How To Prevent Worms In Stomach : చాలామంది పిల్లల్లో ఎక్కువగా కనిపించే సమస్య బరువు పెరగకపోవడం. నీరసంగా కనిపించడం. మూడు పూటలా తింటున్నా తమ పిల్లలు బరుకు పెరగకపోవడంపై చాలా మంది తల్లిదండ్రులు మదనపడుతుంటారు. లోపం ఏంటో అని తెలియక హైరానా పడుతుంటారు. పౌష్టికాహారం, బలవర్ధకమైన ఆహారం సమయానికి పెడుతున్నా పిల్లలు రోజురోజుకు నీరసించిపోతుంటే తల్లిదండ్రుల ఆవేదన వర్ణణాతీతం. ఈ సమయాల్లో తమ పిల్లలకు ఎందుకిలా జరుగుతుందంటూ డాక్టర్ల వద్దకు పరుగు పెడుతుంటారు.
పిల్లలను పరిశీలించి పరీక్షించిన అనంతరం వారు(డాక్టర్లు) చెప్పే కారణాలతో విస్తుపోతుంటారు. పిల్లలు బరువు పెరగకపోవడానికి, నీరసంగా ఉండటానికి కారణం వారి పొట్టలో ఉండే నులి పురుగులు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం నులిపురుగులు తినేస్తుండటం వల్ల పెరుగుదల లోపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
పిల్లల పొట్టలో నులిపురుగులా?
ముఖ్యంగా ఖాళీ ప్రదేశాల్లో మట్టిలో ఆడుకునే పిల్లలు ఎక్కువగా నులి పురుగుల సమస్యను అనుభవిస్తుంటారు. మట్టిలో ఆడటం వల్ల కాళ్లు చేతులకు మట్టి అంటుతుంది. దీనివల్ల వారి శరీరం, దుస్తులే కాదు కడుపు కూడా పాడవుతుంటుంది. మట్టిలో ఉండే నులిపురుగుల గుడ్లు పిల్లల గోళ్ల ద్వారా నోటిలోకి చేరి, అక్కడి నుంచి కడుపులోకి వెళ్లి అక్కడే తమ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా మట్టి ద్వారానే కాదు కలుషిత ఆహారం, నీటి ద్వారా కూడా నులి పురుగులు పొట్టలోకి చేరతాయి.
ఎన్నో సమస్యలు
పిల్లల కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు తిన్నది ఏదీ వంటపట్టదు. రోజురోజుకు బక్కచిక్కిపోతుంటారు. రాత్రులు తరచూ నిద్ర లేస్తుంటారు. మలద్వారం వద్ద దురద పెడుతుంది. అన్నిటికి మించి రక్తహీనత అనేది పెద్ద సమస్యగా మారుతుంది. నులిపురుగుల సమస్యతో పిల్లలు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఇమ్యూనిటినీ కోల్పోతారు. దీనివల్ల చదువులపై కూడా ప్రభావం పడుతుంది. నులిపురుగులను వామ్ ఇన్ఫెక్షన్స్(Warm Infections) అంటారు. హెల్మిన్స్ అనే క్రిములు ద్వారా నులిపురుగులు వ్యాపిస్తుంటాయి.
ఇవీ సమస్యలు
కడుపులో నులిపురుగులతోపాటు బద్దె పురుగులు కూడా ఉంటాయి. వీటి వల్ల పిల్లలకు కడుపు నొప్పి వస్తుంటుంది. మలద్వారం వద్ద దురద పుడుతుంది. రక్త హీనతతో బలహీనంగా తయారవుతారు. త్వరగా అలసిపోతారు. ఆడుకోడానికి, చదువుకోడానికి కూడా ఆసక్తి చూపరు. తక్కువ బరువు, తక్కువ ఎత్తు వంటి అనేక సమస్యలు బారిన పడుతుంటారు.
నులిపురుగులే కాదు
పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే పొట్టలో నులిపురుగులు, ఏలిక పాములు, బద్దె పురుగులు పెరుగుతుంటాయి. పెద్దల కన్నా, చిన్న పిల్లలకు ఇవి ప్రమాదకరంగా మారతాయి. బానపొట్టతో ఉండే పిల్లల్లో ఏలిక పాములు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల మలద్వారంలో దురద మినహా పెద్దగా సమస్యలు ఉండవు. అయితే ఏలిక పాములు ఒక్కోసారి పొట్ట నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల ఫిట్స్, ఉబ్బసం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
కొంకి పురుగులు- వీటి ద్వారా రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. మట్టితినే అలవాటు ఉన్న పిల్లలు కొంకి పురుగుల బెడదను ఎదుర్కొంటారు. ఇక మాంసాహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే పిల్లల పొట్టలో బద్దె పురుగులు చేరే అవకాశం ఉంటుంది. బద్దెపురుగులు పొట్టలో ఉన్నప్పుడు తలపోటు, మెదడులో కణుతులు ఏర్పడే ప్రమాదం ఉంది. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉంటే పిల్లలతోపాటు పెద్దలు కూడా ఆల్బెండసోల్ మాత్రలు గానీ టానిక్ గానీ వేసుకోవాలి అని సూచిస్తున్నారు డాక్టర్లు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నులిపురుగుల నివారణకు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి డీవార్మింగ్ ప్రక్రియ చేపట్టి పిల్లలు, పెద్దల్లో నులిపురుగుల నివారణకు కృషి చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోను, ఎక్కువగా మట్టిలో ఆడుకునే పిల్లలు, శుభ్రత లేని చోట పెరిగే పిల్లల్లో నులిపురుగుల సమస్య అధికంగా వస్తుంటుంది. అంతేకాకుండా నులిపురుగులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉన్నందున పిల్లలను సాధ్యమైనంత వరకు మట్టిలో ఆడనివ్వకుండా చూసుకోవాలి.
- చెప్పులు లేకుండా బయటకు వెళ్లకుండా చూడాలి.
- కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కునేలా సూచించాలి.
- గోళ్లు పెద్దవిగా ఉండకుండా ఎప్పటికప్పుడు కత్తిరించాలి.
పురుగులు ఉంటే మందులు వాడటం వల్ల రెండు వారాల్లో సమస్యను నివారించవచ్చు. ఇక మలద్వారం వద్ద దురదగా ఉంటే వ్యాసిలెన్ గానీ, ఆముదం గానీ రాయాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నులి పురుగుల సమస్య నుంచి పిల్లలను రక్షించుకోవచ్చు.
జుట్టు ఎక్కువగా రాలుతోందా? మీరు చేసే ఈ తప్పులే కారణం!
మీరు ఓవెన్ వాడుతున్నారా? - ఈ 6 వస్తువులు అందులో పెడితే చాలా డేంజర్!