ETV Bharat / sukhibhava

గురక పెడుతున్నారా..?.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనర్థాలు

Snoring reasons and cure: 'గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఎంత అదృష్టవంతుడో.' చాలామంది ఇలాగే గురకను గాఢనిద్రకు సూచనగా భావిస్తుంటారు. మంచి నిద్రలో ఉన్నప్పుడు గురకపెట్టే మాట నిజమే అయినా అన్నిసార్లూ ఇది మంచిదే అనుకోవటానికి లేదు. నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోయే సమస్యకూ (అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా సిండ్రోమ్‌) సంకేతం కావొచ్చు. దీన్ని సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు.

Snoring reasons and cure snoring
గుర్రు పెడుతున్నారా
author img

By

Published : Feb 22, 2022, 6:41 AM IST

Snoring reasons and cure: నిద్ర శరీరానికి అత్యవసరం. నిద్రలోనే శరీరం మరమ్మతు చేసుకుంటుంది. కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఇంతటి కీలకమైన నిద్రను అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా (ఓఎస్‌ఏ) దొంగదెబ్బ తీస్తుంది. ఊపిరిని ఆపేసి శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. నిద్రలో ఇంత అనర్థం జరుగుతున్నా మనకు ఏమీ తెలియకపోవటం ఆశ్చర్యకరం. చాలామంది దీన్ని 'ఓస్‌ గురకే కదా' అని భావిస్తుంటారు గానీ రోజులు గడుస్తున్నకొద్దీ లోలోపల తీవ్ర అనర్థాలకు బీజం వేస్తుంది. గుండెలయను దెబ్బతీయటం దగ్గర్నుంచి అధిక రక్తపోటు వరకూ ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది.

మామూలు గురక కాదు

మామూలు గురక పెద్ద సమస్యేమీ కాదు. తరచూ చూసేదే. ముప్పయి ఏళ్లలోపువారిలో సుమారు 10శాతం మంది.. 60 ఏళ్లు దాటినవారిలో 60శాతం మంది గురక పెడుతుంటారు. నిద్ర పోతున్నప్పుడు పై శ్వాసకోశ వ్యవస్థలో (ముక్కు నుంచి స్వరపేటిక వరకు) పాక్షికంగా అడ్డంకి తలెత్తినప్పుడు పుట్టుకొచ్చే చప్పుడే గురక. లోపలికి సుడి తిరుగుతూ వచ్చే గాలి ప్రవాహానికి అంగిలి, కొండనాలుక ప్రకంపించటం వల్ల ఇది పుట్టుకొస్తుంది. ఇదేమీ ప్రమాదకరమైంది కాదు. పక్కవాళ్లకు మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది.

కానీ అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా ఇలాంటిది కాదు. ఇందులో గురక మాత్రమే కాదు. శ్వాస కాసేపు ఆగుతుంది కూడా. నిద్రపోయినప్పుడు శరీరం మీద మనకు ఎలాంటి నియంత్రణా ఉండదు. గాఢంగా నిద్రపోతున్నకొద్దీ కండరాలు వదులవుతాయి. విశ్రాంతి స్థితిలోకి చేరుకుంటాయి. ఈ క్రమంలో శ్వాసమార్గం చుట్టుపక్కల కండరాలు కూడా వదులవుతాయి. చాలామందికి ఇదేమీ ఇబ్బంది కలిగించదు. కానీ కొందరికి గాఢనిద్రలో కండరాలు చాలా వదులవుతాయి. ఇవి శ్వాస మార్గానికి అడ్డుపడతాయి. దీంతో శ్వాస ఆగుతుంది. ఇదే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా.

