Poppy Seeds Health Benefits : గసగసాలు.. దాదాపుగా మన దేశంలోని ప్రతి వంటింట్లో ఉండే దినుసు. ఇవి తినడానికి వగరుగా ఉంటూ ఒక రకమైన సువాసన ఇస్తాయి. చూడటానికి తెల్ల ఆవాలులాగా ఉంటాయీ విత్తనాలు. వాడేది కొన్ని పదార్థాల్లోనే అయినా.. వీటిని తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె సంబంధ వ్యాధుల దగ్గర్నుంచి జుట్టు, చర్మం, నిద్రలేమి, డయాబెటిస్, ఎముక, నాడీ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో గసగసాలు ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది.
Gasagasalu Benefits In Telugu : ఒళ్లు నొప్పులు, నోటి అల్సర్లు, నిద్రలేమి, బీపీ తదితర సమస్యల నుంచి బయట పడటం దగ్గర్నుంచి.. లైంగిక కోరికలను పెంచడం వరకు అన్నింటిలో గసగసాలు ఉపయోగపడతాయి. గసగసాల్లో అధికంగా ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా గసగసాల వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్లు, కాల్షియం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయి. మాంగనీస్ ఎముకలు ఆరోగ్యంగా ఉండటం సహా రక్తం గడ్డకట్టడాన్ని అరికడుతుంది. చాలా తక్కువ వాటిల్లో దొరికే ఒమేగా-3, ఒమేగా-6 ఫాటీ ఆమ్లాలు గసగసాల్లో ఉన్నాయి. గసగసాల వల్ల ఒనగూరే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలివే.
నొప్పుల నుంచి ఉపశమనం..
గసగసాల్లో మార్ఫిన్, కోడైన్, థెబైన్ వంటి ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సాయపడతాయి. అంతేకాకుండా మంచి నిద్రను కలిగేలా ప్రేరేపించే లక్షణాల్ని కలిగి ఉంటాయి.
గుండె ఆరోగ్యానికి మేలు
గసగసాలతో తయారు చేసిన నూనెలో మోనో, పాలీ సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అన్ సాచురేటెడ్ కొవ్వు పదార్థాల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 17 శాతం తగ్గుతాయి. మీరు తీసుకునే ఆహారంలో .. సాచురేటెడ్ కొవ్వు పదార్థాల బదులు, అన్ సాచురేటెడ్ పదార్థాలు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచించారు.
గాయాలు మానేందుకు..
గాయాలను వేగంగా మాన్పడంలో గసగసాలతో తయారు చేసిన నూనె తోడ్పడుతుంది. అంతేకాకుండా చర్మం పొలుసులుగా మారకుండా, పొడిబారకుండా సాయం చేస్తుంది.
అజీర్తి సమస్యలు దూరం..
గసగసాల్లో అధికంగా ఉండే పీచు పదార్థం.. ఆహారం సులభంగా జీర్ణం అవడానికి తోడ్పడుతుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగు పరచి, మలబద్దకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.
సంతానోత్పత్తి పెంచడంలో కీలక పాత్ర
సంతానోత్పత్తిని పెంచడంలో గసగసాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో గసగసాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఇవి ఫాలోపియన్ ట్యూబుల్లో ఉన్న శ్లేష్మాన్ని తొలగించి తొందరగా గర్భం దాల్చడంలో సాయపడతాయి. అంతేకాకుండా లైంగిక కోరికలను పెంచుతాయి.
నిద్రలేమి, నోటి అల్సర్లకు చెక్
గసగసాలతో చేసిన టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చు. గసగసాలను వేడి చేసిన నీటిలో వేసి టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఇందులోని చల్లదనం లక్షణం వల్ల నోటి అల్సర్ల బాధ నుంచి కూడా బయట పడవచ్చు.