ఎలాంటి ఆహార పదార్థాలు?
ప్రొటీన్లు అధికంగా ఉండే వేరుశెనగ, కోడిగుడ్లు, చేపలు, సోయా, గోధుమ.. వంటి వాటితో పాటు కొన్ని రకాల పండ్లు, కూరగాయలు కూడా కొందరిలో ఫుడ్ అలర్జీని కలగజేస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు పడని వారు వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండడమే మంచిది.
లక్షణాలివే!
ఫుడ్ అలర్జీకి కారణమయ్యే ఆహార పదార్థాల్ని మనం తిన్నప్పుడు అవి మన శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అదెలాగంటే..
- చర్మంపై దద్దుర్లు ఏర్పడటం, దురద పెట్టడం
- దంతాల చిగుళ్లు, గొంతు, పెదాలు.. వంటి భాగాల్లో దురద పెట్టడం
- ముక్కు కారడం
- వాంతులవడం
- తలనొప్పి
- గొంతు వాపు
- కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు.. మొదలైనవి.
నివారణోపాయాలు..
- అటు ఆరోగ్యపరంగా అయినా, ఇటు ఫిట్‌నెస్ పరంగానైనా గ్రీన్ టీది ప్రత్యేక స్థానం అని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని ఫుడ్ అలర్జీని తగ్గించే ఔషధంగానూ ఉపయోగిస్తుంటారు. ఇది అలర్జీని క్రమంగా తగ్గించి, దానివల్ల కలిగే ఇతర ఇబ్బందుల్ని సైతం దూరం చేస్తుంది. దీనికోసం రోజూ గ్రీన్ టీ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
ఫుడ్ అలర్జీని తగ్గించే గుణాలు అల్లంలోనూ ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఫుడ్ అలర్జీని క్రమంగా తగ్గించడంలో బాగా దోహదపడతాయి. ఇందుకోసం రోజుకు రెండుమూడు సార్లు కప్పు చొప్పున అల్లం టీ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.- యాంటీ అలర్జిక్ గుణాలుండే ఆహార పదార్థాలు కూడా అలర్జీని తగ్గించి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. ముఖ్యంగా 'ఇ' విటమిన్ పుష్కలంగా ఉండే బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవకాడో, పాలకూర, ఆలివ్ నూనె.. వంటివన్నీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
ఫుడ్ అలర్జీకి వ్యతిరేకంగా పోరాడే గుణాలు నిమ్మకాయలోనూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్ 'సి' అలర్జీని తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహకరిస్తుంది. కాబట్టి రోజూ ఉదయం లేవగానే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని తాగితే అటు ఆరోగ్యంతో పాటు ఇటు అలర్జీని కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే 'సి' విటమిన్ పుష్కలంగా లభించే కమలాఫలం, ఇతర పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
- యాపిల్ సైడర్ వెనిగర్‌లోని ఆల్కలీన్ శరీరంలో అలర్జీకి కారణమయ్యే హానికారక ఫ్రీరాడికల్స్‌ని తొలగించి, ఫుడ్ అలర్జీ తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. గ్లాసు నిమ్మరసంలో తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కొద్ది మోతాదులో వేసి, బాగా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది.
- ఫుడ్ అలర్జీని దూరం చేయడంలో క్యారట్, కీరాదోసలతో తయారుచేసిన జ్యూస్ కూడా బాగా దోహదం చేస్తుంది. వీటిలోని యాంటీ అలర్జిక్ గుణాలే ఇందుకు కారణం. కాబట్టి ఈ మిశ్రమాన్ని కూడా రోజూ తీసుకోవడం వల్ల త్వరగా, సులభంగా ఫుడ్ అలర్జీ నుంచి ఉపశమనం పొందచ్చు.