How To Cure Spine Problems : సాధారణంగా వెన్నె నొప్పి నడుం బెనకడం వల్ల కానీ, వెన్ను పూసల్లో పగులు వల్ల కానీ లేదా ఏదైనా ప్రమాదం వల్ల కానీ మొదలవుతుంది. ఇవి సాధారణ కారణాలు. ఆర్థరైటిస్ వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. అంతేకాకుండా.. అధిక బరువు ఉండేవారికి, ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని ఉండే వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే సాధారణ వెన్ను నొప్పి కొద్ది రోజులు లేదా వారాలకు తగ్గిపోవచ్చు.
పరిష్కారం మన చేతుల్లోనే
చాలా వరకు వెన్నునొప్పిని మన ప్రయత్నాలతోనే తగ్గించుకోవచ్చు. మీ వెన్నెముక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే.. ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అంతేకానీ వెన్నెముక సంబంధించిన వ్యాయామాలు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వైద్యులు, జిమ్ ట్రైనర్ల సలహా తీసుకుని వెన్నెముక బలోపేతానికి తగిన వ్యాయామాలు ఎంచుకుని.. వాటిని రోజూ చేస్తే ఒత్తిడి దూరమై ఉపశమనం కలుగుతుంది.
డిస్క్ జాగ్రత్త!
మన వెన్నులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి మెడ, వీపు, నడుము. వీటిల్లో మెడ, నడుము బాగా కదులుతాయి. అందువల్ల అక్కడ భారం పడి మార్పులు జరగడం సాధారణమే. కానీ అవి ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు. వెన్నెముకలో ఉండే ఒక్కో ఎముక మధ్య ఒక డిస్క్ ఉంటుంది. ఎముకల మధ్య రాపిడి జరిగినప్పుడు వాటికి ఏమీ కాకుండా ఉండేందుకు ఇది సాయపడుతుంది. ఈ డిస్కు కొంచెం మృదువుగా ఉంటుంది. వెన్ను కదిలిన ప్రతిసారీ ఇది కొంచెం అరిగే అవకాశముంటుంది. కదలిక జరిగే ప్రాంతంలో అరుగుదల సాధారణం. ఆ కదలికలు సాధారణ స్థాయిలోనే చేస్తే ఏం కాదు కానీ.. అధికమైతే అరుగుదల ఎక్కువై సమస్య ఉత్పన్నమవుతుంది.
నిదురించే భంగిమలతో సమస్య
ఒక్కోసారి మనం నిదురించే భంగిమ కూడా వెన్ను నొప్పి సమస్యకు కారణమవుతుంది. ఈ నొప్పితో బాధపడేవారు వెల్లకిలా పడుకుంటే.. మోకాళ్ల కింద ఒకటి, నడుము దిగువ భాగంలో ఒక దిండు పెట్టుకోవాలి. బాగా మెత్తగా, గట్టిగా ఉండే పరుపులు ఈ నొప్పికి కారణమవుతాయి. వీటికి బదులు మధ్యస్థంగా ఉండేవి మంచివి. అయితే వీటిని ఎవరికి వారే.. వారి సౌకర్యాన్ని అనుసరించి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
వెన్ను పరీక్షలు
వెన్నుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కూర్చొనే పద్ధతి ఎలా ఉండాలి? మెడ ఎలా ఉండాలి? వ్యాయామాలు ఏం చేయాలి? అనే అంశాలను నిపుణుల దగ్గర తెలుసుకోవాలి. ఇది మన చేతులోనే ఉంది. కానీ వయస్సు మీద పడిన తర్వాత.. నొప్పులు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదిస్తే బోన్ డెన్సిటీ పరీక్ష చేసి, దాని ఫలితాన్ని అనుసరించి మందులు ఇస్తారు. ఇవి రెండే కాకుండా.. ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఈ వెన్ను నొప్పి రావచ్చు. దీని గురించి భయపడవలసిన అవసరం లేదు కానీ ముందు నుంచే జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లలకు కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదముంది. తరచూ ఫోన్ చూడటం వల్ల, బాగా మెడ వంచడం వల్ల, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా వెన్ను సమస్య వచ్చే అవకాశముంది.
అతిగా ఫోన్ వాడకండి!
సాధారణంగా ఈ-మెయిల్స్ లాంటి సుదీర్ఘ సందేశాలను సెల్ఫోన్లో టైప్ చేయాలంటే మెడను వంచాలి. ఇది మెడ దగ్గర ఉండే సున్నితమైన వెన్నుపూసల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కనుక ఇలాంటి వాటిని వీలైనంత వరకు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లోనే టైప్ చేసి పంపించడం మంచిది. మీరు ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారైతే.. మీ కుర్చీ వెనక భాగం 110 డిగ్రీల కోణంలో ఉండాలి. అది కూడా ముందుకి, వెనక్కి కదిలేలా ఉండాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఇక సిస్టం ముందు పనిచేసే వారైతే మీ కంప్యూటర్ మానిటర్‌పై భాగం.. మీ కంటి చూపు లెవల్ కంటే రెండు మూడు అంగుళాల ఎత్తులో ఉండాలి. అలాగే కీబోర్డ్ మోచేతుల కంటే కొంచెం తక్కువ ఎత్తులో ఉండేట్లు చూసుకోండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు నిలుచోవడం, శరీరాన్ని సాగదీసినట్లు చేయండి. మనం కూర్చొనే పొజిషన్ వల్ల, అధిక బరువులు ఎత్తడం వల్ల, ఎత్తు మడమల చెప్పులు ధరించడం వల్ల, ఒంటికి అతుక్కుపోయే జీన్స్ వేసుకోవడం వల్ల.. వెన్నెముకపై తీవ్రమైన దుష్ఫ్రభావం పడుతుంది. అలాగే వెనుక జేబులో పర్సు పెట్టుకోవటమూ వెన్నెముకపై ఒత్తిడి కలిగిస్తుంది. కనుక ఇలాంటి పనులు చేయకుండా ఉండే చాలా వరకు వెన్ను సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు.
How to Remove Pesticides from Fruits : పండ్లు, కూరగాయలపై ఉన్న పురుగు మందులు ఇలా తొలగించండి!