Snake Bite First Aid Treatment in Telugu : పాములంటే చాలామందికి చచ్చేంత భయం. ఇకకొందరైతే వాటి గురించి మాట్లాడుతున్నా వణికిపోతారు. అలాంటిది ఇక ఎదురుగా కనిపిస్తే.. అల్లంత దూరం పరిగెత్తుతారు!. మరి అది కాటు వేస్తే..? ఏం చేయాలో తెలియక ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. అయితే ఈ పాము కాటుకు గ్రామాల్లో నివసించే ప్రజలు ఎక్కువ గురవుతుంటారు. అక్కడి ప్రజలు ఎక్కువగా కొండల్లో, గుట్టల్లో, పొల్లాల్లో ఎక్కువగా తిరుగుతుంటారు. అయితే పాము కరిచినప్పుడు.. భయపడకుండా.. వైద్యులు చెప్పిన ఈ సూచనలు పాటిస్తే.. చాలా వరకు ప్రాణాపాయం నుంచి భయటపడవచ్చు. ఆ సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Snake Bite First Aid Tips : పాము కాటు మరణాలు అనేవి.. అనుకునేంత, కనిపించేంత చిన్న సమస్య కాదు. వేల మంది ప్రాణాలు విడుస్తుంటే.. లక్షల మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. పాముల నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
- పంట పొలాలు, ఆరుబయట ఎక్కడైనా పాము కరిచినప్పుడు ఎవరమైనా షాక్‌కు గురవుతాం. ఎందుకంటే వెంటనే ఏం చేయాలో తెలియక.. కంగారుతో సమయం వృథా చేస్తుంటాం. ఈ క్రమంలో శరీరమంతా విషప్రభావానికి గురవుతుంది. దీంతో చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే కాటేసింది విషసర్పం కాకపోయినా ధైర్యం కోల్పోవడంతో ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి ఎవరైనా పాముకాటుకు గురైనప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన మొదటి అంశం.
- ముఖ్యంగా పాము కాటు వేసిన భాగం పైన గుడ్డతోగానీ, తాడుతోగానీ గట్టిగా కట్టాలి. అలాగే 15 నిమిషాలకోసారి వదులు చేసి మళ్లీ కట్టాలి.
- ఆ తర్వాత పాము కాటు వేసిన శరీర భాగాన్ని సబ్బునీరు లేదా యాంటీసెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేయాలి. అలాగే సాధ్యమైనంత వరకు ఆ భాగాన్ని కదలించకూడదు. ముఖ్యంగా ఆ సమయంలో నడవటం, పరిగెత్తడం వంటివి చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే త్వరగా విషం శరీర భాగాలలోకి వ్యాపించి.. ప్రాణాల మీదికి రావచ్చు.
- ఇక చాలా మంది కాటు వేసిన భాగం నుంచి నోటితో రక్తం పీల్చుతారు. అలా చేయకూడదనే విషయం గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఆ ప్రాంతంలో కణజాలాన్ని కత్తితో కత్తిరించడం సరికాదు.
- నొప్పి తగ్గేందుకు ఎలాంటి మందులు వాడొద్దు. పాము కాటు వేసిన చోట కొద్దిసేపు ఐస్‌ముక్క ఉంచడం మంచిది.
- సాధ్యమయినంత తొందరగా బాధితుడిని వైద్యుని వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అప్పుడు వైద్యుడు పాము కరిచిన గుర్తులను ఆధారంగా చేసుకొని అది విష సర్పమా..? కాదా నిర్ధారణ చేసి.. తగిన చికిత్స అందిస్తారు.
- ఇక చివరగా మంత్రాలు, నాటు మందులు వంటివాటిని నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దనే విషయం గుర్తుంచుకోవాలి.
ఆన్లైన్ స్నేక్ క్యాచర్స్.. ఫొటో తీసి పంపిస్తే పాముల్ని పట్టుకెళ్తారు!
ప్రాణాల మీదకు తెచ్చిన శాంతి పూజ.. నాలుకపై కాటేసిన పాము.. కోసేసిన పూజారి!