అప్నియా అంటే గాలి ప్రవాహం కొద్దిసేపు పూర్తిగా ఆగిపోవటం. కనీసం 10 సెకన్లు, అంతకన్నా ఎక్కువ సేపు శ్వాస ఆగిపోతే అప్నియాగా భావిస్తారు. శ్వాస ఆగినప్పుడు రక్తంలో ఆక్సిజన్‌ తగ్గుతుంది. కార్బన్‌ డయాక్సైడ్‌ పెరిగి, మెదడులో శ్వాసప్రక్రియను నియంత్రించే భాగాన్ని ప్రేరేపిస్తుంది. ఇలా వెంటనే తిరిగి శ్వాస తీసుకునేలా చేస్తుంది. నిద్రలో ఉండటం వల్ల ఈ విషయం మనకు తెలియదు. కానీ రాత్రంతా నిద్రకు భంగం కలుగుతూనే ఉంటుంది. మాటిమాటికీ మెలకువ వస్తూ, నిద్ర పడుతుంటుంది. ఫలితంగా గాఢ నిద్ర కరవవుతుంది. దీంతో తెల్లారి హుషారుగా ఉండదు. పగటిపూట నిద్ర మత్తుగా ఉంటుంది. చికిత్స తీసుకుంటే ఇది తేలికగానే తగ్గుతుంది. నిర్లక్ష్యం చేస్తేనే తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది.

కారణాలు రకరకాలు

అవటానికి స్లీప్‌ అప్నియా నిద్ర సమస్యే అయినా దీని మూలం పై శ్వాసకోశ వ్యవస్థలోనే ఉంటుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముక్కు సమస్యలు. గురకకు 38% వరకు కారణం ఇవే. ముక్కు దూలం వంకరగా ఉండటం, టర్బినేట్లు పెద్దగా ఉండటం, గాలిగదుల్లో బుడిపెలు (పాలిప్స్‌) పెరిగి, ముక్కులోకి జారి వేలాడుతుండటం వంటివన్నీ కారణమే. ఇలాంటి సమస్యల్లో గాలి సరిగా ఆడదు. దీంతో నోటితో శ్వాస తీసుకుంటారు. ఇది గురకకు దారితీస్తుంది. అదేపనిగా నోటితో శ్వాస తీసుకుంటుంటే కొండనాలుక, అంగిలి క్రమంగా సాగుతూ వస్తాయి. ఇవి జారి శ్వాస మార్గానికి అడ్డుపడొచ్చు. గొంతులో.. ముఖ్యంగా టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ ఉబ్బటమూ గురకకు కారణమే. పిల్లల్లో గురకకు ప్రధాన కారణం ఇదే. నాలుక వెనక భాగం పెద్దగా ఉండటం.. అలర్జిక్‌ రైనైటిస్‌ వంటివీ గురకకు దారితీయొచ్చు. అరుదుగా ఎపిగ్లాటిస్‌ పెద్దగా అవటమూ గురకను తెచ్చిపెట్టొచ్చు.

  • మెదడులో శ్వాస ప్రక్రియను నియంత్రించే భాగం సరిగా పనిచేయకపోవటంతోనూ నిద్రలో శ్వాస ఆగిపోవచ్చు. దీన్నే సెంట్రల్‌ అప్నియా అంటారు.

లక్షణాలు అనేకం

అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా గలవారిలో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. రాత్రిపూట సరిగా నిద్రపోకపోవటం వల్ల పగటిపూట నిద్రమత్తు ఆవహిస్తుంటుంది. రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గటం వల్ల తెల్లారి లేచాక హుషారుగా ఉండదు. తీవ్రమైన అలసట, ఉదయం పూట తలనొప్పి వేధిస్తుంటాయి. శృంగారం మీదా ఆసక్తి తగ్గచ్చు. వ్యక్తిత్వంలోనూ మార్పులు.. అంటే మూడ్‌ మారొచ్చు, తెలివి తేటలు తగ్గొచ్చు. కొందరు వాహనాలు నడుపుతున్నప్పుడూ నిద్రపోవచ్చు. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది. గురక మూలంగా భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో పడుకోవటం మరో సమస్య.

