరువాత కోలుకునే రోగుల శాతం బాగా పెరిగింది. చికిత్సానంతరం ఆరోగ్యవంతమైన జీవితం చికిత్సకు ముందు క్యాన్సర్ ఎంత మేర పెరిగింది, ఎంతకాలం పెరిగింది, వారి ప్రస్తుత ఆరోగ్య స్థితి, తీసుకున్న చికిత్స అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
3. చెమట నిరోధకాలు, డియోడ్రెంట్ల (అత్తర్లు) వల్ల రొమ్ము క్యాన్సర్!
నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రకారం, ఇప్పటివరకు జరిగిన ఉత్తమ అధ్యయనాలు చెమట నిరోధకాలు, డియోడ్రెంట్లు(అత్తర్లు) క్యాన్సర్ ను కలుగజేస్తాయని నిరూపించలేదు.
4. పొగ తాగే వారికి మాత్రమే ఊపిరితిత్తుల క్యాన్సర్!
పొగ తాగటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నా.. ఆ అలవాటు లేని వారికి కూడా ఈ ప్రమాదం ఉంది. రాతినార (ఆస్బెస్టాస్), రాడాన్, యురేనియం, పాషాణం (ఆర్సెనిక్), జన్యు పరమైన కారణాలు, పొగ తాగే వారితో సాన్నిహిత్యం మొదలైన కారణాలన్నీ ఊపిరితిత్తుల క్యాన్సర్ను కలుగజేయవచ్చు.
5. చక్కెర క్యాన్సర్ ను తీవ్రతరం చేస్తుందా?
లేదు, క్యాన్సర్ కణాలు చక్కెర (గ్లూకోజ్)ను ఆరోగ్యవంతమైన కణాల కన్నా అధికంగా వినియోగించుకుంటున్నా చక్కెర వల్ల క్యాన్సర్ తీవ్రతరం కాదని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లో తేలింది. అందువల్ల చక్కెర తీసుకోవటం ఆపితే క్యాన్సర్ కణాలు చనిపోతాయన్నది కూడా నిజం కాదు. అయినప్పటికీ అధికంగా చక్కెర కలిగిన ఆహరపదార్ధాలు తీసుకోవటం వల్ల ఊబకాయం వచ్చి తద్వారా క్యాన్సర్ బారిన పడవచ్చు.
6. పురుషులకు రొమ్ము క్యాన్సర్ రాదు!
నిజం కాదు. పురుషుల్లోనూ రొమ్ము కణజాలం ఉండటం వల్ల వారు కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడవచ్చు. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ వారికి కూడా ప్రమాదం లేకపోలేదు.
7. సానుకూల దృక్పథం(పాజిటివిటీ) క్యాన్సర్‌ను నయం చేస్తుంది!
చికిత్స సమయంలో సానుకూల వైఖరిని కలిగి ఉండటం చాలా అవసరం, కానీ ఇది క్యాన్సర్ ను నయం చేయలేదు. క్యాన్సర్ రోగులకు సరైన మందులు, చికిత్స మాత్రమే ప్రధానం.
8. క్యాన్సర్ చికిత్స కారణంగా వికారం, నొప్పి, బలహీనత!
క్యాన్సర్ రోగుల మధ్య చికిత్సకు స్పందించే క్రమం వేరువేరుగా ఉండవచ్చు. ఇటీవలి ఆవిష్కరణలు వికారాన్ని, బలహీనతను తగ్గించే ఔషధాలను అందుబాటులోకి తెచ్చాయి. నొప్పిని తగ్గించే ఔషధాలు, శారీరక వ్యాయామం వల్ల రోగుల్లో వారి ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.
ఇలాంటి అపోహలు, నమ్మకాలు చాలా ఉన్నాయి. క్యాన్సర్ గురించి శాస్త్రీయమైన విషయాలకు ప్రచారం కల్పించి అపోహలకు చెక్ పెట్టాలి. తప్పుడు సమాచారంతో రోగులను భయపెట్టడం వల్ల వారి ఆరోగ్యం మరింత దిగజారుతుంది. ఆందోళన, ప్రతికూల ఆలోచనల వల్ల ఆదుర్దా పెరుగుతుంది. అందువల్ల క్యాన్సర్ గురించి సరైన సమాచారాన్ని అందిస్తూ అందరం కలిసి ఈ మహమ్మారి నియంత్రణకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం.