జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ ప్రొటీన్లు, మాంస కృత్తులు కలిగిన ఆహారం తీసుకుంటే.. బరువును అదుపులో ఉంచుకోవడం లేదా అధిక బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు.
పండ్లు... కూరగాయలతో..
వీటిలో కెలొరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని సలాడ్ల రూపంలో తీసుకుంటూ ఉండాలి. వీటిలో పీచూ అధికమే. ఇవి తింటే పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు. ఆహారంలో మాంసకృత్తులు, ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, పప్పులను తీసుకోవాలి.
వేపుళ్లు నో నో!
వీటిలో పెద్ద మొత్తంలో కొవ్వులుంటాయి. కాబట్టి వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఆవిరిపై ఉడికించిన వాటిని తీసుకోవాలి. ఉదాహరణకు బంగాళా దుంప వేపుడు బదులుగా దాన్ని ఉడికించి కూరలా తింటే తక్కువ కెలొరీలు వస్తాయి.
అల్పాహారం అత్యవసరం..
చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడమో లేదా ఆలస్యంగా తీసుకోవడమో చేస్తుంటారు. ఈ రెండూ సరికాదు. సమయానికి సరైన మోతాదులో బ్రేక్‌ఫాస్ట్ తప్పక చేయాలి. దీంట్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
రాత్రి భోజనం?
రాత్రి పూట ఏ సమయానికి తింటున్నారో... ఏం తింటున్నారో గమనించుకోవాలి. వీలైనంత మటుకు చాలా తేలికగా అరిగే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి. త్వరగా డిన్నర్ ముగించాలి. దానికీ, నిద్రకూ మధ్య కనీసం రెండు, మూడు గంటల వ్యవధి ఉంటే మంచిది.
ఇదీ చదవండి: 'కరోనా దోపిడీ' బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తారా?