నిర్ధరణ- నిద్ర పరీక్ష ప్రధానం

గురక తీవ్రతను గుర్తించటంలో భాగస్వాములు చెప్పే వివరాలు కీలకం. గురక మాత్రమే పెడుతున్నారా? ఊపిరి కాసేపు ఆగిపోయి, తర్వాత పెద్ద గురకతో శ్వాస తీసుకుంటున్నారా? అనేవి పక్కన ఉండేవారే చెప్పగలరు. ఇలాంటి వివరాలను లక్షణాలతో పోల్చి చూడాల్సి ఉంటుంది. స్లీప్‌ అప్నియా నిర్ధరణకు రాత్రిపూట నిద్ర పరిశీలనే ప్రామాణిక పరీక్ష. దీన్నే ఓవర్‌నైట్‌ స్లీప్‌ స్టడీ లేదా పాలీసామ్నోగ్రఫీ అంటారు. నిద్రలో ఎప్పుడెప్పుడు, ఎంతసేపు శ్వాస ఆగిపోతోందనేది ఇది లెక్కించి చూపుతుంది. దీన్నే అప్నియా హైపాప్నియా సూచిక (ఏహెచ్‌ఐ) అంటారు. గంటకు 0-5 సార్లు శ్వాస ఆగటం నార్మల్‌. అదే 5-15 సార్లు ఆగితే ఒక మాదిరి సమస్యగా, 15-30 సార్లు ఆగితే మధ్యస్థంగా, 30 కన్నా ఎక్కువ సార్లు ఆగితే తీవ్రంగా పరిగణిస్తారు. ఏడు గంటల నిద్రలో 30 కన్నా ఎక్కువసార్లు శ్వాస ఆగిపోతే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియాగా నిర్ధరిస్తారు. స్టీప్‌ స్టడీలో రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులూ బయటపడతాయి. స్లీప్‌ స్టడీని ఆసుపత్రిలో చేయొచ్చు, ఇంట్లోనూ చేయొచ్చు. ఇంట్లో నిద్ర తీరుతెన్నులు మామూలుగా ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే చేయటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ముక్కు, గొంతు పరీక్షలూ..

స్లీప్‌ అప్నియాగా అనుమానిస్తే ముక్కు, గొంతు ఎలా ఉన్నాయనేది చూడటం ముఖ్యం. ముక్కు, గొంతులోని సమస్యలను సరిచేయకపోతే గురక తగ్గటం కష్టం. ఇందులో ఈఎన్‌టీ సర్జన్‌ పాత్ర కీలకం. సమస్యలను గుర్తించటానికి కొన్ని పరీక్షలు ఉపయోగపడతాయి.

  • నేసల్‌ ఎండోస్కోపిక్‌ పరీక్ష: ఇందులో ముక్కు దూలం, టర్బినేట్స్‌ ఎలా ఉన్నాయి? నేసల్‌ పాలిప్స్‌ వంటివేవైనా పెరిగియా అనేది తెలుస్తాయి.
  • ముల్లర్స్‌ మెనూవర్‌: ఇది ఫ్లెక్సిబుల్‌ నాసో ఫెరింగో లారింగో స్కోప్‌ పరీక్ష. కెమెరాతో కూడిన దీన్ని ముక్కు ద్వారా పంపించి, లోపల ఎలా ఉందో చూస్తారు. నోరు, ముక్కు మూసుకొని శ్వాస తీసుకుంటున్నప్పుడు ఎక్కడ అడ్డంకి తలెత్తుతుందనేది ఇందులో కచ్చితంగా తెలుస్తుంది.
  • స్లీప్‌ నాసో ఎండోస్కోపీ: సూది ద్వారా నిద్రమందు ఇచ్చి, నిద్రపోయాక ముక్కులో ఫ్లెక్సిబుల్‌ లారింగో స్కోప్‌తో పరీక్ష చేస్తే ఎక్కడ అడ్డంకి తలెత్తుతుందో బయటపడుతుంది.
  • ముక్కు సైనస్‌ గదుల్లో మార్పులను తెలుసుకోవటానికి సీటీస్కాన్‌ అవసరమవ్వచ్చు.
  • థైరాయిడ్‌, గుండె సమస్యలను తెలుసుకోవటానికి థైరాయిడ్‌ హార్మోన్‌, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు ఉపయోగపడతాయి.

