What Is Probiotic In Telugu : సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా.. అనగానే వీటి వల్ల రోగాలు వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని రకాల బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు మానవ శరీరంలోని జీవక్రియలకు తోడ్పడతాయి. అందుకే వీటిని ప్రోబయోటిక్స్ అంటారు. నేటి కాలంలో కృత్రిమ పద్ధతుల్లోనూ ఇవి లభిస్తున్నాయి. కానీ వీటి కంటే.. ప్రోబయోటిక్స్ ఉన్న సహజమైన ఆహార పదార్థాలు తీసుకోవడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది!
Probiotics Health Benefits : ప్రోబయోటిక్స్ మానవ శరీరంలోని జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వాస్తవానికి జీర్ణక్రియ సవ్యంగా సాగాలంటే ప్రోబయోటిక్స్ చాలా కీలకం. ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్న ఆహారాల్లో పెరుగు, మజ్జిగ చాలా ముఖ్యమైనవి. ప్రోబయోటిక్స్ ఉన్న పదార్థాలను.. ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ సక్రమంగా ఉండటంతో పాటు మలబద్ధకం తగ్గుతుంది. విరేచనాలు కూడా నియంత్రణలోకి వస్తాయి. ఇవే కాదు.. ప్రోబయోటిక్స్ వల్ల ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రోబ్యాక్టీరియా ఆరోగ్య ప్రయోజనాలు
Probiotics Uses : మంచి బ్యాక్టీరియా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది. అలాగే ప్రోబయోటిక్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చెడు బ్యాక్టీరియా అనారోగ్యానికి గురి చేసినప్పుడు.. ప్రోబ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిని అప్రమత్తం చేస్తుంది. తద్వారా వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
డిఫెండర్స్!
Natural Probiotics Foods : పులియపెట్టిన ఆహార పదార్థాల్లో ప్రోబ్యాక్టీరియా ఉంటుంది. ఉదాహరణకు పెరుగు, మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ బాసిల్లై అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే బ్రెడ్ తయారీ కోసం గోధుమ పిండిలో కలిపే ఈస్ట్ కూడా ప్రోబ్యాక్టీరియానే. అందువల్ల వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వాస్తవానికి ఇవి ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి, జీర్ణకోశంలో స్థిరపడతాయి. ఒకవేళ పొరపాటున ఆహారం ద్వారా శరీరంలోకి హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశిస్తే... వాటిని ఈ మంచి సూక్ష్మజీవులు నశింపచేస్తాయి.
Probiotics Supplements : ప్రస్తుతం మార్కెట్లో ప్రోబయోటిక్స్ కలిగిన కృత్రిమ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కానీ ఇలాంటి ఉత్పత్తులను కొనేముందు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. కచ్చితంగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే వాటిని వాడాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాదం.