కోట గోడ బలంగా ఉంటే శత్రువు లోపలికి ప్రవేశించటం అసాధ్యం. ఒకవేళ ప్రవేశించినా సైన్యం సాయుధ సంపత్తితో సంసిద్ధంగా ఉంటే ఎదుర్కోవటం, ఓడించటం తేలిక. మనలోనూ అలాంటి కోట గోడ ఉంది. అదే రోగనిరోధకశక్తి. ఇది బలంగా ఉన్నంతవరకూ హానికారక సూక్ష్మక్రిములేవీ మనలోకి ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశించినా శరీరం గట్టిగా ఎదుర్కొంటుంది. ఇన్‌ఫెక్షన్‌గా మారకముందే తిప్పికొడుతుంది. అందువల్ల దీన్ని కాపాడుకోవటం అన్ని విధాలా మంచిది. ఇందుకు మంచి జీవనశైలి, పోషకాహారం వంటివి ఎంతగానో తోడ్పడతాయి.
వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కదలకుండా పనిచేసే ఉద్యోగాలు చేసేవారికిది మరింత ముఖ్యం. వ్యాయామం, శారీరక శ్రమ మూలంగా రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో రోగనిరోధక కణాలు చురుకుగా, తేలికగా శరీమంతా విస్తరిస్తాయి. సమర్థంగా పనిచేస్తాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు, ఆపిన వెంటనే శరీర ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది. ఇది సూక్ష్మక్రిముల వృద్ధిని అడ్డుకుంటుంది, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి తోడ్పడుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం సైతం రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.
పోషకాహారం: రోగనిరోధక కణాలు వృద్ధి చెందటానికి, అవి సజావుగా పనిచేయటానికి విటమిన్ సి, విటమిన్ డి, జింక్, సెలీనియం, ఐరన్, ప్రొటీన్ వంటివి ఎంతగానో తోడ్పడతాయి. అందువల్ల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పసుపు, జిలకర, కొత్తిమీర, అల్లం వంటి దినుసులూ వాడుకోవాలి. రోజూ కాసేపు ఎండకు ఉండే చర్మం విటమిన్ డిని తయారుచేసుకుంటుంది. మన పేగుల్లోని బ్యాక్టీరియా రోగనిరోధకశక్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగు, మజ్జిగ వంటి పులిసిన పదార్థాలు మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి, అస్తవ్యస్తం కాకుండా ఉండటానికి దోహదం చేస్తాయి. ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలకు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇవి పేగుల్లో వాపు ప్రక్రియను ప్రేరేపిస్తాయి. రోగనిరోధకశక్తిని తగ్గిస్తాయి.
కంటి నిండా నిద్ర: నిద్ర పోతున్నప్పుడు మన రోగనిరోధకశక్తి సైటోకైన్లనే ప్రొటీన్లను విడుదల చేస్తుంది. ఇవి ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడతాయి. నిద్రలేమితో సైటోకైన్ల ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాదు, ఇన్‌ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలు, తెల్లరక్తకణాల సంఖ్యా పడిపోతుంది. అందువల్ల కంటి నిండా నిద్ర, తగినంత విశ్రాంతి చాలా కీలకం. పెద్దవాళ్లకు రాత్రిపూట 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. యుక్తవయసు పిల్లలు 9-10 గంటలు, బడికి వెళ్లే పిల్లలు 10 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలి.
బరువు నియంత్రణ: ఊబకాయం మూలంగా ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే బి కణాల సామర్థ్యం తగ్గుతుంది. యాంటీబాడీల ఉత్పత్తీ క్షీణిస్తుంది. మరోవైపు కొవ్వు కణజాలం అనవసరంగా సైటోకైన్లను ఉత్పత్తి చేస్తుంటుంది. దీంతో ఒంట్లో నిరంతరం వాపు ప్రక్రియ కొనసాగుతూ వస్తుంటుంది. ఇది ఒకవైపు ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే ఇతర రోగనిరోధక కణాల పనితీరును దెబ్బతీస్తుంది. మరోవైపు రోగనిరోధకశక్తిని విపరీతంగా ప్రేరేపించి, సైటోకైన్ల ఉప్పెనకు దారితీస్తుంది. కాబట్టి బరువు అదుపులో పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: ఆస్ప్రినే కాదు.. నైట్రేట్లూ ముఖ్యమే.!