ముంచుకొచ్చే సమస్యలు

అప్నియాతో తరచూ శ్వాస ఆగటం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంది. ఇది శరీరం మీదే కాదు, మనసు మీదా తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండెలయ అస్తవ్యస్తం కావచ్చు (అరిత్మియా). శ్వాస ఆగినప్పుడు రక్తపోటు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అడ్రినలిన్‌ హార్మోన్‌ మోతాదులు పెరిగి రక్తపోటు పెరిగేలా చేయొచ్చు. అప్నియా బాధితుల్లో 95శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. అధిక రక్తపోటుకు 2, 3 మందులు వేసుకుంటున్నా అదుపులోకి రాకపోతుంటే నిద్రలో శ్వాస ఆగిపోతోందేమో పరీక్షించుకోవటం మంచిది. కొందరికి ఊపిరితిత్తులోని రక్తనాళాల్లోనూ రక్తపోటు పెరగొచ్చు. దీంతో క్రమంగా గుండె కుడివైపు భాగం విఫలమయ్యే ప్రమాదముంది. గుండెలయ దెబ్బతినటం వల్ల హఠాత్తుగా నిద్రలోనే మరణించే ప్రమాదమూ ఉంటుంది.

చికిత్స- సీప్యాప్‌తో మేలు

అప్నియా చికిత్స విషయంలో వ్యక్తులను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యం బరువు తగ్గటం. బరువు తగ్గితే చాలావరకు గురక తగ్గే అవకాశముంది. థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం ఉంటే మాత్రలు సూచిస్తారు.

  • నేసల్‌ సీప్యాప్‌ (కంటిన్యుయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెజర్‌): గురక మధ్యస్థంగా, తీవ్రంగా గలవారికిది ఉపయోగపడుతుంది. ఇది మాస్కుతో కూడిన పరికరం. దీన్ని ముఖానికి పెట్టుకొని పడుకోవాల్సి ఉంటుంది. ఇది ముక్కులోకి ఒకింత పీడనంతో గాలిని నెట్టి, శ్వాసమార్గం తెరచుకొని ఉండేలా చేస్తుంది. పడుకున్నప్పుడు అసౌకర్యంగా ఉంటుందని చాలామంది దీన్ని వాడుకోవటానికి వెనకాడుతుంటారు. కానీ దీంతో గురక నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. సీప్యాప్‌తో ఫలితం కనిపించకపోతే బైప్యాప్‌ అవసరమవుతుంది. అప్నియాతో పాటు సీవోపీడీ వంటి ఇతరత్రా శ్వాసకోశ సమస్యలు గలవారికి బైప్యాప్‌ను సూచిస్తారు.
  • గడ్డం చిన్నగా ఉన్నవారికి మాండిబ్యులార్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్ప్లింట్స్‌ ఉపయోగపడతాయి. పళ్లకు అమర్చే ఇవి కింది దవడను ముందుకు లాగుతాయి. దీంతో పడుకున్నప్పుడు నాలుక వెనకకు జారిపోదు. గురక తగ్గుతుంది.

అవసరమైతే సర్జరీ

శ్వాసకు ఇబ్బంది కలిగించే సమస్యలకు కొన్నిసార్లు సర్జరీ అవసరమవుతుంది. గొంతులో టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ పెద్దగా ఉంటే తొలగించాల్సి ఉంటుంది. ముక్కులో పాలిప్స్‌ వంటివి ఉంటే ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీతో తొలగిస్తారు. ముక్కుదూలం వంకరగా ఉంటే సరిచేస్తారు. టర్బినేట్లు ఉబ్బితే సైజు తగ్గిస్తారు. అంగిలి, కొండనాలుక సాగితే బిగుతుగా చేయాల్సి ఉంటుంది. అవసరమైతే లేజర్‌, కోబ్లేషన్‌, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతులతో కొండనాలుక, అంగిలిలో సాగిపోయిన అదనపు భాగాన్ని కత్తిరించి, తొలగిస్తారు. నాలుక పెద్దగా ఉన్నవారికి మధ్యలో కొంత భాగాన్ని లేజర్‌తో కత్తిరించి, తొలగిస్తారు. నాలుక వెనకభాగం ఎత్తుగా ఉంటే సైజు తగ్గిస్తారు.

