contraception methods: ప్రస్తుతం పలు రకాల గర్భనిరోధక సాధనాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్తోపాటు, మాత్రలు, ఐయూడీ, ఇంజక్షన్లు, స్కిన్ప్యాచ్ వంటి పద్ధతులు.. పురుషులకు వ్యాసక్టమీ ఆపరేషన్ లాంటివి ఉన్నాయి. మహిళలు తమకు తగిన పద్ధతిని ఎంపిక చేసుకోవడం మేలు. గర్భనిరోధక సాధనాలు వాడాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వాటి వల్ల ఏవైనా దుష్పరిణామాలు ఉంటాయా అనేది తెలుసుకోవాలి. అప్పుడే సమస్యలు రాకుండా నివారించడమో లేదా సమస్యలున్నా వెంటనే స్పందించి తగ్గించుకునే అవకాశముంటుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
- సాధారణంగా గర్భనిరోధక సాధనాలు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది మాత్రలే. అయితే వీటిని వాడే మహిళల్లో తలనొప్పి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లు కలిగిన మాత్రలు లేదా ప్రొజెస్ట్రాన్ మాత్రమే ఉండే చిన్నపాటి మాత్రలు వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అలాగే హార్మోన్లతో కూడిన ఇతర పద్ధతులు ఐయూడీలు, ఇంజెక్షన్లు వంటి వాటి వల్ల కూడా తలనొప్పులు వస్తుంటాయి.
- హార్మోన్ల మార్పుల వల్ల కొంతమందిలో వికారం ఉంటుంది. గర్భనిరోధకాలుగా పని చేసే హార్మోన్ల వల్ల వచ్చే మార్పులు శరీరం అంతటా ఉంటాయి. రెండు హార్మోన్లతో కూడిన పిల్ ప్రొజెస్ట్రాన్ మాత్రమే ఉన్న మినీ పిల్.. వెజైనల్ రింగ్ వంటి హార్మోన్లతో కూడిన పద్ధతుల వల్ల రొమ్ములు అత్యంత సున్నితంగా మారి ఇబ్బంది పెడుతుంటాయి.
- గర్భనిరోధానికి నోటి ద్వారా తీసుకునే మాత్రలు వల్ల రుతుస్రావంలో మార్పులు కనపడే అవకాశముంటుంది. రక్తస్రావం ఎక్కువ కావడం నెలసరి రాకముందే మధ్య బ్లీడింగ్ కావడం వంటి సమస్యలు ఉండవచ్చు. అప్పుడప్పుడు లేదా కొన్ని నెలలపాటు నెలసరి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది.
- గర్భనిరోధకం కోసం గర్భసంచిలో అమర్చే ఐయూడీలను వాడే కొంతమంది మహిళల్లో కొన్ని రకాల ఇబ్బందులు కనిపించవచ్చు. వీటిని శరీరంలో అమర్చిన కొంతకాలం పాటు తిమ్మిర్లు, నడుము నొప్పి ఉండవచ్చు.
- వెజైనల్ రింగ్ అనే గర్భనిరోధక సాధనం వాడుతున్నవారిలో అండం విడుదల కాకుండా ఆపుతుంది. అలాగే అండంలోకి సెర్మ్ వెళ్లకుండా నివారించడానికి తోడ్పతుంది. ఇందుకోసం గర్భశయంలో శ్లేష్మాన్ని చిక్కగా మారుస్తాయి. దీని వల్ల ఇది స్రవించినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది. వెజైనల్ రింగ్ వాడటం వల్ల మానసిక స్థితిలో మార్పులు వచ్చే అవకాశముంది.
- గర్భాన్ని నిరోధించేందుకు తీసుకునే ఇంజెక్షన్ల వల్ల శరీరంలో బరువు పెరిగే అవకాశముందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంజెక్షన్లు శరీరంలో కొవ్వును పెంచుతాయని అధ్యయనాల్లో తేలింది.
- గర్భశయంలో అమర్చే క్యాప్ వంటివి కూడా అసౌకర్యాన్ని కలిగించవచ్చు.
- ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్న మాత్రలు కొంతమందిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. మధుమేహం, రొమ్ముక్యాన్సర్, రక్తం గడ్డకట్టే రుగ్మతలు, అధిక రక్తపోటు, గుండె, రక్తనాళలు, లివర్లో రుగ్మతలు ఉండేవారిలో ఈ మాత్రల వల్ల చెడు ప్రభావం ఎక్కువగా ఉండే సమస్య ఉంది.
ప్రయోజనాలు
- హార్మోలతో కూడిన గర్భనిరోధక సాధనాలు వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొలెరెక్టల్, అండాశయ క్యాన్సర్లతోపాటు కొన్ని రకాల క్యాన్సర్లను ఇవి నివారిస్తాయి. నెలసరిలో నొప్పి, అధిక రక్తస్రావం తగ్గే అవకాశముంది. ఎముకులు సన్నపడకుండా రక్షిస్తాయి. రక్తలేమిని నివారిస్తాయి. మొటిమలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
ఇదీ చూడండి: ఈ చిట్కాలు పాటిస్తే.. కొవిడ్ సోకినా ఏం కాదు..