Belly fat loss tips: కొవ్వు అనేది చాలా మందికి ఉండే సమస్యే. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. కారణమేదైనా శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక ప్రస్తుత కాలంలో పొట్ట రాకుండా అనేక జాగ్రత్తలు పాటిస్తుంటారు కొందరు. అయితే, కొంతమందిలో శరీరం సన్నగా ఉన్నా.. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దానిపై వైద్యులు ఏం సలహా ఇస్తున్నారంటే..
"పొట్ట చుట్టూ కొవ్వు ఉండడాన్ని వైద్య పరిభాషలో సెంట్రల్ ఒబెసిటీ అంటారు. పొట్ట లావుగా ఉండడం వల్ల మీ కాళ్లు, చేతులు సన్నగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ.. మీరు లావుగా ఉన్నట్టే లెక్క. ఆహారం అతిగా తీసుకోవడం, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం.. లావుగా ఉండడానికి రెండు ప్రధాన కారణాలు. మితాహారం తీసుకుంటూ, తగిన ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట కొవ్వు దానంతట అదే తగ్గిపోతుంది. శారీరకంగా ఫిట్‌గా ఉంటారు" అని వివరించారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ విద్యా సాగర్.
గుండె జబ్బుల ముప్పు...
"సెంట్రల్ ఒబెసిటీ ఉన్నవాళ్లలో షుగర్, హైబీపీ, ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటన్నింటినీ వైద్య పరిభాషలో మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, హైబీపీ, షుగర్.. ఇలా మూడు రుగ్మతలు కలిసి ఉండడమే మెటబాలిక్ సిండ్రోమ్. ఇటీవల కాలంలో వాటికి ఫ్యాటీ లివర్ అనే సమస్య కూడా తోడవుతోంది. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవాళ్లలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిలో ఫ్యాటీ లివర్ ఉంటుంది కానీ.. గుండె జబ్బులు అంతకన్నా ప్రమాదకరంగా మారతాయి. అందుకే సెంట్రల్ ఒబెసిటీ ఉన్నవాళ్లు మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అనే టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ ఉన్నట్టు నిర్ధరణ అయితే తగిన వైద్యం చేయించుకోవాలి. అలా జాగ్రత్తపడితే భవిష్యత్‌లో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి" అని చెప్పారు డాక్టర్ విద్యా సాగర్.
ఇదీ చదవండి: