ఉరుకుల పరుగుల జీవితంలో ఆందోళన అందరినీ వేధించే సమస్యగా మారింది. ఇది శ్రుతి మించితే.. అన్నింటా నష్టమే మిగులుతుంది. మరి ఈ ఆలోఛన ధోరణిని మార్చుకోవాలంటే.. 5-4-3-2-1 చిట్కాను పాటించి చూడండి. మన జ్ఞానేంద్రియాలతో ముడిపడిన ఇది చాలా తేలికైంది. ఎక్కడైనా, ఎవరైనా పాటించొచ్చు.
5. చుట్టుపక్కల కనిపించే ఏవైనా అయిదు వస్తువులను తేరిపార చూడండి. పెన్ను, ఫ్యాన్, టేబుల్.. ఇలా ఏవైనా సరే.
4. తాకటానికి వీలైన నాలుగు వస్తువులను గుర్తించండి. వాటిని తాకుతున్నప్పుడు చేతికి కలిగే స్పర్శను మనసులో ఊహించుకోండి. ఉదాహరణకు: పెంపుడు కుక్కను నిమురుతున్నప్పుడు వేళ్లకు తాకే మెత్తదనం, చల్లటి బాటిల్‌ను ముట్టుకున్నప్పుడు తగిలే చల్లదనం వంటివి.
3. మీకు వినిపించే మూడు శబ్దాలను వినండి. అవి పక్షుల కిలకిలలు కావొచ్చు, పిల్లాడి నవ్వు కావొచ్చు, బూట్ల చప్పుడు కావొచ్చు. ఏవైనా సరే. శ్రద్ధగా ఆలకించండి.
2. వాసన వచ్చే ఏవైనా రెండు పేర్లను ఉచ్చరించండి. వాటిని తలచుకుంటున్నప్పుడు ఆయా వాసనలనూ మనసులో ఊహించుకోండి. ఒకవేళ మల్లెపూల పరిమళం ఇష్టమైతే.. అవి అందుబాటులో ఉంటే వాటి వాసననూ పీల్చుకోవచ్చు.
1. రుచి చూడగలిగిన ఒక వస్తువును గుర్తించండి. చుట్టుపక్కల అలాంటివేవీ కనిపించకోతే జేబులో చాక్లెట్ వంటిదేదైనా ఉంటే నోట్లో వేసుకొని చప్పరించండి.
ఇలా చుట్టుపక్కల ఉన్న వస్తువుల మీద దృష్టి సారిస్తే మనసు వర్తమానంలోకి వచ్చేస్తుంది. గతాన్ని తలచుకొని బాధపడటం, భవిష్యత్తును ఊహించుకొని బెంగపడటం తగ్గుతుంది.
ఇదీ చూడండి:బరువు తగ్గాలా? వ్యాయామం అప్పుడే చేయండి!