వాల్వరైన్ అనే పేరు విన్నారా? పోనీ.. డెడ్‌పూల్ సినిమా చూశారా.. పోనీ మన పాతాళభైరవి. చూడకపోతే ఓ విషయం తెలుసుకోవాలి. ఈ పేర్లు, సినిమాల్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది. అదే హీలింగ్ పవర్. ఎంతటి గాయాలనైనా, కోతలనైనా త్వరగా మాన్పుకోగలిగే ప్రత్యేక గుణం ఉన్న కాల్పనిక పాత్రలివి. ఈ పాత్రలకి ఎటువంటి గాయాలైనా, కాళ్లు చేతులు, తల తెగిపోయినా తెల్లారేసరికల్లా తిరిగి మొలకెత్తుతాయి. పాతాళభైరవిలో ఎస్వీఆర్ చేయి, తలా ఖండించుకుని కూడా తిరిగి అతికించుకుంటాడు కదా! అదీ కథ. ఇంతకీ ఈ పాత్రల గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం అని కదా మీ సందేహం. ఆ సినిమాల్లో ఆ పాత్రలకున్న హీలింగ్ పవర్ ఏదో మనకీ ఉంటే తెగిన గాయాల నుంచి త్వరగా కోలుకుంటాం.. కాళ్లు చేతులు వంటివి తెగిపోయినా మళ్లీ అతుక్కుంటాయి కదా అనేది మన శాస్త్రవేత్తల ఆశ.
బల్లుల్లో దాగిన రహస్యం...
గోడమీద నిలువుగా పాకే బల్లులని చూశారా... అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకుని వాటి తోకలు పోగొట్టుకున్నా కొన్ని రోజులకి మళ్లీకొత్తవి పుట్టుకొస్తాయి. చిరుకప్పల్లో(టాడ్‌పోల్)లో తోక తెగిపోయినా మళ్లీ ఇట్టే వస్తుంది. ఆంఫీబియన్ జాతికి చెందిన సాల్‌మండర్స్(నల్లికండ్లపాములు), నెట్స్ వంటి జీవుల్లో అయితే మెదడు, గుండె వంటి కీలక అవయవాలని కూడా తిరిగి పునరుజ్జీవింప చేసుకోగల శక్తి ఉంది. ప్లనేరియా అనే జీవి శరీరాన్ని ఎన్ని ముక్కలు చేసినా... ప్రతి భాగం తిరిగి కొత్త జీవిగా మారి ప్రాణం పోసుకుంటుంది. బల్లుల కంటే కూడా వేగంగా గాయాలని మాన్పుకుని, అవయవాల పునరుజ్జీవాన్ని సాధించుకోగలిగే సాలమండర్స్ వంటి జీవులే శాస్త్రవేత్తలని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఆ జీవుల్లో అవయవాలు లేదా గాయాలు వేగంగా మానడానికి కారణం అయిన జన్యువు ఏదో తెలిస్తే మనమూ ఆ రకమైన హీలింగ్ పవర్‌ని పొందే అవకాశం ఉంటుంది కదాని మన శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు మొదలుపెట్టారు.
మనలోనూ ఆ గుణం ఉంది...
బల్లులు, సాలమండర్స్‌లో ఉన్నట్టుగానే మనలోనూ ఎంతో కొంత హీలింగ్ పవర్(గాయాలని మాన్పించుకోగలిగే శక్తి)ఉంది. ఆ కారణంగానే ఏవైనా కోతలు, గాయాలయితే పెచ్చులాంటిది కట్టి కొన్ని రోజుల తర్వాత గాయం మానిపోతుంది. గాయం మానినా ఆ ప్రాంతంలో మచ్చలు ఏర్పడతాయి. అలాగే కొత్తగా ఏర్పడిన ఆ చర్మం మన చర్మంలో పూర్తిగా కలవదు. ఏదో అతికినట్టుగా ఉంటుంది. ఆ మాట కూడా నిజమే. ఎందుకంటే.. గాయాలని మాన్పించేందుకు శరీరం ఈ ప్రాంతంలో ఓ ప్రత్యేకమైన కొల్లాజన్ కణజాలాన్ని ఆ ప్రాంతంలో పుట్టుకొచ్చేలా చేస్తుంది. చిరిగిపోయిన వస్త్రాన్ని కుట్టడానికి మనం దారాన్ని వాడినట్టుగా.. అచ్చంగా ఈ చర్మం కూడా తెగిన చోట ప్రత్యేకమైన కణజాలం తయారుచేసుకుని కుట్టుకుని అతుక్కుంటుంది. ఆ కారణంగానే మచ్చలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పైగా ఆ చర్మ కణజాలం మన చర్మకణజాలం అంత ధృడంగా కూడా ఉండదు. బలహీనంగా ఉంటుంది. ఇలా గాయాలని మాన్పించుకునే గుణాన్నే మనం హీలింగ్ పవర్ అంటుంటాం. అయితే ఈ ప్రక్రియ మనం ఇందాక చెప్పుకొన్న జీవుల్లోలా, మనం ముందు చెప్పుకొన్న కాల్పనిక పాత్రల్లో వేగంగా జరగడం లేదు. నిదానంగా జరుగుతోంది. ఇలా ఆలస్యంగా జరిగే క్రమంలో మనం ఇన్‌ఫెక్షన్ల భారిన పడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రక్తస్రావం కూడా ఎక్కువగా జరుగుతుంది. అది కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావొచ్చు.
మచ్చలు లేకుండా..
ఇతర జీవుల్లో జరిగినట్టుగా వేగవంతమైన పునరుజ్జీవ ప్రక్రియ మనలో కూడా జరిగితే? తక్కువ కణజాలాన్ని వాడుకున్ని వేగంగా కనుక గాయాలని మాన్చగలిగేలా చేస్తే మచ్చలు కనిపించవనేది ఒక అభిప్రాయం. ఇందుకోసం ప్లేట్‌లెట్లు అధికంగా ఉన్న చిక్కని ప్లాస్మాని ఉపయోగించడం ఉత్తమమైన మార్గంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దంత చికిత్సలో... ముఖంపై యాక్నె కారణంగా, మీజిల్స్ వంటి వ్యాధుల కారణంగా ఏర్పడిన మచ్చలని పోగొట్టడానికి ఇప్పటికే ఈ రకమైన ప్లాస్మా వైద్యాన్ని మన వైద్యులు చేస్తున్నారు. అలాగే మరో రకం ఆధునిక ప్రక్రియ. టిష్యూ ఇంజినీరింగ్. అంటే కృత్రిమంగా తయారుచేసిన కొల్లాజన్ షీట్లని గాయాలయిన చోట్ల ప్రవేశపెట్టి గాయాలు వేగంగా మానేలా చేయడం. ముఖ్యంగా కాలిన గాయాలకు ఇది మంచి విధానం. సాధారణంగా గాయాలు మానే క్రమంలో దురద, నొప్పి వంటివి బాధితులని వేధిస్తుంటాయి. ఈ విధానంలో ఆ సమస్య కూడా ఉండదు. బయో ఇంజినీరింగ్ పద్ధతిలో తయారుచేసిన చర్మకణాలని ప్రవేశపెట్టి మచ్చలు లేకుండా చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అడ్డూఅదుపు లేకుండా కణవిభజన జరిగే క్యానర్ కణాలని కూడా ఉపయోగించుకోవచ్చనేది మరో వాదన. మన శరీరంలో ఉండే ప్రొటో ఆంకోజీన్స్, ట్యూమర్ సప్రెసర్ జీన్లను అదుపులో ఉంచి తాత్కాలికంగా క్యాన్సర్ పరిస్థితులని కల్పించి గాయాలు మాన్పించే కొల్లాజిన్ కణాలని ఉత్పత్తి చేయొచ్చని స్టెమ్‌సెల్ బయాలజిస్టులు భావిస్తున్నారు.
ఆ రహస్యం తెలిస్తే కనుక...
2016లో టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో మైఖేల్ లెవిన్ ఆధ్వర్యంలో పాల్‌జీఅలెన్ డిస్కవరీ సెంటర్ ఇదే అంశంపై దృష్టి పెట్టి పెద్ద ఎత్తున పరిశోధనలు కొనసాగిస్తోంది. సాల్‌మండర్స్, బద్దెపురుగులు వంటి జీవులు తమ అవయవాలని తామే మరమ్మతులు చేసుకుని ఎటువంటి గాయాలనుంచైనా కోలుకుంటున్నాయి. ఇంతకీ ఏంటా రహస్యం? ఆ రహస్యానికే లెవిన్ ‘బయోఎలక్ట్రిక్ కోడ్’ అనే పేరు పెట్టాడు. ‘ఈ బయోఎలక్ట్రిసిటీ జీవుల్లో అవయవాల నిర్మాణానికి సంబంధించి ఒక ప్రణాళిక లేదా సాఫ్ట్‌వేర్ ప్రోగామ్ లాంటిది ఉంటుంది. అందులో నిర్దేశించిన ప్రోగామ్ ప్రకారం.. శరీరంలో ఏ అవయవం ఎంతుండాలి, ఎలా పెరగాలి, ఎప్పుడు పెరగాలి వంటివన్నీ జరుగుతుంటాయి. ఆ బయోఎలక్ట్రిక్ కోడ్‌ని ఛేదించి ప్రోగ్రామ్‌లో మార్పులు చేసినట్టయితే అద్భుతాలు జరుగుతాయి. కొత్త అవయవాల రూపకల్పన, హీలింగ్ పవర్ వంటి వాటి గుట్టు చిక్కడమే కాకుండా పుట్టుకతో వచ్చే లోపాలని సవరించవచ్చు. అంతకు మించి క్యాన్సర్ పని పట్టవచ్చు’ అని అంటున్నాడు లెవిన్.