heartbeat rate : లబ్డబ్.. లబ్డబ్.. అంటూ నిరంతరం కొట్టుకునే గుండె వేగం అన్నిసార్లు ఒకేలా ఉండదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరి శరీరం.. వాళ్లు చేసే పనులపై ఆధారపడి ఉంటుందని అన్నారు. గుండె వేగాన్ని బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని తెలిపారు.
విశ్రాంతి గుండె వేగం
Normal Person heartbeat rate : విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రక్తాన్ని పంప్ చేయటానికి గుండె ఎక్కువగా కష్టపడాల్సిన పనుండదు. అందుకే నెమ్మదిగా కొట్టుకుంటుంది. ఇలా విశ్రాంతిగా ఉన్నప్పుడు నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని ‘రెస్టింగ్ హార్ట్ రేట్’ అంటారు. ఇది ఆరోగ్యవంతుల్లో చాలావరకు 60-100 మధ్యలో ఉంటుంది. సాధారణంగా మంచి శారీరక సామర్థ్యం గలవారిలో విశ్రాంతి గుండె వేగం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు- పరుగు, ఈత వంటి ఆటలాడే క్రీడాకారుల్లో ఇది 40ల్లోనే ఉంటుంది. మరీ కష్టపడకుండానే ఇలా శరీరం మొత్తానికి రక్తాన్ని పంప్ చేయటాన్ని గుండె ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. ఇంతకీ విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని తగ్గించుకునేదెలా? ప్రశాంతంగా కూర్చొని, గ్లాసు నీళ్లు తాగితే గుండె వేగం నెమ్మదిస్తుంది. కొద్దిసేపు గాఢంగా శ్వాస తీసుకున్నా సరే. రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం, మంచి పోషకాహారం తినటం, బరువు అదుపులో ఉంచుకోవటం.. మద్యం, కెఫీన్ మితిమీరకుండా చూసుకోవటం, పొగ అలవాటు మానెయ్యటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ దీన్ని సాధించొచ్చు. ఒత్తిడిని తగ్గించే ధ్యానం, ప్రాణాయామం వంటివీ మేలు చేస్తాయి.
గుండె వేగం-వ్యాయామం
Heartbeat rate High : కష్టమైన పనులు, వ్యాయామాలు చేస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవటం తెలిసిందే. అయితే దీనికీ ఒక పరిమితి ఉంది. ఇది గరిష్ఠ గుండె వేగం మీద ఆధారపడి ఉంటుంది. వయసును పరిగణనలోకి తీసుకొని దీన్ని లెక్కిస్తారు. ముందుగా 220 నుంచి వయసును తీసేస్తారు. ఉదా: 50 ఏళ్లు ఉన్నాయనుకోండి.. 220 నుంచి 50 తీసేయగా మిగిలే 170ని గరిష్ఠ గుండె వేగంగా పరిగణిస్తారు. అంటే 50 ఏళ్ల వయసువారిలో గుండె ఎక్కువలో ఎక్కువగా 170 సార్లు కొట్టుకున్నా ఇబ్బంది లేదని అర్థం. అయితే వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఇందులో కొంతవరకే చేరుకునేలా చూసుకోవాలి. ఇప్పుడిప్పుడే వ్యాయామాలు మొదలెడితే గరిష్ఠ వేగంలో సగం వరకే చేరుకునేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేవారు 85% వరకు చేరుకోవచ్చు. ట్రెడ్‌మిల్ వంటి కొన్ని యంత్రాలు, పరికరాలు గుండె వేగాన్ని లెక్కించి చూపిస్తుంటాయి. వీటిని బట్టి తేలికగానే దీన్ని గుర్తించొచ్చు.
ఇతర పరిస్థితులు
Resting Heart rate : వేడి, తేమ వంటి బయటి పరిస్థితులూ గుండె వేగం పెరిగేలా చేయొచ్చు. తీవ్రమైన భావోద్వేగాలకు లోనవ్వటం, ఆందోళన వంటి వాటితోనూ గుండె వేగం పెరుగుతుంది. కొందరికి కూర్చొని పైకి లేచినప్పుడూ కొద్ది సెకన్ల పాటు గుండె వేగంగా కొట్టుకోవచ్చు. గుండె వేగం విషయంలో వీటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
- ఇదీ చదవండి : Omicron Spread: అలసత్వం వద్దు.. ఆందోళన వద్దు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!