బ్లీడింగ్ ఎక్కువగా..
ప్రసవం తర్వాత కలిగే శారీరక మార్పుల్లో బ్లీడింగ్ ఎక్కువగా అవడం కూడా భాగమే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు రెండు మూడు వారాల వరకు ఎక్కువ మొత్తంలో బ్లీడింగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత అందులోని మలినాలు, మిగిలిన వ్యర్థపదార్థాలన్నీ రక్తం రూపంలో బయటికి వెళ్లిపోయి గర్భసంచి శుభ్రపడడమే ఇందుకు కారణమంటున్నారు.
నాలుగైదు లేదా ఆరు నెలలు...
ఇక ఆ తర్వాత మళ్లీ నాలుగైదు నెలలు లేదంటే ఆరు నెలల అనంతరం మహిళల్లో నెలసరి ప్రారంభమవడం గమనించవచ్చంటున్నారు వైద్యులు. కాబట్టి ఈ సమయంలో బ్లీడింగ్ ఎక్కువవుతోందని భయపడకుండా నిపుణులు సూచనలు శ్రద్ధగా పాటిస్తే మేలని సూచిస్తున్నారు.
జుట్టు రాలుతోందా?
డెలివరీ తర్వాత జుట్టు ఎక్కువగా రాలడం చాలామందిలో మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఇంతకంటే ఎక్కువగా జుట్టు రాలడం గర్భధారణ సమయంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఆ సమయంలో తలెత్తే హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి సమస్యలే కారణమట.
![ప్రసవానంతరం ఈ మార్పులు సహజమే !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8664229_465_8664229_1599131217451.png)
హార్మోన్ల ప్రభావం...
అయితే ప్రసవం తర్వాత కూడా దాదాపు ఆరు నెలల వరకు హార్మోన్ల ప్రభావం శరీరంపై ఇలాగే ఉంటుందని, తద్వారా ఆ సమయంలోనూ జుట్టు అధికంగా రాలుతుందని, ఆరు నెలల తర్వాత పరిస్థితి సాధారణమవుతుందటున్నారు వైద్యులు. కాబట్టి జుట్టు అధికంగా రాలుతోందని అనవసరంగా కంగారు పడకుండా ప్రసవం తర్వాత కూడా నిపుణులు సలహాతో సమతులాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కొంతవరకైనా ఉపశమనం పొందచ్చు.
పొట్ట ఎత్తుగా..
గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత పొట్ట తిరిగి నాజూగ్గా తయారవడానికి కాస్త సమయం పడుతుంది. అంత వరకు పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంది. అంతేకాదు.. గర్భధారణ సమయంలో చర్మం క్రమంగా సాగుతుంది. అలాగే ప్రసవానంతరం సాగిన చర్మం ముడుచుకోకుండా స్ట్రెచ్ మార్క్స్ రూపంలో చర్మంపై కనిపిస్తాయి.
అందుకోసం బెల్టు వాడాలి...
కాబట్టి పొట్ట తగ్గించుకోవడానికి నిపుణులు సూచించిన బెల్టును ధరించడంతో పాటు వైద్యుల సూచనల మేరకు స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి సరైన చిట్కాలు పాటిస్తూ, తగిన వ్యాయామాలు చేయడం కూడా ఎంతో అవసరం. తద్వారా ఈ శారీరక మార్పును త్వరగా కవర్ చేసుకోవచ్చు.
రొమ్ముల్లో పెరుగుదల..
బిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల తర్వాత తల్లి స్థనాలు పాలతో నిండిపోతాయి. ఫలితంగా అవి కాస్త ఎరుపెక్కడం, వాపు.. వంటి మార్పులొస్తాయి. తర్వాత మూడు నాలుగు రోజుల వరకు కాస్త వాపు తగ్గుతుంది.. కానీ అక్కడి చర్మం కాస్త సాగినట్లుగా తయారవుతుంది. అలాగే బిడ్డకు పాలివ్వడం కాస్త ఆలస్యమైనా.. స్థనాల్లో పాల నిల్వలు పెరిగి చనుమొనల నుంచి కారుతుంటాయి.
అలా అయితే పాలు గడ్డకట్టుకుపోతాయి...
అంతేకాదు.. అవి అలాగే అధిక సమయం ఉండిపోతే రొమ్ముల్లో పాలు గడ్డకట్టుకుపోయి తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. కాబట్టి బిడ్డకు ఎప్పటికప్పుడు పాలివ్వడం అటు బిడ్డకు, ఇటు తల్లికి.. ఇద్దరికీ మంచిది. ఎప్పుడైతే క్రమంగా బిడ్డకు పాలివ్వడం ఆపేస్తారో అప్పుడు స్థనాల్లో వాపు కాస్త తగ్గి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు.
![ప్రసవానంతరం ఈ మార్పులు సహజమే !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8664229_275_8664229_1599131460565.png)
మరిన్ని..
* ప్రసవం తర్వాత మలబద్ధకం, మూత్రవిసర్జన సమయంలో మంట.. వంటి సమస్యలు కూడా చాలామందికి ఎదురవుతుంటాయట. కాబట్టి ఈ సమయంలో నీరు, పండ్ల రసాలు, పాలు.. వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్యను సత్వరమే తగ్గించుకోవచ్చంటున్నారు.
* బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు ఆరువారాల వరకు శరీరంలో శక్తి స్థాయులు చాలా వరకు తగ్గుతాయి. అలాగే రాత్రుళ్లు చెమటలు పట్టడం, కాస్త ఒత్తిడి.. వంటివి కూడా గమనించవచ్చు. మరి వీటన్నింటి నుంచి త్వరగా బయటపడాలంటే నిపుణుల సలహాతో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, సమతులాహారం తినడం.. వంటివి చేయడం ఉత్తమం.
* అలాగే కాళ్లు, పాదాల్లో వాపు రావడం కూడా ప్రసవం తర్వాత ఎక్కువ మందిలో గమనించవచ్చు. అయితే డెలివరీ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఈ వాపు నెమ్మదిగా తగ్గిపోతుంది.
*డెలివరీ తర్వాత తల్లి శరీరంలో జరిగే శారీరక మార్పులు, వాటి నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకున్నారు కదా ! మరి మీరూ ఇలాంటి సమయంలో కంగారు పడకుండా నిపుణుల సలహాలు క్రమంగా పాటిస్తే వీటి నుంచి ఉపశమనం పొందచ్చు.
ఇవీ చూడండి : కరోనా వేళ ఆ విషయంలో భార్యాభర్తలు చర్చించుకోవాలి మరి !!