వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే కరోనా కాలంలో వృద్ధుల్ని బయటకు రావద్దని పదేపదే చెబుతున్నారు వైద్యులు. అలా అని ఇంట్లోనే కదలకుండా కాళ్లనొప్పులు, కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అయితే అతి సులభమైన ఓ 5 రకాల కసరత్తులు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాక.. రోగ నిరోధక శక్తినీ పెంచుకోవచ్చని చెబుతున్నారు వ్యాయామ నిపుణులు ప్రదీప్ మౌర్య. 12 నిమిషాల్లో ప్రతి వ్యాయామం 7 సార్లు చేయాలని సూచిస్తున్నారు. అలసటగా ఉంటే మాత్రం వెంటనే విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఆ కసరత్తులు ఏంటో చూద్దాం.
సోఫా స్క్వాట్స్
మీ కాళ్లు ఎడంగా ఉంచి సోఫా ముందు నిటారుగా నిల్చోవాలి. తర్వాత చేతులు ముందుకు చాచి... నడుము భాగం కొంచెం వెనక్కు నెట్టాలి. అనంతరం మోకాళ్లపై బరువు ఉండేలా కూర్చోవాలి. మళ్లీ యథాస్థితికి రావాలి.
క్యామెల్ క్యాట్ పోజ్
మోకాళ్లు మీద కూర్చొని మీ చేతులను ముందుకు ఉంచి వంగాలి. తర్వాత తల కిందకు వంచి కేవలం చేతులతో వృత్తాకారం వచ్చేలా నడుము భాగం పైకి లేపాలి. దీనిని క్యాట్ పోజ్ అంటారు. తర్వాత కొంచెం ఆగి సాధారణ స్థితికి వచ్చి మోకాళ్లు, చేతుల మీద అలాగే ఉండి... మీ తలను మాత్రమే కొంచెం పైకి ఎత్తాలి. దీనిని క్యామెల్ పోజ్ అంటారు. ఇలా కొన్ని సార్లు చేయాలి.
బాటిల్ షోల్డర్ ప్రెస్
మీ కాళ్లు దూరంగా జరిపి నిటారుగా నిల్చోవాలి. తర్వాత రెండు చేతులతో నీళ్లతో నింపిన బాటిళ్లను మీ తలకు సమాంతరంగా ఉండేలా మోచేతులను వంచి పట్టుకోవాలి. తర్వాత చేతులను నిటారుగా పైకి లేపాలి. మళ్లీ నెమ్మదిగా యథాస్థితికి తీసుకురావాలి.
వాల్ పుష్అప్స్
గోడకు రెండు అడుగుల దూరంలో నిల్చోవాలి. మీ రెండు అరచేతులను భుజాలకు కొంచెం ఎత్తులో గోడపై ఆనించాలి. తర్వాత మీ బరువు అంతా చేతులపై ఉండేలా పుష్ చేయాలి. తిరిగి నెమ్మదిగా వెనక్కి రావాలి.
స్టాండింగ్ కాఫ్ రైజెస్
రెండు కాళ్లను దూరంగా ఉంచి నిటారుగా నిల్చోవాలి. అనంతరం వేళ్లు మీద మీ శరీరాన్ని పైకి లేపాలి. తిరిగి నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకోవాలి.
ఇదీ చూడండి: నింబు షరబత్ ఉండగా.. నీరసంపై దిగులేల దండగ