వాతావరణ కాలుష్యంతో పాటు మన స్వయం కృతాపరాధం.. మన జట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దాని వల్ల చిన్న వయసులోనే కేశాలు రాలిపోవడం, తెల్ల వెంట్రుకలు రావడం ఎక్కువైపోతోంది. వీటి కారణంగా వివిధ షాంపులు, కండిషనర్లు, డైలు వాడుతున్నారు. ఈ సమస్యలు అన్ని వయసుల వారిలో ఉన్నాయి. ప్రత్యేకంగా తెల్ల వెంట్రుకలకు విరుగుడుగా.. చాలా మంది డైని ఎంచుకుంటున్నారు. వివిధ కెమికల్స్‌తో డైలు తయారవుతాయి కాబట్టి.. వాటిని వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందామా..
హెయిర్ డైలు ఎందుకు ప్రమాదం..
ఈ రోజుల్లో 30 ఏళ్లు పైబడిన చాలా మంది తెల్లవెంట్రుకల సమస్యతో బాధపడుతున్నారు. అలా వాడుతున్న వారిలో.. డై వాడకం మంచిదేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? అనే సందేహాలుంటాయి. అయితే సైడ్ ఎఫెక్ట్స్ రానంతవరకు డై వాడడం మంచిదేనంటున్నారు వైద్యులు. 'గతంలో డైలలో ఎక్కువగా అమ్మోనియా ఉండేది. దీంతో వీటిని ఉపయోగించేవారిలో.. ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. ప్రస్తుతం వస్తున్న డైలలో అమ్మోనియా ఉండటం లేదు. అయితే వీటిలో హెయిర్ డైలలో.. పీపీడీ(పారా ఫెనిలిన్ డైమైన్) ఉంటుంది. ఇందులో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. దీనివల్ల అలర్జీలు కూడా వస్తాయి'.
అలర్జీలకు సంకేతాలు ఇవే ..
'ఈ పీపీడీ ఉన్న డైలు వాడిన వారిలో.. తలలో పొక్కులు రావడం, దురదలు రావడం లేదా నుదురు, కంటిచూట్టూ దద్దుర్లు, వాపులు లేదా చెవి చూట్టూ వాపులు లాంటివి వస్తే అలర్జీ మొదలవుతుందనటానికి సంకేతం. ఒకసారి అలర్జీ వస్తే.. అది జీవిత కాలం ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా హెయిర్ డైలు వినియోగించే వారిలో కనిపించే మరో సమస్య ఫేషియల్ పిగ్మెంటేషన్. దానితో పాటుగా ముఖంపై మచ్చలు కుడా వస్తాయి. ఇలా అయితే కెమికల్స్ డైలు పడటం లేవని అర్థం. ఈ లక్షణాలు ఉన్నవారు హేర్ డై ఆపేయడం ఉత్తమం.
పరిష్కారాలేంటి..
రసాయనాలు ఉన్న డైలు వాడే బదులు హైర్బల్, వెజిటబుల్ హెయిర్ డైలను వాడాతే మంచి ఫలితాలు ఉంటాయి. వీటిని వాడితే 90 నుంచి 95 శాతం వరకు అలర్జీలు వచ్చే అవకాశం ఉండదు. అయితే హెర్బల్, వెజిటేబుల్ డై కలర్స్ ఉపయోగించేటప్పుడు.. తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ల సలహా తీసుకోవాలి.