What Age To Get Cervical Cancer Vaccine : మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వంశపారంపర్యం వల్ల వివిధ రకాల క్యాన్సర్‌లు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వచ్చేది గర్భాశయ క్యాన్సర్ అని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లు కూడా తెలియడం లేదని అంటున్నారు. ముందు జాగ్రత్తగా ఆడపిల్లలు చిన్న వయసులోనే టీకాలు తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ వయసులో టీకాలు తీసుకోవాలి ? టీకాకు ఎంత ఖర్చు అవుతుంది ? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి ?
సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వారంలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్. స్త్రీ గర్భాశయం కింది భాగంలో గర్భాశయాన్ని, యోనిని కలిపే సిలిండర్ ఆకారంలో ఉండే దానినే గర్భాశయ ముఖద్వారం(సర్విక్స్) అంటారు. చాలా వరకు గర్భాశయ క్యాన్సర్లు గర్భాశయం బయటి ఉపరితలంపై ఉన్న కణాల నుంచి మొదలవుతాయి. సర్వైకల్ క్యాన్సర్ సోకడానికి అతి ప్రధానమైన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ). ఎక్కువమందితో లైంగిక చర్యలో పాల్గొనడం, గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం, వంశపారం పర్యంగా.. తదితర కారణాల ద్వారా ఇది సంక్రమించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హెచ్‌పీవీ 16, హెచ్‌పీవీ 18 వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. హెచ్‌పీవీ వైరస్ శరీరంలోకి సోకినప్పుడు, బాడీలోని ఇమ్యూనిటీ వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుంది. కొంత మంది మహిళల్లో ఈ వైరస్ కొన్ని సంవత్సరాల పాటు జీవించి ఉంటుంది.
లక్షణాలు..
- నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం.
- మెనోపాజ్ తర్వాత, లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత.. కూడా రక్తస్రావం కావడం.
- పొత్తి కడుపులో నొప్పి రావడం, లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు-ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంట రావడం.
- దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జి.
- పదే పదే యూరిన్‌కి వెళ్లాల్సి రావడంతో పాటు ఆ సమయంలో నొప్పిగా అనిపించడం.
- తరచూ కడుపుబ్బరం వేధిస్తున్నా, అలసట, నీరసం, విరేచనాలు.
Cervical Cancer Vaccine : ఈ క్యాన్సర్‌కు చికిత్స ఉందా ?
- గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చిన్న వయసులోనే ఆడపిల్లలకు వ్యాక్సిన్లను వేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. తొమ్మిదేళ్ల నుంచి పదిహేనేళ్ల లోపు ఆడపిల్లలకు రెండు డోసులను వేయించాలని.. తొలి డోసు వేసిన తరవాత ఆరు నెలలకు మరో డోసు వేయించాలని అంటున్నారు.
- అలాగే పదిహేను సంవత్సరాల వయసు దాటిన ఆడపిల్లలు మూడు డోసులు తీసుకోవాలి. మొదటి డోసు తరవాత రెండు నెలలకు ఒకటి, ఆరునెలలకు మరొకటి చొప్పున మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.
- సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ల వయసులోనూ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ, పెళ్లికి ముందు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.
- గర్భాశయ క్యాన్సర్ రాకుండా దాదాపు 80 శాతం వరకు ఈ టీకాలు అడ్డుకుంటాయని చెబుతున్నారు.
టీకాలకు ఎంత ఖర్చు అవుతుంది ?
Cervical Cancer Vaccine Cost: టీకాలు సరే.. మరి దాని ఖర్చు సంగతేంటంటే.. ఒక్కో డోసుకు 2 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
పెళ్లికి ముందే..
హెచ్‌పీవీలో చాలా రకాల వైరస్‌లు ఉంటాయి. అన్ని వైరస్‌ల వల్ల క్యాన్సర్ రాదని, హైరిస్క్ హెచ్‌పీవీ వల్ల మాత్రమే క్యాన్సర్ వస్తుందని నిపుణులు అంటున్నారు. శరీరంలో ఉండేది మామూలు వైరసా, లేదా హైరిస్క్ వైరసా అనే విషయం బయటికి తెలియదు కాబట్టి, లైంగిక జీవితం ప్రారంభించకముందే టీకాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్లు వేయించుకున్న సరే, పెళ్లి తరవాత లేదా లైంగిక జీవితం ప్రారంభించిన మూడేళ్ల తరవాత పాప్‌స్మియర్ తప్పకుండా చేయించుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
13 ఏళ్లొచ్చినా పక్క తడుపుతున్నారా? - ఇలా చేయండి!
మీ ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా లేకపోతే - ముఖ్యంగా పెళ్లైన వాళ్లకు - ఈ సమస్యలు గ్యారెంటీ!
How To Avoid Teeth Stains : మీ దంతాలు పాలలా తెల్లగా మెరవాలా? ఈ చిట్కాలు మీకోసమే!