నిద్ర సరిగా పట్టకపోతే తెల్లారాక చికాకుగా అనిపిస్తుంది కదా. దీనికి కొంతవరకు ఒంట్లో నీటిశాతం తగ్గుతుండటమూ కారణమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రిపూట 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయే పెద్దవాళ్లకు ఒంట్లో నీటిశాతం తగ్గే(డీహైడ్రేషన్) ముప్పు 59 శాతం ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం.
కారణమిదే..
నిద్రపోతున్నప్పుడు మెదడులోని పీయూషగ్రంథి వాసోప్రెసిన్ సాయంతో ఒంట్లో నీటిని పట్టి ఉంచాలంటూ మూత్రపిండాలకు సంకేతాలు అందిస్తుంది. దీంతో మూత్రం అంతగా తయారుకాదు. ఒకవేళ నిద్ర తగ్గితే సరైన సమయానికి ఈ హార్మోన్ మూత్రపిండాలకు చేరక.. మూత్రపిండాలు నీటిని పట్టి ఉంచటమూ తగ్గుతుంది. ఇది నీటిశాతం తగ్గటానికి దారితీస్తుందన్నమాట.
కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపట్టేలా చూసుకోవటం మంచిది. ఒకవేళ అది కుదరకపోతే నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగటం ఉత్తమం. ఫలితంగా డీహైడ్రేషన్ దుష్ప్రభావాలను తప్పించుకోవచ్చు.
ఇదీ చదవండి: పేదలకేదీ పోషకాహారం? భారతీయుల్లో కొరవడిన కండర పుష్టి