  • ఇవేవీ పనిచేయకపోతే ట్రకియాస్టమీ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాణాలను కాపాడే చికిత్స. ఇందులో స్వరపేటిక కింద శ్వాసనాళంలోకి రంద్రం చేసి గొట్టాన్ని బిగిస్తారు. దీంతో మెడ వద్ద నుంచే లోపలికి గాలి వెళ్తుంది.
  • ఊబకాయం మరీ ఎక్కువగా గలవారికి బరువు తగ్గించే బేరియాట్రిక్‌ సర్జరీ అవసరమవుతుంది.

ఎప్పుడు ప్రమాదకరం?

ఏకాగ్రత తగ్గటం, వాహనాలు నడపటంలో ఇబ్బంది, వాహనాలు నడుపుతున్నప్పుడు నిద్రలోకి జారుకుంటుంటే అప్నియా సమస్య తీవ్రమైందనే అర్థం. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా సమావేశంలో పాల్గొంటున్నప్పుడు, నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు నిద్ర మత్తు ముంచుకురావటం.. తెల్లారి లేచాక హుషారుగా అనిపించకపోవటం వంటివి గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ముప్పు కారకాలు

నిద్రలో శ్వాస ఆగిపోవటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. వీటిల్లో ప్రధానమైంది ఊబకాయం. సన్నవారికి అప్నియా రాకూడదనేమీ లేదు గానీ దీని బారినపడుతున్నవారిలో నూటికి 90 మంది అధిక బరువు, ఊబకాయం గలవారే. ఊబకాయుల్లో మెడ చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీంతో శ్వాసమార్గం సంకోచిస్తుంది. ఫలితంగా తేలికగా గురక, అప్నియా తలెత్తుతాయి.

  • హైపోథైరాయిడిజమ్‌: థైరాయిడ్‌ హార్మోన్‌ తగ్గితే నిద్ర ఎక్కువగా వస్తుంది. బరువు కూడా పెరుగుతుంది. ఇది పరోక్షంగా అప్నియాకు కారణమవుతుంది.
  • మద్యం, పొగ అలవాట్లు: మద్యంతో ముక్కు లోపల పొరలు ఉబ్బుతాయి. దీంతో గాలి సరిగా ఆడక నోరు తెరచి శ్వాస తీసుకుంటుంటారు. పొగ అలవాటుతోనూ శ్వాసమార్గంలో గాలి ప్రవాహం తగ్గుతుంది.
  • నిద్రమాత్రలు: దీర్ఘకాలం నిద్రమాత్రలు, సిట్రిజిన్‌ వంటి యాంటీహిస్టమిన్లు, యాంటీ డిప్రెసెంట్లు వాడుకోవటమూ గురకకు దారితీస్తాయి.
  • గడ్డం చిన్నగా ఉండటం (రిట్రోగ్నాథియా): కొందరికి ముఖంలో గడ్డం ఉండే భాగం చిన్నగా ఉంటుంది. దీంతో నాలుక పైకి వెళ్లి, అంగిలికి తగులుతుంది. నిద్రించే సమయంలో నాలుక వెనకాలకు జారి పడి, గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుపడుతుంది.

నివారించుకోవచ్చా?

గురక, అప్నియాను నివారించుకునే మార్గం లేకపోలేదు. బరువు అదుపులో ఉంచుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం ద్వారా గురక బారినపడకుండా చూసుకోవచ్చు. మద్యం జోలికి వెళ్లకూడదు. పొగ అలవాటుంటే మానెయ్యాలి. అనవసరంగా నిద్రమాత్రలు వాడుకోవద్దు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. జంక్‌ఫుడ్‌ తినకూడదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.