సార్స్, ఎబోలా వంటి వ్యాధుల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఆ స్థాయిలో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న వైరస్ 'కరోనా'. చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ మహమ్మాకి ఇప్పటికే లక్షలమంది బలయ్యారు. ఈ వైరస్.. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు సృష్టించడం వల్ల బాధితులు తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటున్నారు. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధి కావడం వల్ల దీనిని నియంత్రించడం ప్రభుత్వాలకు ఛాలెంజ్‌గా మారింది. ఇలాంటి నేపథ్యంలో కరోనా బారినపడిన వారు దీర్ఘకాలికంగా ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త వైరస్ కావడం వల్ల దీనిపై పరిశోధకులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అయితే కొవిడ్-19 నుంచి కోలుకున్న కొందరు మాత్రం తమ అభిప్రాయాలు వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం...
వైరస్ బాధితులు చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకున్నారు. అయితే కొందరు మాత్రం చాలా రోజులు తీవ్రంగా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆందోళన, అలసట వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఈ సమస్యలు వారాల పాటు కొనసాగినట్లు చెప్పారు. ఐసీయూ, వెంటిలేటర్లు, డయాలసిస్ అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
కొవిడ్-19తో ఇబ్బందులు..?
- ఈ వైరస్ సోకిన వారికి ముందు జలుబు చేస్తుంది. ఆపై జ్వరం, పొడి దగ్గు, ఛాతి నొప్పి సమస్యలు వచ్చి క్రమంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది.
- ఒకవేళ అప్పటికీ చికిత్స అందకపోతే.. న్యుమోనియా వచ్చి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరే ప్రమాదముంది. దీనిని ఎక్స్‌రే ద్వారా గుర్తించవచ్చు. ఈ వైరస్ మన శరీరంలో ఉండే ఇతర ముఖ్యమైన అవయవాలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
- న్యుమోనియా ఎక్కువైతే ఊపిరితిత్తుల్లో మచ్చలు ఏర్పడతాయి. గుండెలో మంట, అపసవ్యంగా హృదయ స్పందనలు, మూత్రపిండాల సమస్యలు, కాలేయ పనితీరు దెబ్బతినడం జరుగుతుంది. అయితే అవి దీర్ఘకాలిక సమస్యలుగా ఉంటాయా? అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
- కరోనా బారినపడిన వారిలో కొందరికి ఆక్సిజన్ థెరపీ, డయాలసిస్ అవసరమైంది. కరోనా నుంచి కోలుకున్న మరికొందరు నరాల బలహీనత, జ్ఞాపకశక్తి సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్యల వల్ల ఎక్కువ రోజులు ఆసుపత్రికే పరిమితం కావాల్సి వచ్చింది.
- కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు కూడా తలెత్తాయి. ఇది కొందరిలో గుండెపోటుకు దారితీసింది.
అయితే ఈ సమస్యలన్నీ కాలక్రమేనా తగ్గుతాయని, అయితే ఆహారపు అలవాట్లు, తగిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు న్యూయర్క్‌లోని ఫెయిన్స్టీన్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్. థామస్ మెక్గిన్. ఈయన ప్రస్తుతం అమెరికా చేపట్టిన కరోనా పరిశోధనల్లో భాగస్వామ్యం వహిస్తున్నారు. అయితే కొందరిలో తక్కువ సమయంలో తగ్గితే, మరికొందరికి ఎక్కువ సమయం పట్టొచ్చని స్పష్టం చేశారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
ఈ వైరస్ సోకిన వాళ్లు తుమ్మినా, దగ్గినా.. గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. కాబట్టి కరోనా సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను ఇప్పటికే వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
- సబ్బు లేదా ఆల్కహాల్ హ్యాండ్ రబ్‌తో తరచూ చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి.
- తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు.. మీ ముక్కు, నోటికి టిష్యూ లేదా చేతిని అడ్డుపెట్టుకోండి.
- జలుబు లేదా ఫ్లూ సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండండి.
- గుడ్డు, మాంసం వండేటప్పుడు వాటిని బాగా ఉడికించండి.
- జంతువులను (ఫార్మ్‌లో పెంచేవి, పెంపుడు జంతువులతో సహా) తాకేటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవడం, వాటి దగ్గరకు వెళ్లినప్పుడు ముక్కుకు మాస్క్ ధరించడం లాంటివి చేయండి.
- వ్యవసాయ క్షేత్రాలను, జంతువులను విక్రయించే మార్కెట్లను సందర్శించకపోవడం మంచిది.
- సాధ్యమైనంత వరకు దూరప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.
- జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకపోవడం మంచిది.
కరోనా వైరస్‌కి ఇంకా సరైన మందు కనుగొనలేదు కాబట్టి కచ్చితంగా ఈ జాగ్రత్తలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పైన చెప్పిన వ్యాధి లక్షణాల్లో ఏ ఒక్కటైనా మీలో ఉన్నట్లు అనిపిస్తే.. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.
ఇవీ చూడండి: