యోగా అంటే కేవలం బరువు తగ్గడానికో, కొవ్వు కరిగించుకోవడానికో చేసే ఆసనాలే కాదు. దానితో చాలా లాభాలు ఉన్నాయి. మనిషి శారీరక దృఢత్వాన్నీ, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది సాయపడుతుంది. అందుకే దీన్ని అనుసరించేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు నుంచి ఉపశమనం, శారీరక ఎదుగుదల, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
యోగాలో ఎన్నో ఆసనాలు, భంగిమలు ఉన్నా.. ఎక్కువమంది ఇష్టపడేది 'శవాసనం'. ఎందుకంటే ఎలాంటి కష్టం లేకుండా హాయిగా రిలాక్స్ కావచ్చు కదా..! మరి యోగా సెషన్ మొత్తం రిలాక్స్ కావడమే అయితే...? సాధారణ విశ్రాంతి భంగిమలకే కొంత యోగా ట్విస్ట్ ఇచ్చి అద్భుతమైన ఫలితాలను సాధించగలిగితే...? అలా వచ్చిందే 'రెస్టోరేటివ్ యోగా'. ఈ మధ్యే పాపులర్ అవుతున్న ఈ ప్రత్యేకమైన యోగా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ఎక్కడిదీ యోగా..?
1950ల్లో మన యోగ శాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు ప్రచారం చేసిన బి.కె.ఎస్.అయ్యంగార్ ఈ రెస్టోరేటివ్ యోగాను కనిపెట్టారు. ఆయన శిష్యులలో మొదటితరం వారైన జుడిత్ హాన్సన్ లాసేటర్ ఈ రెస్టొరేటివ్ యోగాను ప్రచారంలోకి తీసుకువచ్చారు. 1955లో ఆమె రాసిన 'రిలాక్స్ అండ్ రెన్యూ: రెస్ట్‌ఫుల్ యోగా ఫర్ స్ట్రెస్ఫుల్ టైమ్స్' అనే పుస్తకం ఇందుకు ఎంతగానో తోడ్పడింది. తర్వాత ఆమె రెస్టొరేటివ్ యోగాలో స్పెషల్ టీచర్ సర్టిఫికేషన్ కూడా ప్రవేశపెట్టారు.
రెస్టొరేటివ్ యోగా అంటే..?
మన శరీర తత్వాన్ని బట్టి, ఫ్లెక్సిబిలిటీని బట్టి రకరకాల యోగాసనాలను సాధన చేస్తాం. మనం ఆశించిన ఫలితాలను పొందడానికి, శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తుంటాం. అలాగే మానసిక ప్రశాంతత కోసం, ఏకాగ్రత కోసం ధ్యానాన్ని సాధన చేస్తాం. ఈ రెండిటి ప్రయోజనాలనూ ఏకకాలంలో అందించగలగడం రెస్టొరేటివ్ యోగా ప్రత్యేకత.
యోగా చేసేటప్పుడు ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండడం వల్ల శరీరానికి ఆ భంగిమను నెమ్మదిగా అలవాటు చేస్తూ అందులోని పూర్తి లాభాలను పొందడమే రెస్టొరేటివ్ యోగా ఫార్ములా. శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తూనే అధిక బరువును తగ్గించడం రెస్టొరేటివ్ యోగా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం. ఇందులో బాలాసనం చాలా ముఖ్యమైనది.
బాలాసనం...
తుంటి, తొడ, మోకాళ్లు, చీలమండల దగ్గర ఉండే కండరాలను బలపరిచి రక్త ప్రసరణను పెంచడానికి బాలాసనం ఎంతో ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. అంతేకాకుండా బాలాసనం సాధన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుకల కుదుళ్లు బలంగా తయారవుతాయి.
వీటిని సిద్ధం చేసుకోవాలి..
- ఒక దుప్పటి లేదా యోగా మ్యాట్.
- 12 అంగుళాల వెడల్పు ఉండి, మీ నడుము భాగం నుంచి తల వరకు ఆనించడానికి సరిపడేంత పొడవుతో ఐదు దుప్పట్లను లేదా రెండు దిండ్లను పేర్చుకోవాలి. మోకాళ్లపై నిలబడినప్పుడు ఇవి నేలపైనుంచి మీ నడుము ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
- ఇలా కుదరని పక్షంలో రెండు ఇటుకలను పేర్చుకొని, వాటి మీదుగా ఒక మెత్తని ఎత్తయిన దిండును ఏటవాలుగా అమర్చుకోవాలి.
బాలాసనం ఎలా వేయాలి..?
- ముందుగా దుప్పటి లేదా యోగా మ్యాట్‌ను పరుచుకోవాలి.
- మోకాళ్లపై కూర్చుని, ముందే తయారు చేసి పెట్టుకున్న ఎత్తును ఎదురుగా అమర్చుకోవాలి.
- ఇప్పుడు ఆ ఎత్తయిన దిండుపై తల, ఛాతీ భాగం, పొట్ట ఆనించాలి. రెండు చేతులను ఇటుకలకు, దిండుకు మధ్యలో ఉంచుతూ దిండును హత్తుకోవాలి.
- మోకాళ్ల మధ్య దిండు ఉండేలా సరిచూసుకోవాలి.
- కటి భాగం మడమలను తాకేలా కిందకు ఆనించాలి.
- కనీసం 10 నిమిషాలు ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల దీని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.
ఉపయోగాలు..
- కఠినమైన ఆసనాలతో పనిలేదు కాబట్టి ఏ వయసులో ఉన్న వారైనా రెస్టొరేటివ్ యోగాను సాధన చేయవచ్చు.
- అనేక రకాల మానసిక ఒత్తిళ్ల నుంచి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందవచ్చు.
- డయాబెటిస్, హై బి.పి. వంటి దీర్ఘకాలిక సమస్యలు అదుపులో ఉంటాయి.
- రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.
- ఇన్సోమ్నియా(నిద్ర లేమి) సమస్యను రెస్టొరేటివ్ యోగా నయం చేస్తుంది.
- శరీరం ఫ్లెక్సిబుల్‌గా తయారవుతుంది.
- ఈ యోగా వల్ల ఎటువంటి శారీరక ఒత్తిడి లేకుండా రక్త ప్రసరణ, శ్వాస ప్రక్రియ మెరుగుపడతాయి.
- ఏకాగ్రతను పెంచడమే కాకుండా కోపాన్ని అదుపులో ఉంచి ఆలోచనా శక్తిని పెంచుతుందీ యోగసాధన.
- ఒత్తిడి వల్ల శరీరంలోని వివిధ భాగాలలో వచ్చే నొప్పులను, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
- రెస్టొరేటివ్ యోగా వల్ల శరీరంలో పేరుకున్న మలినాలు, అధిక కొవ్వు నిల్వలు తొలగిపోతాయి.
- కేవలం 5 నుంచి 20 నిమిషాల రెస్టొరేటివ్ యోగా సెషన్ మీ బిజీ లైఫ్‌కు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది.
రెస్టొరేటివ్ యోగాను ప్రారంభించాలన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా మొదటగా నిపుణుల పర్యవేక్షణ మాత్రం తప్పని సరి. జాగ్రత్తలు పాటిస్తూ..మీరూ ప్రయత్నించేయండి మరి.