తనకు చివరిసారిగా నెలసరి వచ్చిన తేదీని (మొదటి రోజు) రాసి ఉంటే ఈ మందుల వాడకం వల్ల గర్భస్థ శిశువు మీద ప్రభావం ఉంటుందో లేదో చెప్పడం తేలికయ్యేదని గైనకాలజిస్ట్(Gynecologist) డాక్టర్ సవితాదేవి తెలిపారు. మొదటి మూడు నెలల్లో కొన్ని రకాల మందులు శిశువు అవయవాల నిర్మాణం (Organogenesis) పై ప్రభావం చూపుతాయన్నారు. నాలుగు నుంచి తొమ్మిది వారాల గర్భస్థ పిండంపై ఈ మందులు ప్రభావం చూపుతాయని వివరించారు. ఆమె తీసుకున్న మందుల్లో డోలో-650 ఒకటి. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదన్నారు. టెట్రాసైక్లిన్ గ్రూపునకు చెందిన డాక్సీసైక్లిన్ అనే మందును గర్భవతులు(Pregnant women) మొదటి మూడు నెలల్లో తీసుకుంటే పిండంలో ఎముకలు, దంతాలు, కండరాల తయారీ, నిర్మాణంలో లోపాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అలాగే ఐవర్‌మెక్టిన్ కూడా గర్భిణులకు నూటికి నూరు శాతం సురక్షితమైందని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. ఈ మందులను ఏ వారాల్లో వాడారో గైనకాలజిస్ట్‌కు చెబితే తగిన సలహా ఇస్తారని సూచించారు.
కొవిడ్ ఇన్‌ఫెక్షన్(Covid Infection) వల్ల కూడా పిండానికి సమస్యలు రావొచ్చు. సమస్య ఎంత ఎక్కువగా ఉంది? ఏ సమయంలో వచ్చింది? వైరల్ లోడ్ ఎంత ఉంది? శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించింది? కేవలం లక్షణాలే కనిపించాయా లేదా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలూ తీవ్రమైన ప్రభావానికి గురయ్యాయా.. ఆక్సిజన్ అవసరమయ్యేంత తీవ్రంగా వచ్చిందా... ఈ విషయాలన్నింటిపై ఆధారపడి ఉండొచ్చు. మొదటి మూడు నెలల్లో తీవ్రమైన జ్వరం, ఆక్సిజన్ స్థాయులు బాగా తగ్గిపోయి ఉంటే అవి పిండం ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్ వివరించారు.