కుంగుబాటు బారినపడకూడదని అనుకుంటున్నారా? ఏకాగ్రత పెంచుకోవాలని భావిస్తున్నారా? అయితే అక్రోట్లు (వాల్‌నట్స్) తిని చూడండి. గింజపప్పులు (నట్స్) అసలే తిననివారితో పోలిస్తే.. వీటిని తీసుకునేవారికి కుంగుబాటు ముప్పు 8% తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్‌ఎంజెలిస్ పరిశోధకులు గుర్తించారు. అదే అక్రోట్లు తీసుకునేవారికైతే 26% వరకు ముప్పు తక్కువగా ఉంటుండటం విశేషం. వీటితో శక్తి పుంజుకోవటంతో పాటు ఏకాగ్రత, ఆశావహ దృక్పథం కూడా బాగా మెరుగవుతున్నట్టూ తేలింది.
వాల్‌నట్స్‌లో ప్రత్యేకమైన కొవ్వు ఆమ్లాలు.. ముఖ్యంగా ఒమేగా 3 అల్ఫా లినోలిక్ ఆమ్లం దండిగా ఉంటుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెకు, మెదడుకు మేలు చేస్తాయన్నది తెలిసిందే. ఇవి కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పట్టటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా తేలటం గమనార్హం.