ఈ మధ్య మునగాకులోని పోషకాల గురించి ఎక్కువగా వింటున్నాను. నా జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మునగాకుతో ఎటువంటి వంటకాలు చేసుకోవచ్చో చెబుతారా?
దక్షిణాదిలో ఆషాఢం మొదలుకుని శీతాకాలం ముగిసేంతవరకూ మునగాకుతో వివిధ రకాల వంటకాలు చేసుకుంటూ ఉంటారు. కూర, పప్పు మాత్రమే కాకుండా.. కొంతమంది మునగాకుతో నిల్వపచ్చడి కూడా చేసుకుంటారు. ఇక పోషకాల విషయానికి వస్తే మునక్కాయలో కంటే ఆకులోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మునగలోని కెరొటినాయిడ్స్ పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచి.. ఒత్తిడిని తగ్గించి వెంట్రుకలు రాలిపోకుండా చూస్తాయి.
మునగాకులో విటమిన్ ఎ క్యారెట్‌లో కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. పాలలో కంటే క్యాల్షియం నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. ఒక గుడ్డులో ఉండేన్ని ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ ఎ అధికంగా ఉండే ఈ ఆహారం.. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, కంటిచూపు మెరుగవడానికీ, వెంట్రుకలు బలంగా, ఒత్తుగా ఎదగడానికీ సాయపడుతుంది.
మునగాకు చారు
కావాల్సినవి: మునగాకు- 50గ్రా, నీళ్లు- 100 ఎమ్.ఎల్, చింతపండు- నిమ్మకాయంత, వెల్లుల్లిరెబ్బలు- రెండు, చారుపొడి- చెంచా, టమాటా- ఒకటి, పంచదార- కొద్దిగా, ఉప్పు- రుచికి తగినంత, తాలింపు కోసం: ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు
తయారీ: మునగాకుని శుభ్రంచేసి కచ్చాపచ్చాగా దంచి మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత వడకట్టుకోవాలి. ఒక పాత్రలో 100 ఎమ్.ఎల్ నీటిని మరిగించుకుని అందులో చింతపండు, వెల్లుల్లి, పంచదార, ఉప్పు, చారుపొడి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మరిగించుకోవాలి. ఆవాలు జీలకర్రతో తాలింపు వేసుకుని అందులో చింతపండు రసం, మునగాకు రసం వేసి రెండు నిమిషాల తర్వాత దింపుకోవాలి.
- డాక్టర్ పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు
ఇవీ చదవండి:నేను తిరిగి నా జుట్టును పొందగలనా?