గుల్కంద్.. ఇది పలు రకాల స్వీట్ల తయారీలోకి వాడే మిశ్రమమే అయినా దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ కాస్త గుల్కంద్ను తింటే అల్సర్సు, రక్తస్రావం వంటి సమస్యలను దూరం చేయొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ గుల్కంద్ను ఎలా తయారు చేసుకోవాలంటే..
కావాల్సిన పదార్థాలు - ఎండురోజా పువ్వు రేకులు, తేనె, పంచదార, యాలకపొడి
తయారీ విధానం
ఓ బౌల్ తీసుకుని అందులో ఈ పదార్థాలు అన్నిటినీ లేయర్స్‌గా వేసుకోవాలి. ముందుగా చక్కెర వేసి ఆపైన గులాబీ రేకులు వేయాలి. మళ్లీ పంచదార, ఆ పైన గులాబీ రేకులు వేసుకుంటూ చివరగా పైన పంచదారను వేయాలి. గులాబీ రేకులు, షుగర్ సమాన స్థాయిలో తీసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని రోజూ మూడు వారాలపాటు ఎండపెట్టాలి. అప్పటికి ఇది పాకంగా మారి జామ్లా తయారవుతుంది. ప్రతిరోజు ఎండలో పెట్టి తీసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.
ఈ మిశ్రమం తయారయ్యాక అందులో రుచి కోసం తేనె, కాస్త యాలకపొడి కలుపుకుంటే గుల్కంద్ రెడీ. ఈ గుల్కంద్ మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. దీనిని రోజూ భోజనం తిన్న తర్వాత 3 నుంచి 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు.
ప్రయోజనాలు..
గుల్కంద్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. గుల్కంద్ తీసుకోవడం ద్వారా రక్తస్రావం, వేడి చేసి ముక్కలోంచి రక్తం కారడం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అల్సర్స్‌తో బాధపడేవారికి కూడా ఈ గుల్కంద్ చక్కటి ఔషధం. యష్టిమధు పొడిని ఓ 2 గ్రాములు ఇందులో కలుపుకుని 15 రోజుల పాటు తీసుకుంటే అల్సర్స్ తగ్గిపోతాయి.
అయితే.. మధుమేహంతో బాధపడుతున్న వారు మాత్రం ఈ గుల్కంద్ తీసుకోవడానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : విటమిన్ లోపం ఉందా? ఈ 'గ్రీన్సూప్' తీసుకుంటే సరి