Tips for Glowing Skin Male: అబ్బాయిల్లో చాలామందికి మెన్స్ పార్లర్లకు వెళ్లి ఫేస్ మాస్కులు గట్రా అప్లై చేసుకునేంత టైం ఉండదు. కొందరికి అసలు వారి ముఖంపై పట్టింపే ఉండదు. అందుకే, కాంతిహీనంగా మారినా సబ్బుతో ముఖం కడుక్కొని వాడిన మొహాలతోనే పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లిపోతారు. కానీ, శరీర చర్మంతో పోలిస్తే.. మీ ముఖం చర్మం సున్నితంగా ఉంటుంది.
అందుకే శరీరానికి పెట్టుకునే సబ్బులు, రసాయనాలు నిండిన క్రీంలు.. ముఖానికి రాసుకుంటే చర్మం కఠినంగా మారే అవకాశం ఉందంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు తరుణా యాదవ్. ముఖం అందంగా కనిపించడానికి పదేపదే షేవింగ్ చేస్తే.. ఆ రాపిడికి చర్మం పొడిబారిపోతుందంటున్నారు. పట్టించుకోకపోతే ముఖం కళావిహీనంగా మారుతుందంటున్నారు. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టి... మగాళ్ల ముఖాన్ని సౌందర్యవంతంగా చేసే ఆయుర్వేద ఫేస్ మాస్క్.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెబుతున్నారు.
అందరి చర్మం ఒకే రకంగా ఉండదు. అందుకే, అన్ని రకాల చర్మానికి సరిపోయేలా మూడు వేర్వేరు ఫేస్ మాస్క్ చిట్కాలు మీ కోసం అందిస్తున్నాం. మరి వీటిలో మీ ముఖానికి సరిపోయేది ఏదో తెలుసుకుని.. హీరోలా మారిపోండి.
ఆయిలీ చర్మం కోసం...
- ఇకపై ముఖం జిడ్డుగా ఉంటే.. బాధపడనక్కర్లేదు..
- ఓ బౌల్ తీసుకుని మూడు చెంచాల శనగపిండి, రెండు చెంచాల ధనియాల పొడి, అరపావు దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోండి..
- ఇప్పుడు మరో బౌల్లో ఓ ఇలాచీ, ఒక తులసి లేదా కరివేపాకు తెంపుకుని వేసుకుని గోరువెచ్చని నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి. ఇదే చక్కటి హెర్బల్ వాటర్‌గా తయారవుతుంది.
- ఇక ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో.. హెర్బల్ వాటర్ పోస్తూ చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని, కాసేపయ్యాక నీటితో మర్దనా చేస్తూ కడిగేయాలి. అంతే, క్షణాల్లో మీ ముఖంలో తేడా గమనిస్తారు.
ముఖం పొడిగా, జిడ్డుగా ఉంటే..
- కొందరికి ముఖం కాసేపు జిడ్డుగానూ, కాసేపు పొడిగానూ ఉంటుంది. వాతావరణాన్ని బట్టి వారి ముఖం మారిపోతుంది. మరి అలాంటి వారు చింతించే పనే లేదు..
- ఓ గిన్నెలో రెండు చుక్కల నిమ్మరసం, అరపావు చెంచా పసుపు, అరపావు జాజికాయ పొడి వేసుకుని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు మరో గిన్నెలో.. గోరు వెచ్చని నీటిలో ఓ ఇలాచీ, పావు స్పూన్ సోంపు గింజలు వేసుకుని పైన చెప్పిన పద్ధతిలో హెర్బల్ వాటర్ తయారు చేసుకోండి.
- ఈ హెర్బల్ వాటర్‌ను ముందుగా సిద్ధం చేసుకున్న జాజికాయ పొడిలో పోసుకుని.. పేస్టు తయారు చేసుకుని ముఖానికి పూసుకోండి. ఆపై మర్దనా చేస్తూ.. నీటితో కడిగేసుకోండి.
పొడిబారిన చర్మానికి...
- మూడు చెంచాల బియ్యం పిండి, ఒక స్పూను ఖీరా తురుము, అరస్పూను బాదం పొడి కలుపుకోవాలి.
- మరో బౌల్లో రెండు రెబ్బల కుంకుమ పువ్వు, రెండు మూడు రోజా రెబ్బలు అరకప్పు గోరువెచ్చని పాలల్లో నానబెట్టుకోవాలి.
- ఆ పాలను బియ్యంపిండి మిశ్రమంలో పోసుకుని ఫేస్ మాస్క్ తయారు చేసుకోవాలి. అంతే... నిగనిగలాడే చర్మం మీ సొంతం.
ఇదీ చూడండి: ఆ క్రీమ్‌లు వాడుతున్నారా? బయటకు వెళ్తే కష్టమే!