రోజురోజుకీ మీ పొట్ట పెరిగిపోతుందా.. ఆ పొట్టను కరిగించలేక ఒత్తిడికి లోనవుతున్నారా.. రకరకాల కసరత్తులు చేస్తున్నారా.. అయితే ఓసారి ఈ చిన్న చిన్న చిట్కాలు, ఆహార నియమాలు పాటించి చూడండి.
![](https://assets.eenadu.net/article_img/typesofbellyfatsgh650-3.jpg)
ప్రసవానంతర పొట్టా?!
డెలివరీ అయ్యాక కూడా పొట్ట ఎత్తుగా కనిపించడం సహజమే! అయినా దీన్ని అంగీకరించడానికి చాలా మంది మహిళలు ఇష్టపడరు. ఈ క్రమంలో వెనువెంటనే పొట్ట తగ్గించుకొని తిరిగి నాజూగ్గా మారాలని ఆరాటపడుతుంటారు. ఒత్తిడికీ గురవుతుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి నష్టం తప్ప.. మరే ప్రయోజనం ఉండదు. అందుకే ఒత్తిడికి లోనవకుండా, చక్కటి జీవనశైలిని పాటిస్తే కొన్ని రోజుల్లోనే మార్పు గమనించచ్చంటున్నారు నిపుణులు.
ఈ క్రమంలో ప్రసవం అయ్యాక 6 నుంచి 8 వారాల తర్వాత మీ గైనకాలజిస్ట్ సలహా మేరకు చిన్న చిన్న వ్యాయామాలు మొదలుపెట్టచ్చు. ఈ క్రమంలో నడక, పాపాయిని ఎత్తుకొని కాసేపు అటూ ఇటూ నడవడం, యోగా, ధ్యానం.. ఇలా కుట్లపై ఒత్తిడి పడని వ్యాయామాల్ని సాధన చేయచ్చు. అలాగే కీగల్ వ్యాయామాలు కూడా వదులైన చర్మం బిగుతుగా మారడానికి దోహదం చేస్తాయి. ఇక ఆహారం విషయానికొస్తే.. నట్స్, డ్రైఫ్రూట్స్, ఆలివ్ నూనె, అవకాడో.. వంటి మంచి కొవ్వుల్ని తీసుకోవాలి. నిపుణుల సలహా మేరకు పోస్ట్ పార్టమ్ స్లిమ్మింగ్ బెల్ట్, చీర చుట్టుకోవడం.. వంటివి ప్రయత్నించచ్చు.
![](https://assets.eenadu.net/article_img/typesofbellyfatsgh650-1.jpg)
కూర్చొని తింటే లావైపోరూ!
కొంతమందికి శరీర పైభాగం స్లిమ్‌గా ఉంటుంది. అదే పొట్ట దగ్గరికొచ్చే సరికి కాస్త లావుగా కనిపిస్తుంది. దీంతో పొట్ట కింది భాగాలు కూడా లావెక్కినట్లే కనిపిస్తాయి. ఇందుకు రెండు కారణాలుండచ్చంటున్నారు నిపుణులు. మొదటిది - ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్-ప్రాసెస్డ్ ఫుడ్‌కు అలవాటు పడడం.. వంటి వాటి వల్ల పొట్ట చుట్టూ కొవ్వులు పేరుకుపోతాయి.
ఇక రెండోది - జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల ఎప్పుడు చూసినా పొట్ట ఉబ్బరంగా కనిపిస్తుంటుంది. మరి, ఇలాంటి పొట్టను తగ్గించుకోవాలంటే.. పీచు అధికంగా ఉండే బీన్స్, బ్రకలీ, బెర్రీ పండ్లు, అవకాడో, యాపిల్, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోని ఫైబర్ తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇక నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు తీసుకున్నా ఫలితం ఉంటుంది. వీటితో పాటు పొట్టపై ఒత్తిడి పడే కోర్ వ్యాయామాలు, బరువులెత్తడం, మెట్లెక్కడం.. వంటివి సాధన చేయచ్చు. తద్వారా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగడంతో పాటు అక్కడి కండరాలు కూడా దృఢమవుతాయి.
![](https://assets.eenadu.net/article_img/typesofbellyfatsgh650-2.jpg)
హార్మోన్లే బద్ధ శత్రువులు!
మన ఆహారపుటలవాట్లు, జీవనశైలి మార్పులు శరీరంలో హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే మనసులో కలిగే ఆందోళనలు-ఒత్తిడి వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయులు కూడా పెరిగిపోతాయి. పొట్ట ఎత్తుగా కనిపించడానికి ఇవే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. మరి, ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు జీవనశైలి మార్పులు అవసరం అంటున్నారు.
ఇందుకోసం.. యోగా, ధ్యానం.. వంటివి సహకరిస్తాయి. ఇవి సాధన చేయడం వల్ల రాత్రుళ్లు నిద్ర కూడా చక్కగా పడుతుంది.. ఫలితంగా శరీరం పునరుత్తేజితం అవుతుంది. అలాగే అనారోగ్యకరమైన కొవ్వులు నిండి ఉండే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, నూనె సంబంధిత పదార్థాలను దూరం పెట్టి.. ఆరోగ్యకరమైన కొవ్వులు నిండి ఉన్న చేపలు, నట్స్, డ్రైఫ్రూట్స్.. వంటివి తీసుకోవాలి. అత్యవసరమైతే హార్మోన్ల సమతుల్యత సాధించడానికి డాక్టర్ పర్యవేక్షణలో మందులు కూడా వాడచ్చు.
![](https://assets.eenadu.net/article_img/typesofbellyfatsgh650-4.jpg)
కడుపుబ్బరానికి ఇలా చెక్!
పడని పదార్థాలు తిన్నా, ఆహారం ఎక్కువ మొత్తంలో లాగించినా, నీళ్లు ఎక్కువగా తాగినా పొట్ట ఉబ్బిపోతుంది. ఇలాంటి పరిస్థితి చూడ్డానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిది కాదు. దీనివల్ల అజీర్తి, గ్యాస్ట్రిక్.. వంటి సమస్యలూ తలెత్తచ్చు. అందుకే ఈ సమస్యను త్వరగా అదుపులోకి తెచ్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
ఇందుకోసం మన జీర్ణవ్యవస్థకు సరిపడే ఆహార పదార్థాల్నే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పీచు అధికంగా ఉండే పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి. అలాగే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫలితంగా శరీరంలోని/పొట్టలోని విషతుల్యాలు బయటికి వెళ్లిపోయి ఆరోగ్యంగా ఉండచ్చు. నిపుణుల సలహా మేరకు కొన్ని రకాల వ్యాయామాలు కూడా సాధన చేయచ్చు. ఇవన్నీ చేసినా ఫలితం లేదంటే మాత్రం నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక వీటితో పాటు బరువు ఎక్కువగా ఉన్న వారు, స్థూలకాయుల్లో కూడా పొట్ట లావుగానే ఉంటుంది. కాబట్టి పొట్ట పెరిగిపోవడానికి కారణమేదైనా సరే.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, తీసుకునే ఆహారంలో చక్కెర తగ్గించడం, వ్యాయామాలు చేయడం.. వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటే సమస్య నుంచి త్వరగా విముక్తి పొందచ్చు.. ఆరోగ్యంగానూ ఉండచ్చు..!
ఇదీ చూడండి: DOCTORS ADVICE: కరోనా బాధితుల వ్యాయామంపై నిపుణులు ఏమంటున్నారంటే?