Health Benefits Of Onion Peel : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనేది చాలా మందికి తెలిసిన సామెత. అయితే ఇప్పుడు ఈ సామెతను కాస్త సవరించి రాసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ తొక్కలు చేసే మేలు మరెవ్వరూ చేయలేరని చెప్పుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లి తొక్కలతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.
అనేక ప్రయోజనాలు
ఉల్లిపాయ యాంటీబయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్, ఈ లక్షణాలు ఉండే వీటిని తినడం ద్వారా మనలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి. వీటిలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం స్థాయులు చాలా తక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇవి తెలియక మనలో చాలా మంది ఉల్లిపాయ తొక్కలను వలిచి వృథాగా పడేస్తుంటారు. నిజానికి ఉల్లిపాయ తొక్కలు మంచి పోషకాలని అందించడమే కాకుండా జుట్టుకు ఎంతో మేలును చేకూరుస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలోనూ సాయపడతాయి.
ఉల్లిపాయ తొక్కల టీ
ఉల్లిపాయ తొక్కలను నీటిలో పది నుంచి ఇరవై నిమిషాల ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని వడకట్టుకొని ఆరోగ్యకరమైన టీని కూడా తయారుచేసుకొని తాగవచ్చు. ఉల్లిపాయ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఊబకాయం, అధిక రక్తపోటును దూరం చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.
చర్మం దురదకు ఉపశమనం
ఉల్లిపాయ తొక్కల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. దీంతో చర్మంపై దద్దుర్లు, అథ్లెట్స్ కాళ్లపై దురదను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని రాయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
హెయిర్ డై
సల్ఫర్ ఫుష్కలంగా ఉండే ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించి నెరిసిన జుట్టు రంగు మార్చుకోవచ్చు. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తొక్కలు నల్లగా కాలేంత వరకు మీడియం మంట మీద వేడి చేసి తొక్కలను మెత్తగా నలపాలి. దీనికి కొద్దిగా కలబంద జల్ లేదా నూనెను కలపాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని నేరుగా హెయిర్ డ్రైలా అప్లై చేసి గ్రే హెయిర్‌ను తగ్గించుకోవచ్చు.
మంచి కంపోస్ట్
కంపోస్టు తయారు చేయడానికి ఉల్లిపాయ తొక్కలు గొప్పగా సాయపడతాయి. అలాగే వీటిని సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిలో ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. వీటితో మంచి కంపోస్ట్ తయారవుతుంది.
సూప్స్ అండ్ గ్రేవీ
స్టాక్, సూప్, గ్రేవీ మరుగుతున్న సమయంలో ఉల్లిపాయ తొక్కలను ఆహార పదార్థాల్లో జోడించడం ద్వారా మంచి రుచితోపాటు చక్కటి రంగును అందిస్తుంది. గ్రేవీని చిక్కగా మారుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పీల్స్ తొలగించడం మర్చిపోవద్దు.
మంచి నిద్ర
ఉల్లిపాయ తొక్కలలో ఉండే ఎల్ ట్రిప్టోఫాస్ అనే అమైనో ఆమ్లం సహజమైన మత్తుమందులా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్క టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
హెయిర్ టోనర్
పొడి జుట్టు, నిస్తేజమైన జుట్టు కోసం ఉల్లిపాయ తొక్కలను హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీళ్లలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా టోనర్ తయారుచేసుకోవచ్చు. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని అప్పుడప్పుడు జుట్టుకు పట్టించాలి.
ఈసారి ఉల్లిపాయ తొక్కలను చెత్తకుండీలో విసిరేయకుండా వాటిని సద్వినియోగం చేసుకునేలా చూసుకోండి. టీ, హెయిర్ డై, టోనర్‌గా, ప్లేవర్ ఏజెంట్‌గా, కంపోస్ట్‌గా ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించే ముందు తొక్కల్లో రసాయన అవశేషాలు, పురుగులు లేకుండా శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు.