దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉన్న వేళ.. మరో టీకా అందుబాటులోకి రావడం ఊరటనిస్తోంది. ఇప్పటికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వినియోగంలో ఉండగా.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాను అత్యవసరంగా ఉపయోగించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. వచ్చేవారం ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి రానుంది.
అయితే ఈ మూడు టీకాల సమర్థత ఎంత? టీకా వేయించుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలుంటాయి? రెండు డోసుల మధ్య విరామం ఎంత ఉండాలి? ఏ పద్ధతిలో వాటిని తయారు చేశారో ఓసారి చూద్దాం.
- స్పుత్నిక్- వి టీకాను భారత్లో ఉత్పత్తి చేసేందుకు డా.రెడ్డీస్ సంస్థ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
- కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి 6-8 వారాలు ఉండాలని మొదట ప్రభుత్వం తెలిపింది. 12-16 వారాల తేడా ఉంటే టీకా 90 శాతం సమర్థంగా పని చేస్తుందని పరిశోధనల్లో తేలడం వల్ల ఇటీవలే ఆ మేరకు వ్యవధిని పొడిగించింది.
- కరోనాపై ప్రభావం చూపుతున్నాయని పరిశోధనల్లో తేలాకే ఈ మూడు టీకాలకు అనుమతులిచ్చారు. టీకా తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత పెరుగతుంది. వైరస్ ద్వారా ప్రాణాలు కోల్పోయే ముప్పు కచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా మీకు అందుబాటులో ఉన్న టీకాను తీసుకొని మహమ్మారిపై పోరులో విజయం సాధించేందుకు సహకరించండి.