Tulsi Oil Benefits In Telugu : తులసి మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం వింటూనే ఉంటాం. అందంతో పాటు ఆరోగ్యానికి తులసి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రత్యేకించి జుట్టు, దంత సంరక్షణకు ఇవి బాగా దోహదపడతాయి. తలలో దురద, చుండ్రు లాంటి సమస్యలతో బాధపడేవారికి తులసి నూనె చక్కటి పరిష్కార మార్గం.
తులసి.. భారతీయ సంస్కృతిలో ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. మన దేశంలోని దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. దీనికి ఆధ్యాత్మికపరంగానే కాదు.. ఆయుర్వేదంలోనూ గొప్ప స్థానం ఉంది. ఈ మొక్కను మూలికల రాణిగా పిలుస్తారు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్-ఏ, విటమిన్-డీతో పాటు ఐరన్, ఫైబర్, ఆల్సోలిక్ యాసిడ్, యూజినాల్ లాంటి పోషకాలు ఉంటాయి.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Tulasi Oil Health Benefits : తులసి మొక్క ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ ఆకులను రోజూ నీళ్లలో వేసుకొని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ కొన్ని తులసి ఆకుల్ని నమలడం వల్ల జలుబు లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులు, గుడ్డులోని తెల్లసోనను కలిపి పేస్ట్‌లా చేసి 20 నిమిషాలు ముఖానికి పట్టించి కడిగేయాలి. వారానికి ఓసారి ఇలా చేస్తే చర్మం బిగుతుగా మారి ముఖం కాంతివంతంగా మారుతుంది. తులసి రసాన్ని తరచూ తీసుకోవడం చర్మం, శిరోజాలు, పళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిలా ఉంటే తులసి నూనెతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి తులసి నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
How To Make Tulasi Oil :
ఆకులు తాజాగా ఉండాలి!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తులసి ఆకులతో నూనెను తయారు చేసి వాడుకోవచ్చు. ఇందులో భాగంగా ముందు తులసి ఆకులతో పాటు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను సిద్ధం చేసుకోవాలి. అయితే తులసి ఆకుల్ని తాజాగా ఉండేలా చూసుకోవాలి. తులసి ఆకుల్ని నీళ్లలో బాగా కడిగి తేమ పోయేంత వరకు బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత ఒక గాజు సీసా లాంటిది తీసుకొని అందులో ఆరబెట్టిన తులసి ఆకులను వేయాలి. ఆకులను చూర్ణంలా చేసి సీసాలో వేయడం వల్ల వాటి నుంచి మరింత సువాసన విడుదలవుతుంది. తులసి ఆకులతో నిండిన సీసాను మీకు నచ్చిన నూనె(కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్)తో నింపేయాలి. అలా నూనెతో నింపిన సీసాను ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. ఇలా 2 నుంచి 3 వారాల పాటు సీసాను భద్రపరచాలి. ప్రతి రోజూ ఒకసారి ఈ సీసాను మెల్లగా ఊపాలి. దీని వల్ల తులసి ఆకుల చూర్ణం నూనెతో బాగా కలిసిపోతుంది.
వడగట్టాలి!
రెండు నుంచి మూడు వారాల సమయం పూర్తయ్యాక పొడి బట్ట సాయంతో సీసాలోని నూనెను వేరే సీసాలోకి వడగట్టాలి. అలా తీసిన నూనెను చల్లటి లేదా చీకటి ప్రదేశంలో ఉంచాలి. అలాగే దాంట్లోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి.