వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఆరోగ్య సమస్యల్లో గొంతునొప్పి ఒకటి. దీని వల్ల గొంతులో నసగా అనిపించటం, ఆహారం మింగాలంటే బాగా ఇబ్బందిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యలకు ఎక్కువ శాతం కారణం బాక్టీరియా, వైరస్. అయితే ఈ బాధల నుంచి ఉపశమనం పొందాలంటే మీ వంటింటిని ఆశ్రయిస్తే చాలు. ఏంటి నమ్మట్లేదా..? అయితే ఈ కథనం చదవండి..
బామ్మ మాట బంగారు మూట !
గొంతునొప్పికి ఏ ఇంట్లో అయినా మొదటగా గుర్తొచ్చేవి ఉప్పు, పసుపు! ఈ రెండూ మనకి మన బామ్మలు, అమ్మమ్మలు చూపిన గొప్ప పరిష్కార మార్గాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గొంతు కొంచెం గరగరా అనడం మొదలుపెడితే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు కలిపి రెండు వేళ్లతో కొండ నాలుకకు రాయడం ఒక పరిష్కారం. ఇలా చేయడం ఇబ్బందిగా ఉంటే ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూను పసుపు, అర టీ స్పూను ఉప్పు కలిపి పుక్కిలించాలి. కొంతమంది పుక్కిలించడమంటే నోటిలో నీరు పోసుకొని రెండు మూడుసార్లు పుక్కిలించి ఉమ్మేస్తారు. అలా కాకుండా ఉప్పు నీరు/పసుపు నీరు నేరుగా గొంతులో కొండ నాలుకకు తగిలే విధంగా రెండు నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇలా తీవ్రతను బట్టి రోజూ చేయడం వల్ల త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పసుపును ఇలానే కాకుండా గోరు వెచ్చని పాలలో కూడా కలిపి తీసుకోవచ్చు.
వీటిని నమిలితే సరి !
దాహంతో ఒక గుటక వేసినా ముల్లు దిగినట్లు ఉండే ఈ గొంతునొప్పి... కొన్ని రోజుల పాటు మనకి ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తుంది. ఇటువంటి సమయంలో ఓ కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని నమిలితే కాస్త ఉపశమనంగా ఉంటుంది. అలానే ఇంట్లో దొరికే వాటిలో గొప్ప యాంటీ సెప్టిక్ గుణం కలిగిన ఆహార పదార్థం వెల్లుల్లి. దీన్ని నమిలినప్పుడు అల్లిసిన్ అనే పదార్థం విడుదలవుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే ఓ వెల్లుల్లి పాయను బుగ్గన పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు నములుతూ రసాన్ని మింగమంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మరింత ప్రభావం చూపేందుకు ఓ లవంగాన్ని కూడా దీనితో కలిపి తీసుకోవచ్చు. వెల్లుల్లి వగరు మరీ ఇబ్బందిగా ఉంటే కాస్తంత తేనె కలుపుకోవచ్చు.
నేరుగా లేదంటే టీలో...!
కఫానికి ఇంట్లో లభించే గొప్ప ఆహార పదార్థాల్లో అల్లం, తేనె కూడా ముఖ్యమైనవే. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అలానే అల్లంలో తాప నివారక గుణాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రోగాన్ని నయం చేసే క్రియను తేనె వేగవంతం చేయగలదు. అల్లానికి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, రక్త ప్రసరణను బలపరిచే గుణం ఉంది. అల్లాన్ని రసం తీసి కొంచెం తేనె కలిపి నేరుగా తాగితే కొన్ని రోజుల్లోనే గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు వివిధ హెర్బల్ టీలలో కూడా వీటిని మిళితం చేసి సేవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇక అల్లం టీ గురించి చాలామందికి తెలిసిందే. ఎప్పుడూ తాగే టీ కంటే ఈ చలికాలంలో అల్లం టీ తాగితే కఫ సంబంధిత రోగాలకు చాలా మంచిది.
హాట్ సూప్స్ !
కఫానికి సంబంధించిన రోగాల నుంచి ఉపశమనం కలిగించే వాటిలో సూప్స్ కూడా ముఖ్యమే. శీతాకాలంలో చల్లదనం వల్ల మనం తీసుకొనే నీటి శాతం తక్కువగా ఉంటుంది. అందుకే తీసుకొనే ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోమని సలహా ఇస్తుంటారు వైద్యులు. ఇటు వేడిగా ఉంటూ అటు ద్రవాన్ని మన శరీరానికి అందించడంలో సూప్స్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మరి ఏ రకమైన సూప్స్ తీసుకోవాలి ? కొంతమంది కఫానికి చికెన్ సూప్ మంచిది అంటారు. అయితే జీవజంతువులకు సంబంధించిన ఏ ఆహారంలో అయినా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో లైట్‌గా జీర్ణమయ్యే ఆహారమైతే మంచిది కాబట్టి సాధారణ వెజిటబుల్ సూప్స్ అయితేనే బెటర్ అంటున్నారు వైద్యులు. ఇలా వేడి వేడి సూప్స్ తీసుకోవడం వల్ల ముక్కు, గొంతు, ఛాతీలో ఆవిరి ప్రవేశించి కఫం కరిగి ఉపశమనం లభిస్తుంది. అంతేకానీ కఫానికి చికెన్ సూప్ అయితేనే కరక్ట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు.
కనిపించే సంజీవని !
ఏ రోగానికైనా చూపే పరిష్కార మార్గాల్లో తులసిని చేర్చకపోతే పెద్ద అపరాధం చేసినట్లే. రామాయణంలోని సంజీవనీ వృక్షం ఎలా ఉంటుందో తెలియదు కానీ మనకి కనిపించే సంజీవని తులసి. కఫానికి సంబంధించిన రోగాలేవైనా వాటికి వాడే విరుగుడులో తులసి ఉండాల్సిందే. అంతటి గొప్పతనం తులసిది. ఆయుర్వేద నిపుణులు సూచించినట్లుగా అయిదారు తులసి ఆకులను ఓ గ్లాస్ నీళ్లలో కలిపి పావుగంట సేపు ఉంచాలి. తర్వాత ఆ నీటిని తీసుకోవాలి. ఈ నీరు మరింత ప్రభావవంతంగా ఉండాలంటే రెండు యాలకులు, రెండు లవంగాలు, రెండు మిరియాలు, నానబెట్టి కూడా తాగవచ్చు. ఇది కేవలం కఫానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిదని వైద్యులు అంటున్నారు.
ఇవి తీసుకోవాలి !
- గొంతు నొప్పి ఉన్నప్పుడు మరీ వేడి వేడి ఆహార పదార్థాలు కాకుండా గోరు వెచ్చని ద్రవ పదార్థాలు అయితే త్వరగా జీర్ణమై శరీరంలో నీటి శాతాన్ని కూడా పెంచుతాయి. నాన్ వెజ్ సూప్స్ జోలికి పోకుండా ఎక్కువ శాతం వెజిటబుల్ సూప్స్‌కి ప్రాధాన్యతిస్తే మంచిది.
- ఉడికించిన కూరగాయలు తినడం వల్ల కూడా కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది.
- పులుపు లేని ఫ్రూట్ జ్యూస్‌లు, పాలు తీసుకోవడం వల్ల అటు మంచి పోషకాలతో పాటు శరీరానికి అవసరమైన నీటిని కూడా అందించవచ్చు.
- ఇక త్వరితగతిన జీర్ణమై మంచి పోషకాలను పొందడానికి అరటిపండ్లు, ఓట్‌మీల్స్ బాగా ఉపయోగపడతాయి.తేనీరు
ఇవి వద్దు !
- ఇక తినకూడని వాటిలో ఆమ్ల జాతికి చెందిన పండ్లు, కూరగాయలకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వాటిలోని ఆమ్ల గుణం వల్ల గొంతునొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
- అలానే పచ్చి కూరగాయలు త్వరగా అరగకుండా గొంతునొప్పికి కూడా ఇబ్బందిగా మారతాయి.
- ఇక పాప్‌కార్న్, పొటాటో చిప్స్ వంటి క్రంచీ, స్పైసీ ఆహార పదార్థాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.
- ఆల్కహాల్, సిగరెట్ అసలే మంచివి కావు. ఆల్కహాల్ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇక సిగరెట్ గొంతునొప్పిని పెంచడమే కానీ తగ్గించడం జరగదు.
చివరగా చలికాలంలో ఐస్‌క్రీమ్ వంటి చల్లటి పదార్థాలు ఎంత తక్కువగా తీసుకొంటే అంత మంచిది. అందులోనూ కఫం ఉన్నప్పుడు అసలు తీసుకోకపోవడం మరీ మంచిది.