ఈరోజుల్లో చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య అధిక బరువు. పలు సర్వేల ప్రకారం మన దేశంలో దాదాపు 5.74% నుంచి 8.82% మధ్య స్కూలు పిల్లలు ఒబేసిటీ బారిన పడుతున్నారు. ఒక్క దక్షిణ భారతంలోని నగరాలనే తీసుకొంటే 21.4% మంది అబ్బాయిలు, 18.5% మంది అమ్మాయిలు అధిక బరువుతో బాధ పడుతున్నారట. ఈ క్రమంలో చాలామంది ఫిట్‌నెస్ నిపుణులకు వారి ఒబేసిటీ వరంగా మారుతోంది. అందుకే లావు తగ్గడానికి వివిధ రకాల డైట్ ప్లాన్లను రూపొందిస్తున్నారు. బరువుకు అసలు కారణం అన్నమే అని ఫీల్ అవుతున్నారు... మరి అన్నం తింటే ఏమవుతుంది.. తినకపోతే ఏమవుతుంది?
పోషకాల గని... ఆరోగ్యప్రదాయని !
అన్నంలో ఉండే పోషకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇందులో ఎముకలకు అవసరమయ్యే కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ చేరవేసే హెమోగ్లోబిన్‌కి అత్యంత ముఖ్యమైన ఐరన్ అన్నంలో మెండుగా ఉంటుంది. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించి హృద్రోగాలు రాకుండా నియంత్రించే నియాసిన్ (విటమిన్ బి3) కూడా అన్నం ద్వారా మన శరీరానికి సమకూరుతుంది. అంతేకాదు మెదడు, నాడీ వ్యవస్థ, రోగ నిరోధక శక్తికి ఎంతో ముఖ్యమైన విటమిన్ డి కూడా అన్నంలో ఎక్కువగా లభిస్తుంది. ఇక షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచడంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే ఫైబర్ గుణాలు ఎక్కువగా లభించే ఆహారాల్లో అన్నం కూడా ఒకటి. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే సునాయాసంగా జీర్ణమై కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టే వైద్యులు అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. మరి ఇటువంటి ఆహారం ఎందుకు అధిక బరువుకు కారణమవుతోంది ?
అక్కడే లోపం ఉంది !
అన్నం తిన్న తర్వాత కొంచెం బద్ధకంగా ఉండడం చాలామంది గమనించే ఉంటారు. అయితే దాన్ని బద్ధకం అనీ, స్తబ్ధత అనీ భావించడం సమంజసం కాదు. తిన్న తర్వాత అన్నంలో సహజంగా ఉండే కార్బోహైడ్రేట్స్ విచ్ఛిన్నమవడానికి కొంత సమయం పడుతుంది. ఇది మన మంచికే ! అలా జరుగుతుంది కాబట్టే మనకు ఏ పని చేయడానికైనా ఎక్కువ సమయం శక్తి లభిస్తుంది. అందుకే నిత్యం అన్నం తినేవారు ఎప్పుడైనా అది మానేసి ఇతర ఆహార పదార్థాలు తిన్నప్పుడు 'ఏం తిన్నా అన్నం తిన్నట్లనిపించదు' అంటుంటారు.
అయితే అన్నం తినడం వల్ల బద్ధకం పెరుగుతుంది అనే వారి లెక్క వేరే ఉంది. అలా అనిపిస్తుందీ అంటే వారు మోతాదుకి మించి తింటున్నట్లే ! పలు సర్వేల ప్రకారం అన్నం తినడం వల్ల కొవ్వు పెరుగుతుంది అనేవారు పెద్ద పెద్ద కంచాల్లో ఎక్కువ అన్నం తింటున్నవారేనట. అందుకే టీవీ చూస్తూనో, సెల్‌ఫోన్లో మాట్లాడుతూనో లేక ధ్యాస మరెక్కడో పెట్టి కాకుండా... చిన్న కంచాల్లో కడుపుకి పట్టినంతే ధ్యాస పెట్టి మరీ తినమంటున్నారు వైద్యులు.
ఆ బియ్యంతో అన్నమైతే మంచిది !
స్థూలకాయం ఉన్నవారికి అన్నం గురించే దిగులంటే.. ఈ అన్నం కోసం వాడే బియ్యంలో పలు రకాలు చేరి ఇంకా తికమకపెడుతుంటాయి. బియ్యం ముఖ్యంగా రెండు రకాలు. బ్రౌన్ రైస్, వైట్ రైస్. వీటిలో బ్రౌన్ రైస్ (ముడి బియ్యం) అయితే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ముడి బియ్యాన్ని పాలిష్ చేసి కొన్ని పోషకాలు తొలగించే తెల్లని బియ్యం కంటే... బ్రౌన్ రైస్‌లో ఉండే పోషక విలువలే అత్యుత్తమం అంటున్నారు. బ్రౌన్ రైస్ వల్ల 130 క్యాలరీల పోషకాలు అందితే పాలిష్డ్ రైస్ వల్ల 112 క్యాలరీలే అందుతాయట. పైగా బ్రౌన్ రైస్‌లో ఉండే కొవ్వు శాతం సున్నా ! అందుకే బరువు తగ్గాలనుకునే వారు అన్నం తినడం మానేయడం కంటే ఈ బ్రౌన్ రైస్‌ను పరిమాణం తగ్గించి తీసుకుంటే.. అటు బరువు తగ్గడానికి, ఇటు శక్తిని సమకూర్చుకోవడానికి భేషుగ్గా ఉంటుందంటున్నారు.
అదండీ విషయం ! ఇక నుంచి బరువు తగ్గాలంటే పూర్తిగా అన్నం మానేయాలి అనుకోవద్దు. తినే అన్నం కాస్త మోతాదు తగ్గించండి. సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట గుర్తుందిగా 'అన్నం మితంగా తింటే ఆరోగ్యం... అమితంగా తింటే విషం' ! ఏమంటారు?
ఇదీ చదవండి: ఇది 'శాకాహారుల మటన్'.. కిలో రూ.400- 500!