సంగీతం మన మెదడులోని వివిధ భాగాలను ఉత్తేజితం చేస్తుంది. ఇది కేవలం ఆనందానికి సంబంధించిందే కాదు, ఆరోగ్యం ఇనుమడించటానికీ తోడ్పడుతుంది. సంగీతం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడుతున్నట్టు శాస్త్రీయంగానూ రుజువైంది.
సంగీతం వింటున్నా, సంగీతాన్ని సృష్టిస్తున్నా.. అంటే వాద్య పరికరాలను వాయించినా, గానం చేసినా మెదడులో కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు విడుదలవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి మనం చేస్తున్న పనిని మరింత ఎక్కువసేపు చేసేలా పురిగొల్పుతున్నాయని.. దీంతో మరింత ఎక్కువ సేపు వ్యాయామం చేయటానికి అవసరమైన ఉత్సాహం లభిస్తోందని కనుగొన్నారు.
సాధారణంగా మనకు వినబడే శబ్దాలు మస్తిష్క మూలంలో విభజన చెందటం మొదలవుతుంటాయి. గుండె, శ్వాస వేగాలనూ ఇదే నియంత్రిస్తుంటుంది. అందువల్ల మనసుకు ప్రశాంతతను చేకూర్చే సంగీతం మూలంగా గుండె కొట్టుకునే వేగం, శ్వాస వేగం, రక్తపోటు సైతం తగ్గుముఖం పడతాయి. తమ అభిరుచులకు అనుగుణంగా సంగీతాన్ని ఎంచుకోవటం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనమూ కనబడుతుండటం విశేషం.
ఇదీ చదవండి: అల్పాహారంతో అనంతమైన శక్తి!