నిద్రలేమి.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైంది. అయితే పురుషుల్లో కంటే మహిళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఒత్తిడి, అనవసరమైన ఆందోళనలు, అతిగా ఆలోచించడం, ఇతర ఆరోగ్య సమస్యలు.. మొదలైనవన్నీ ఇందుకు కారణమవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. మరి దీన్ని ఇలాగే వదిలేస్తే ఆరోగ్యం మరింతగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. అందుకోసం కొన్ని నియమాల్ని పాటించాలి. అవేంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి..
వాతావరణం అనుకూలంగా..
ఆరోగ్యవంతమైన నిద్ర కావాలంటే ముందుగా పడకగది వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. గదిలోకి ఇతర శబ్దాలు వినపడకుండా కిటికీలు, తలుపులు మూసివేయడం, బయటి వాతావరణాన్ని బట్టి గది వాతావరణాన్ని సెట్ చేసుకోవడం, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, పడుకోవడానికి మంచం అనువుగా ఉందో లేదో సరిచూసుకోవడం, తక్కువ ధ్వనితో ఇష్టమైన సంగీతం వినడం, గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం.. ఇలా పడుకోవడానికి ముందుగానే జాగ్రత్తలన్నీ తీసుకుంటే పడుకున్న తర్వాత నిద్రాభంగం కలగకుండా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా, హాయిగా నిద్ర పట్టే అవకాశం కూడా ఉంటుంది.
పడుకునే ముందు..
రోజంతా రకరకాల పనులతో సతమతమయ్యే మహిళలకు విశ్రాంతి దొరికేది రాత్రి పడుకునే సమయంలోనే. అయితే వివిధ పనుల వల్ల కలిగే ఒత్తిళ్లతో వారికి రాత్రుళ్లు నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. కాబట్టి పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరానికి, మనసుకు హాయిగా అనిపించడంతో పాటు ఒత్తిళ్లు కూడా దూరమవుతాయి. తద్వారా నిద్ర కూడా బాగా పట్టే అవకాశం ఉంటుంది.
పొజిషన్ ఛేంజ్!!
చాలామంది మహిళలు బోర్లా పడుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. పైగా అలా పడుకోవడం వల్లనే నిద్ర బాగా పడుతుందనంటారు. అయితే బోర్లా పడుకోవడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి పడుకునే పొజిషన్ ఛేంజ్ చేయడం ఉత్తమం. పక్కకు తిరిగి పడుకోవాలంటే కుడివైపుకి లేదా వెల్లకిలా పడుకోవడం మరీ మంచిది. వెల్లకిలా పడుకోవడం వల్ల శరీర అవయవాలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకు వెల్లకిలా పడుకోవడమే ఆరోగ్యవంతమైన నిద్రాస్థితి.
ఒత్తిడి మాయం..
మహిళలు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు పనుల్ని సమన్వయం చేసుకునే క్రమంలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవడం సహజం. అయితే ఇది నిద్రపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇందుకోసం కాసేపు స్విమ్మింగ్, వ్యాయామం, మసాజ్ చేయించుకోవడం.. వంటివి వారి లైఫ్‌స్త్టెల్‌లో భాగం చేసుకోవాలి. తద్వారా శరీరంలోని నరాలకు, కండరాలకు విశ్రాంతి లభించి ఒత్తిడి క్రమంగా దూరమవుతుంది. ఫలితంగా రాత్రుళ్లు చక్కటి నిద్రకు ఉపక్రమించవచ్చు.
ఇవన్నీ ఉండకుండా..
చాలామంది పడకగదుల్లో టీవీలు, కంప్యూటర్లు అమర్చుకుంటుంటారు. వీటి ధ్యాసలో పడితే అస్సలు నిద్ర పట్టదు. మరికొంతమందైతే టీవీ చూస్తున్నప్పుడు నిద్ర రాకూడదని స్నాక్స్, బిస్కట్స్ వంటివి లాగించేస్తుంటారు. తద్వారా అటు నిద్రలేమితో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఇటు క్యాలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి పడకగదిలో చోటివ్వకపోవడమే మంచిది.
చూశారుగా.. ఆరోగ్యవంతమైన నిద్ర సొంతం కావాలంటే పాటించాల్సిన నియమాలు. మరి మీరు కూడా ఇప్పట్నుంచే ఇవన్నీ అమలు చేయండి.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
ఇదీ చదవండి: ఉమెన్స్ డే స్పెషల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే..!