ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి భోజనం చేయడం తప్పనిసరి. వైద్యులు కూడా ఇదే చెబుతుంటారు. అలా సమయానికి తింటే కొన్ని గంటల పాటు ఆకలి ఉండదు. ఉండకూడదు కూడా. కానీ కొంతమందిలో ఆకలి వేస్తూనే ఉంటుంది. దాంతో వారు ఏదో ఒక చిరు తిండిని తినేస్తూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఈ సమస్యకు పరిష్కారాలు ఏమిటి? తెలుసుకుందాం..
తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, చికెన్.. సాధారణంగా భోజనంలో ఇలాంటివి తీసుకుంటే ఆకలి తీరి సంతృప్తినిస్తుంది. ఆహారంలో పీచు పదార్ధం, కొవ్వు, పిండి పదార్థాలు అన్ని తగిన మోతాదులో ఉండాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు పొట్ట నిండుగా ఉన్నట్లే కాకుండా ఆహారం నిదానంగా జీర్ణమై ఎక్కువ గంటలు ఆకలి వేయకుండా ఉంటుంది. అయితే భోజన సమయంలో చక్కెర, మైదాతో చేసిన చిరు తిండ్లు, తీపి పానియాలు తీసుకుని కడుపు నిండిందిలే అనుకుంటే వెంటనే ఆకలి వేస్తుంది. కొన్నిసార్లు మనకు దాహం వేస్తున్నా అది ఆకలిగా అనిపిస్తుంది. నీరు తక్కువగా తాగే వారిలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఆకలి వేసినప్పుడు ఏదైనా తినేయకుండా నీరు తాగడం మంచిది.
"మన శరీరంలో గ్లూకోజ్ తగ్గడం వల్ల లేదా శక్తి తగ్గడం వల్ల పొట్ట నుంచి మెదడుకు సంకేతాలు అందుతాయి. అప్పుడు కొన్ని సెక్రీషన్స్ లేదా హార్మోన్స్ సెక్రీట్ అవుతాయి. గ్రెలిన్ అనే హార్మోన్ పొట్ట, చిన్న పేగుల్లో(తక్కువగా) సెక్రీట్ అవుతుంది. అప్పుడు ఆకలి వేస్తుంది. ఫుడ్ తీసుకుంటాం. ఆహారం తీసుకునే క్రమంలో మళ్లీ పొట్ట నుంచి మెదడకు సంకేతాలు వెళ్తాయి. అప్పుడు లెప్టిన్ హార్మోన్ విడుదల అవుతుంది. దీంతో ఆకలి తగ్గుతుంది."
- డాక్టర్
ఆ ఆహారం తీసుకోకపోయినా
మార్కెట్లో దొరికే జంక్ ఫుడ్, తీపి పానియాలు తీసుకునే అలావాటు ఉంటే తరచుగా ఆకలి వేస్తుంటుంది. ఇలాంటి ఆహారం వల్ల మన రక్తంలో చక్కెర ఎక్కువ స్థాయిలో పెరుగుతుంది. ఈ చక్కెరను మన కణాలు వినియోగించుకోవాలంటే ఇన్సులిన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే అవసరానికి మించి ఇన్సులిన్ పెరిగినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి పడిపోయి తరచుగా ఆకలి వేస్తుంది. అలాగే మధుమేహం ఉన్నవారిలో కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
"మనం తీసుకునే ఆహారంలో సమంగా ప్రొటీన్స్.. పప్పులు, పాలు, పాల ఉత్పత్తి, నాన్ వెజిటేరియన్ పుడ్ ద్వారా ఉండేలా చూసుకోవాలి. ఆ డైట్ బ్యాలెన్స్‌గా లేకపోతే ఎప్పుడూ ఆకలి వేస్తుంటుంది. కేవలం డైట్ ద్వారానే కాదు కొన్నిసార్లు హార్మోన్స్‌లో మార్పులు వల్ల కూడా వస్తుంది. కార్టిసోల్ ఇమ్బ్యాలెన్స్ హైపర్ థైరాయిడిజమ్, షుగర్ డౌన్ అవ్వడం (హైపో గ్లేసిమియా) వల్ల కూడా ఆకలి ఎక్కువగా వేస్తుంది. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ లంచ్‌కు నాలుగు ఐదు గంటలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. లంచ్ డిన్నర్‌కు ఐదు లేదా ఆరు గంటలు కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆహారం బ్యాలెన్స్‌గా ఉండటం వల్ల ఆకలిని అదుపుచేయవచ్చు."
-డాక్టర్.
ఇలా తినాలి
ఆహారాన్ని నిదానంగా కొద్ది కొద్దిగా తినాలి. హడావుడిగా తినడం వల్ల ఆకలి తీరింది అన్న సంకేతాలు మెదడుకు చేరవు. దీంతో ఎక్కువగా తినాల్సి వస్తుంది. నిదానంగా తినడం వల్ల సంతృప్తి కలుగుతుంది. పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడు కూడా ఆహారాన్ని పరిష్కారంగా భావిస్తుంటారు. దీనిని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. అలాంటి మానసిక పరిస్థితి ఉంటే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
జాగ్రత్త పడండి..
మితిమీరిన ఆకలి ఆరోగ్యకరం కాదు. మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. కొన్ని సార్లు అధిక ఆకలికి ఊహించని కారణాలు ఉండవచ్చు. సరిపడ నిద్ర లేకపోయినా హార్మోన్లలో సమతుల్యత కోల్పోయి ఆకలి పెరుగుతుంది. కాబట్టి మితిమీరిన ఆకలి ఉన్నప్పుడు కారణాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. లేదంటే అనర్థాలకు దారితీస్తుంది.
ఇదీ చూడండి: పోషకాహార లభ్యతపై ప్రభుత్వాల చిన్నచూపు!