ప్రతి సంవత్సరం మే నెలలో మొదటి మంగళవారాన్ని ప్రపంచ ఆస్తమా దినంగా(ఈ ఏడాది మే 4న) జరుపుకుంటున్నాం. 1998 లో "గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా" ఉబ్బస వ్యాధి గురించి సరైన సమాచార వ్యాప్తికి నాంది పలికింది. ఈ ఏడాది "ఉబ్బస వ్యాధిపై అపోహలను తొలగిద్దాం" అనే నినాదంతో కార్యక్రమాలను ప్రారంభించింది. గత సంవత్సర కాలంగా కొవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ఉబ్బస రోగులు ప్రమాదకర స్థితిలో ఉన్నారు.
ఆస్తమా అంటే?
పిల్లలను, పెద్దలను బాధించే ఉబ్బస వ్యాధి అంటురోగం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం "ఒకరి నుంచి ఒకరికి వ్యాపించని ఈ జబ్బు తరచూ ఊపిరాడని స్థితిని కలగచేస్తూ ఒక్కొక్కరిలో ఒక్కోలా తీవ్రతను కలిగి ఉంటుంది. వ్యాధి లక్షణాలు రోజులో అనేక సార్లు కానీ, వారంలో అపుడపుడూ కానీ, కొందరికి రాత్రిళ్లు, కొందరికి శారీరక శ్రమ తరువాత కనిపిస్తూ ఉంటాయి".
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2016లో 4,17,918 మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉబ్బసం వల్లనే కలిగాయి. దాదాపు 34 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వృద్ధులు ఎక్కువగా ఆస్తమా వల్లనే మరణిస్తున్నారు. జన్యువులే కాక పర్యావరణ కారణాలు కూడా దీన్ని కలుగజేయవచ్చు. దుమ్ము, ధూళి, సూక్ష్మ క్రిములు, పుప్పొడి, బూజు, ధూమపానం, వాతావరణ కలుషితాలు, గాలి కాలుష్యం, రసాయన ఘటకాలు మొదలైన ఎన్నో పదార్ధాలు ఉబ్బసాన్ని కలగజేయవచ్చు. అయితే సరైన ఔషధాలు తీసుకోవటం ద్వారా ఉబ్బసాన్ని నివారించవచ్చు, చికిత్సించవచ్చు.
అప్పుడప్పుడు కలిగే అస్తమా ముట్టడి నుంచి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకుందాం.
ఆస్తమా ముట్టడి:
ఒక్కసారిగా కలిగే ఆస్తమా క్షోభ ప్రాణం కూడా తీయవచ్చు. ఊపిరాడకపోవటం, దగ్గు, గుండెల్లో గరగర వంటి లక్షణాలు రోగి మాట్లాడటానికి, ఆహారం తీసుకోవడానికి, నిద్రపోవడానికి అవకాశం ఇవ్వవు. అలాంటి పరిస్థితుల్లో రోగులు కూర్చుని నిదానంగా ఊపిరి తీసుకుని వదలాలి. అవసరాన్ని బట్టి ఇన్హేలర్ వాడవచ్చు. వీలైనంత త్వరగా వైద్యున్ని సంప్రదించాలి.
కొన్ని అపోహలు:
- ఆస్తమా పిల్లల్లో కలిగే జబ్బు. వయసు పెరిగే కొద్దీ ఈ జబ్బు తగ్గిపోతుంది.
- ఆస్తమా అంటువ్యాధి.
- ఆస్తమా రోగులు వ్యాయామం చేయరాదు.
- అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడితేనే ఇది తగ్గుతుంది.
నిజాలు:
- ఆస్తమా ఏ వయసులో అయినా కలగవచ్చు.
- ఆస్తమా అంటువ్యాధి కాదు. అయితే జలుబు, ఇన్ఫ్లుయెంజాను కలగచేసే వైరస్లు ఆస్తమా లాంటి పరిస్థితిని కలిగిస్తాయి. పిల్లల్లో అలర్జీ వల్ల ఆస్తమా కలిగితే పెద్దల్లో అలర్జీ కాక వేరే కారణాల వల్ల కలగవచ్చు.
- ఆస్తమాను అదుపులో ఉంచుకుంటే శారీరక వ్యాయామం చేయవచ్చు. మీరు క్రీడాకారులుగా కూడా ఎదగవచ్చు.
- తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ను ఇన్హేలర్ ద్వారా తీసుకుని వ్యాధిని అదుపుచేయవచ్చు.
ఆస్తమా, కొవిడ్-19:
ఈ రెండు శ్వాసకోశ వ్యాధులైనందువల్ల ఆస్తమా రోగులకు కొవిడ్ సోకితే వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఆస్తమా లక్షణాలు ముదిరి ఊపిరితిత్తుల జబ్బులకు, ముఖ్యంగా న్యుమోనియాకు దారితీయవచ్చు.
- ఆస్తమా రోగులు వీలైనంత త్వరగా టీకా వేయించుకోవాలి.
- ఇంటికే పరిమితమవ్వాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినా మాస్క్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- అవసరమైన దినుసులు, ఔషధాలు ఇంట్లో జాగ్రత్త చేసుకోవాలి.
- గాలి సరిగా ఆడని ప్రదేశాలకు వెళ్లకండి.
- భౌతిక దూరం పాటించండి.
- చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి.
- వైద్యుడు చెప్పిన విధంగా మందులు వాడండి.
- కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.