నల్గొండ జిల్లా పర్వతగిరికి చెందిన కదిర సైదులు. మూత్రపిండాల వైఫల్య బాధితుడు.వారంలో 3 సార్లు రక్తశుద్ధి (డయాలసిస్) చేయించుకోవాల్సి వస్తోంది. నెల రోజులుగా రక్తశుద్ధి సేవల్లో వినియోగించే పరికరాల సరఫరాలో క్రమం తప్పుతుండటంతో.. స్థోమత లేకపోయినా డయలైజర్కు రూ.1300, బ్లడ్ట్యూబ్లకు రూ.450 ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. ఎలాంటి ప్రయోజనం లేదని
మూత్రపిండాల వైఫల్య బాధితుల అవస్థలు తారస్థాయికి చేరుకున్నాయి. నెలరోజులుగా డయాలసిస్‌లో వినియోగించాల్సిన పరికరాలు అందుబాటులోకి రాక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రక్తశుద్ధి కేంద్రాల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు సంస్థ.. నిధుల లేమిని కారణంగా చూపుతూ కొన్ని పరికరాలను సమకూర్చలేకపోతోంది. దీంతో కొన్ని కేంద్రాల్లో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుండగా.. మరికొన్ని చోట్ల మరుసటి రోజుకు డయాలసిస్‌ను వాయిదా వేసుకోవాల్సిన స్థితి నెలకొంది.
రక్తశుద్ధి తప్పనిసరి
మూత్రపిండాల రోగుల్లో కొందరు వారానికి రెండుసార్లు.. మరికొందరు మూడు సార్లు కూడా డయాలసిస్ చేయించుకోవలసి ఉంటుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఈ తరహాలో రక్తశుద్ధి పొందుతున్న రోగులు సుమారు 10 వేలకు పైగానే ఉంటారని అంచనా. వీరి కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో 41 రక్తశుద్ధి కేంద్రాలను అమల్లోకి తెచ్చింది. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు కొన్నిచోట్ల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఒక్కోచోట 6-10 పడకలతో డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన రోగులు ఉచితంగా రక్తశుద్ధి చికిత్సను పొందుతున్నారు. ఇందులో వినియోగించే ప్లాస్టిక్ ట్యూబ్, డయలైజర్లను ప్రతిసారీ తప్పనిసరిగా మార్చాలన్న నిబంధనలను కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. నిధుల లేమితో నిర్వహణ సంస్థ వీటిని సకాలంలో పంపిణీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని చోట్ల రోగులే సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. నిధులు విడుదల కాకపోతే మున్ముందు రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ సమస్య...
* ఆరోగ్యశ్రీ పథకం సజావుగా సాగడానికి నెలకు రూ.100 కోట్లు ఇవ్వాలని ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని పక్కనబెట్టారు. దీంతో ఈ పథకం కింద సాధారణ వైద్యసేవలతో పాటు డయాలసిస్ సేవలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* రక్తశుద్ధి నిర్వహణ సంస్థకు ఇప్పటి వరకూ సుమారు రూ.43 కోట్ల వరకూ బకాయిలున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే గడువు ముగిసిన నిధులు సుమారు రూ. 13 కోట్లు ఉంటాయని అంచనా. కనీసం వీటిని విడుదల చేసినా సేవలు కొనసాగే అవకాశాలుంటాయి. గత 5 నెలలుగా డయాలసిస్ కేంద్రాల్లో సిబ్బందికి వేతనాలు కూడా అందడం లేదు.
రెండ్రోజులకు సరిపడే కిట్లు
2019 మార్చి నుంచి మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాసుపత్రుల్లో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు నిధుల లేమితో కేవలం రెండు రోజులకు సరిపడేన్ని కిట్లు మాత్రమే ఉన్నాయి. అందుబాటులో కిట్లు ఉన్నంతవరకూ రోగులకు సేవలనందిస్తాం. ఆ తర్వాత సంగతి తెలియదు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. -ఇస్మాయిల్, డయాలసిస్ ఇన్ఛార్జీ, మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి.
ఆరోగ్యశ్రీ నుంచి రావాల్సి ఉంది
డయాలసిస్ సేవలను నిర్వహించే సంస్థకు ఆరోగ్యశ్రీ నుంచి నిధులు రావాల్సిన మాట వాస్తవమే. సేవల నిలిపివేతపై సమాచారం లేదు. నిర్వహణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఉన్నతాధికారులకు వివరిస్తా. -డాక్టర్ జీవన్, అదనపు పర్యవేక్షకులు, జిల్లా ఆసుపత్రి మహబూబ్‌నగర్.
సొంతంగా కొనుగోలు చేయలేం
రెండేళ్ల నుంచి వారానికి 3 సార్లు చొప్పున డయాలసిస్ చికిత్స పొందుతున్నాను. మూత్రపిండాల వైఫల్య కారణంగా ఇంటర్‌తో చదువును ఆపేయాల్సి వచ్చింది. రాకపోకలకే ఖర్చు భరించలేకపోతున్నా. ఇక సొంతంగా కొనుగోలు చేసుకోవాలంటే మా వల్ల కాదు. -స్రవంతి, లక్ష్మీపూర్, జైనథ్ మండలం.
నారాయణపేట జిల్లా కొల్లంపల్లి వాసి చిన్నరాములు. ఏడాదిన్నర నుంచి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న డయాలసిస్ సేవలను పొందుతున్నారు. రక్తాన్ని శుద్ధి చేసుకోవడానికి వారానికి మూడుసార్లు జిల్లా ఆసుపత్రికి వస్తున్నారు. అయితే వచ్చే వారం నుంచి డయాలసిస్ సేవలు నిలిపివేస్తామని చెబుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
క్రమం తప్పితే ఇబ్బందే
మూత్రపిండాలు పనిచేయని పరిస్థితుల్లో.. రక్తశుద్ధి చేయకపోతే.. శరీరంలో యాసిడ్లు పెరుగుతాయి. రక్తపోటు ఎక్కువవుతుంది. నీరు నిల్వ అవుతుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఒక్క వారం క్రమం తప్పినా.. ఆరోగ్యం అతలాకుతలమవుతుంది. -ఆచార్య డాక్టర్ దక్షిణామూర్తి, సీనియర్ నెఫ్రాలజిస్ట్.
ఇదీ చూడండి: కేంద్రం కరుణిస్తేనే రూ.5,386 కోట్లు